Home తాజా వార్తలు ఏడుపాయల జాతరలో ఎటుచూసిన జనారణ్యం

ఏడుపాయల జాతరలో ఎటుచూసిన జనారణ్యం

రెండో రోజు భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు
అమ్మవారికి బోనాల సమర్పణ, శకటాల ఊరేగింపు
ఏడుపాయల ప్రాంగణలో ఎటుచూసిన గుడారాలు – లక్షల్లో జనాలు

Edupayala Jatara

మన తెలంగాణ/పాపన్నపేట: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారికి భక్తజనం నీరాజనం పలికారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా కన్నుల పండువగా రెండవ రోజైన మంగళవారం కొనసాగాయి. జాతరకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మంజీరానదిలో పున్యస్నానాలు ఆచరించి అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులు నెత్తిమీద బోనం పెట్టుకొని శివసత్తులు పునకాలు, పోతరాజుల నృత్యాలు డప్పుచప్పుడ్ల మేలాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. అంతేకాకుండా వనదుర్గాభవాని అమ్మవారికి భక్తులు కుంకుమార్చన, విశేష పూజలు ఆలయ పూజారులు, వేద పండితులు గోషలతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్త పరవమశంతో ఓలలాడుతున్నాయి.

ఏడుపాయల జాతర ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం అత్యంత వైభవంగా శకటబ్రహ్మోత్సవము, ఎడ్ల బండ్ల ఊరేగింపులు ప్రధాన ఆకర్షనగా నిలిచింది. లక్షలాది మంది భక్తులు తిలకించడానికి ఏడుపాయల భక్త జనం పోటేత్తారు. బండ్ల ఊరేగింపులో శివసత్తుల పునకాలు, పోతరాజుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ జాతరలో అతిప్రధానమైన బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో బండ్లకు అందమైన రంగు రంగుల చీరలు, వేపకోమ్మలతో అలంకరించిన బండ్లకు రంగు రంగుల మెరుపు కాగితాలు, దేవతా పటాలు ఆకర్షనీయంగా కనిపించాయి. ఎడ్ల బండ్ల ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దుర్గామాతకు జై జై అంటూ దద్దరిల్లేలా భక్తులు నినాదాలు చేశారు. ఏడుపాయల జాతరలో రెండవ రోజైన బుధవారము నాడు బండ్లు తిరుగే కార్యక్రమం ప్రధాన ఆకర్షన నిలిచింది. బండ్ల ముందు శివసత్తుల పునాకాలతో శిగాలు ఊగుతుండగా శకట బ్రహ్మోత్సం ప్రారంభమైంది.

ఆనావాయితి ప్రకారం మొట్ట మొదటి సారిగా పాపన్నపేట సంస్థానదీశుల తరుపున ముందుగా వారి బండి తిరుగగా వెనుక పలు గ్రామాలకు చెందిన బండ్లు వరుస క్రమంలో తిరుగుతాయి. ఈ బండ్ల ఊరేగింపు చూడడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొదట తిరిగే పాపన్నపేట సంస్థానదీశుల బండికి ఆలయ చైర్మేన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇవో మెహన్‌రెడ్డి, ఆర్డీవో వీరబ్రహ్మచారి, డిఎస్పీ క్రిష్ణమూర్తి, సీఐ రాజశేఖర్‌లు కొబ్బరికాయాలు కొట్టి అధికారికంగా ఘన స్వాగతం పలికి ఏడుపాయల్లో బండ్లు తిరిగే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బండ్ల ముందు బైండ్లవారి డప్పుమోతలతో యువకులు నృత్యాలు చేస్తూ దుర్గామాతను స్మరిస్తు చిందులేస్తున్న దృశ్యాన్ని ఏడుపాయలకు వచ్చిన లక్షలాది మంది భక్తులు భవనాలు, కొండలు ఎక్కి ఎడ్లబండ్లను చూసి పరవశించిపోయారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో అక్కడక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. శివసత్తులు బండ్ల ముందు నృత్యాలు చేస్తు మహిళలు అమ్మవారికి బోనాలు తీసే కార్యక్రమం అందరిని ఆకట్టుకున్నాయి.

ఏడుపాయల్లో భక్తులు ఎటుచూసిన రెండు కిలోమీటర్ల దూరం వరకు తమ తమ గుడారాలను ఏర్పర్చుకొని అందంగా కనబడుతున్నారు. ఎప్పుడు నిర్మాష్యుంగా ఉండే ఏడుపాయల ప్రాంతంలో మంగళవారము నాడు జనారణ్యంగా మారిపోయింది. బండ్ల ఊరేగింపులో సమన్వయంతో జాతర ప్రాంగణంలో ఇసుకవేస్తే రాలనంత జనం కిటకిటలాడింది. ఆలయం ముందు సంతాన గుండంలో సంతానం కలుగాలను దంపతులు స్నానాలు ఆచరించారు. అదే విధంగా మూడు రోజుల పాటు సాగే ఉత్సవాల్లో భాగంగా రాత్రి వేళల్లో జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గోని కార్యక్రమాలను తిలకించి ఆహ్లాదంగా గడిపారు.

అమ్మవారిని దర్శించుకున్న హరీష్ రావు 

వనదుర్గాభవానిని దర్శించుకున్న హరీష్ రావు

ఏడుపాయల జారతలో భాగంగా రెండవ రోజు మంగళవారం వనదుర్గాభవాని అమ్మవారిని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఇఒపి. మోహన్‌రెడ్డి, చైర్మెన్ పి. విష్ణువర్ధన్‌రెడ్డిలు రాజగోపురం వద్ద నుండి మర్యాధపూర్వకంగా పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరిని ఆలయ చైర్మెన్ విష్ణువర్ధన్‌రెడ్డి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్‌ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, వైస్ ఎంపిపి విష్ణువర్ధన్‌రెడ్డి, బాలాగౌడ్, మండల పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, పాలక మండలి డైరెక్టర్లు శ్రీధర్, దుర్గయ్య, నాగప్ప, గౌరిశంకర్, నాగయ్య తదితరులు ఉన్నారు.

 

Edupayala Jatara Started in Medak in Telangana