Thursday, April 25, 2024

పేదరిక గీత – కొత్త నిర్వచనం

- Advertisement -
- Advertisement -

Efforts should be made to eradicate Poverty

 

పేదరిక గీత గీయడానికి తిన తిండి, కనీస రాబడి ఉన్నాయా, లేవా అనే ఒక్క అంశాన్నే పరిగణించడం సరికాదని ఇల్లు, చదువు, పారిశుద్ధం, వైద్యం వంటి జీవన వసతుల అందుబాటును కూడా కొలబద్దగా చేసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేసిన సూచన దారిద్య్రాన్ని గుర్తించే తీరును ఆధునికం చేస్తున్నది. మనిషిగా బతకడం అనే స్థితి పట్ల మానవీయ అవగాహనను కలిగించేదిగా ఉన్నది. భారత రాజ్యాంగం 21వ అధికరణ ద్వారా కల్పించిన జీవన హక్కులో అనివార్యమైన అంతర్భాగంగా ఉండవలసిన గౌరవప్రదమైన బతికే హక్కును ఇది ఎంతో కొంత మేరకు సాకారం చేస్తుందని చెప్పవచ్చు. పేదరికంపై కేంద్ర మంత్రిత్వ శాఖ తాజాగా సమర్పించిన ఆచరణీయ లో ఈ సూచన చేసినట్టు తెలుస్తున్నది. వాస్తవానికి ప్రభుత్వాలు పేదరికమంటే కూటికి లేనితనమే అన్న స్థితిని తీసుకు వచ్చాయి. సంక్షేమ చర్యల కింద తగినన్ని తిండి గింజలు ఇవ్వడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. వైద్యం, విద్య వంటి కీలక ప్రజాహిత రంగాలను ప్రైవేటుకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దూసుకువచ్చిన ఈ సూచన ప్రభుత్వాలను తిరిగి సగటు మనిషి సమగ్ర వికాసానికి అంకితమయ్యేలా చేయవలసి ఉంది.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తన పత్రంలో కరోనా దేశ ప్రజలకు దాపురింప చేసిన దుర్భర పరిస్థితులను కూడా ప్రస్తావించింది. ఆరోగ్య భద్రత, విద్య, అవగాహన, మంచినీరు, పారిశుద్ధం, పోషకాహారం, భౌతిక దూరాన్ని పాటించడానికి తగినంత ఆవరణ ప్రజలందరికీ సమానంగా అందుబాటులో ఉంచవలసిన అవసరాన్ని కరోనా మహమ్మారి ఎత్తి చూపిందని ఈ పత్రం పేర్కొన్నది. అందుచేత కేవలం పొట్ట పోషించుకోడానికి తగిన ఆదాయం వస్తున్నదా లేదా అన్నదే కాకుండా అన్ని సౌకర్యాలతో కూడిన గృహ వసతి, విద్య, వైద్య సదుపాయాలు లేకపోడాన్ని సైతం పేదరికంగా గుర్తించాలన్నది ఈ పత్రం ఆంతర్యమని బోధపడుతున్నది. ప్రతి వ్యక్తి రోజుకి రూ. 75 జీవన వ్యయం చేస్తున్న మధ్యస్థ ఆదాయ దేశంగా భారత దేశాన్ని ప్రపంచ బ్యాంకు గుర్తించిందని ఆ స్థాయికి మనమింకా చేరుకోలేదని దానిని అందుకోవాలంటే పేదరికాన్ని కేవలం ఆకలి తీర్చుకునే స్తోమతతో ముడిపెట్టి చూడడాన్ని మానుకోవాలని ఈ పత్రంలో ఇచ్చిన వివరణ మానవీయంగా ఉన్నది. 21వ అధికరణ హామీ ఇస్తున్న జీవన హక్కు అంటే సకల మానవ మర్యాదలతో కూడిన సగౌరవ జీవన హక్కు అని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వివిధ స్పష్టీకరణల ద్వారా విశాలమైన నిర్వచనాన్ని ఇచ్చింది.

బతికే హక్కు అంటే కేవలం ఒక జంతువులాగా ప్రాణంతో ఉండడం కాదని చెప్పింది. జంతువుగా జీవించడానికి, మనిషిగా బతకడానికి చాలా తేడా ఉందని ఎటువంటి అడ్డంకులు, ఆక్రమణలకు గురి కాని వాతావరణంలో ఆయా వ్యక్తుల సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వాలపరంగా సంక్రమించవలసిన స్వేచ్ఛలతో కూడినదే నిజమైన జీవన హక్కు అని పేర్కొన్నది. అయితే నేడు మన దేశ ప్రజలు బతుకుతున్న తీరును పరిశీలిస్తే ఈ స్థితికి వారు ఇంకా బహు దూరంగా ఉన్నారని బోధపడక మానదు. సగటు కుటుంబం గౌరవప్రదంగా బతకడానికి రెండు పడక గదుల ఇల్లు కలిగి ఉండడం అతి కనీస అవసరమని గుర్తించారు. దేశంలో సగానికి మించిన జనాభాకు ఈ సౌకర్యం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. నలుగురైదుగురితో కూడిన కుటుంబాలు ఇరుకిరుకుగా ఉండే ఒకటి లేదా ఒకటిన్నర గది మాత్రమే గల ఇళ్లల్లో బతుకులీడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో మంచి గాలి, వెలుతురు, నీటి సదుపాయం లేని గుడిసెల్లో, రేకుల గదుల్లో , కొండ వాలుల్లో బతికే అసంఖ్యాక జనం దర్శనమిస్తారు.

దాదాపు సగం జనాభా ఇంకా బహిరంగ మల విసర్జన చేస్తున్నారంటే సగటు భారతీయులకు గౌరవప్రదమైన జీవన హక్కు ఎంతటి గగన ప్రాయమో అర్థం చేసుకోవచ్చు. గృహ నిర్మాణానికి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు ఏ మూలకూ చాలడం లేదు. అసలే ఆస్తిపాస్తుల ముఖమెరుగని జనం అపారంగా ఉన్న దేశంలో గౌరవప్రదమైన జీవన హక్కును కల్పించడానికి ప్రభుత్వాలు వహించవలసిన పాత్ర ఇంతా అంతా అని చెప్పనలవికానిది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వరంగాన్ని కుదించివేసి సర్వం ప్రైవేటుమయం చేస్తున్న సంస్కరణల ఉరవడిలో సాధారణ ప్రజల జీవన హక్కు ఎంతగా దెబ్బ తింటుందో వివరించవలసిన పని లేదు. కేవలం తల మీద ఒక కప్పు వేయడం కాదు, మానసిక శాంతి, తగినంత పని, మంచి ఆరోగ్యం వగైరాలను హామీ ఇచ్చే జీవన వాతావరణం ప్రతి ఒక్కరికీ కల్పించవలసి ఉందని అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలు నొక్కి పలికాయి. కాని ఆచరణలో అది కల్లగానే మిగిలిపోతున్నది. అందుచేత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా మానవీయ వాతావరణంతో కూడిన జీవన హక్కు దృష్టికోణంలోనే పేదరిక నిర్మూలన కృషి జరగాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News