Home తాజా వార్తలు చర్మ మృత కణాలను తరిమికొట్టండి!

చర్మ మృత కణాలను తరిమికొట్టండి!

 

Munthani-Matt

 

ఈ రోజుల్లో వయసు తక్కువగా ఉన్నా ముఖానికి ముడతలు, చర్మం వడలిపోయి కాంతివిహీనంగా తయారవుతోంది. అందులోనూ ఇప్పటి కాలం అమ్మాయిలు ఆరోగ్యంగా, అందంగా కనిపించాలనుకుంటున్నారు. మార్కెట్లో దొరికే ఫేస్‌ప్యాక్‌లపైన మక్కువ చూపుతున్నారు. కానీ వంటింట్లో సహజంగా దొరికే వస్తువులతోనే ఫేస్‌ప్యాక్‌లను తయారుచేసుకోవచ్చు.

ముల్తానీ మట్టి: సున్నితమైన లేదా పూర్తిగా పొడిచర్మం కలిగిన వారికి ముల్తానీమట్టితో చేసిన ఫేషియల్ బాగా ఉపకరిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా వేసుకున్నట్టయితే ముఖసౌందర్యం మెరుగుపడి వయస్సు తక్కువ ఉన్నవారిలా కనిపిస్తారంటున్నారు నిపుణులు. దీని కోసం రెండు స్పూన్ల ముల్తానీమట్టి తీసుకొని దానికి సమానంగా పాలమీగడ తీసుకుని బాగా కలిపి ముఖమంతా పట్టించి కనీసం పావు గంటపాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ముల్తానీమట్టి చర్మానికి కావలసిన తేమను అందించి ముఖం కాంతిమంతంగా చేస్తుంది. పాలు, పాలాధారిత ఉత్పత్తులు వాడడానికి ఇష్టపడని వారు రోజ్‌వాటర్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధమైన ప్యాక్‌ని కొన్ని వారాల పాటు వేసుకుంటే ముఖ చర్మం బిగుతుగా మారి మునుపటి సౌందర్యాన్ని పొందుతుంది.

కోడిగుడ్డు: తెల్లసొన ఓ చిన్న గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొన తీసుకుని దానికి టేబుల్‌స్పూన్ నిమ్మరసం, కొద్దిగా విటమిన్‌ఇ ఆయిల్ జతచేసి బాగా గిలక్కోట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి బాగా ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా చేయడానికి ఈ మిశ్రమం బాగా ఉపకరిస్తుంది. కోడిగుడ్డు తెల్లసొనను నేరుగా ముఖానికి పట్టించి ఆరనిచ్చి, శుభ్రం చేసుకున్నా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

పెరుగు, నిమ్మరసం: ఇది చాలామందికి తెలిసిన ఫేస్‌ప్యాక్. ఈ రెండింటిని సమపాళ్లల్లో తీసుకుని ముఖానికి, మెడకు పట్టించి ఆరనిచ్చి అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖచర్మం కాంతులీనుతూ మెరుస్తుంది. ఈ ప్యాక్‌ని వారానికి ఒకసారన్నా వేసుకుంటే యవ్వనవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా శరీరమంతా రాసుకుని ఆరిన తరువాత స్నానం చేస్తే చర్మం తాజాగా మారుతుంది.

ఆముదం: స్పూన్ ఆముదానికి కొన్ని చుక్కలు లావెండర్‌ను జతచేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాత్రిపూట రాసుకుని తెల్లవారిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఈ విధంగా చేయడంతో పాటు మెరుస్తూ కనిపిస్తుంది. అయితే జిడ్డు, సున్నిత చర్మం కలిగిన వారు ఈ ప్యాక్‌ని వేసుకోకూడదు.

బొప్పాయి: బొప్పాయిలోని విటమిన్‌సి, యాంటీ ఆక్సిడెంట్లు చరానికి ఆరోగ్యంతోపాటు వయస్సును కనపడకుండా చేయడానికి దోహదపడతాయి. తేనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడటమే కాకుండా దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించడానికి సహాయపడతాయి. రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జుకి టేబుల్‌సూన్ తేనె జతచేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటిలో దూది ముంచి ఈ ప్యాక్‌ను తొలగించుకోవాలి. ఆ తరువాత ఐసుముక్కలతో ముఖాన్ని మృదువుగా మసాజ్ చేసుకుంటే చర్మం బిగుతుగా మారడంతో పాటు అందంగా తయారవుతుంది.

పాలు, ఉప్పు: ముఖం మీద కనిపించే అకాల వృద్ధాప్యఛాయలు తొలగించుకోవాలంటే ఇది చక్కని పరిష్కారం. పావుకప్పు చల్లని పచ్చిపాలల్లో అరటేబుల్‌స్పూను ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ పట్టించి బాగా ఆరనిచ్చి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు, మలినాలు పోయి చర్మం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా వారంలో రెండుమూడు సార్లు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి తప్పనిసరిగా చేయాల్సిందే
1. ప్రతి పదిహేను రోజులకొకసారి యాంటీ ఏజింగ్ ఫేషియల్ చేయించుకోవాలి. దీన్ని ఇంట్లో అయినా సరే, పార్లర్లో అయినా సరే చేయించుకోవాలి.
2. చర్మం డీహైడ్రేషన్‌కి గురికావడం వల్ల కూడా ముడతలు రావచ్చు. అందువల్ల డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండడం చాలా ముఖ్యం. దీని కోసం శరీరానికి అవసరమైన ద్రవపదార్థాలు తీసుకోవాలి.
3. ప్రతిరోజూ దానిమ్మ లేదా ద్రాక్షపళ్ల రసం తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అకాల వృద్ధాప్య ఛాయల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

Effective Ayurvedic Face Packs For Glowing Skin