Home జగిత్యాల కవిత గెలుపు కోసం జోరుగా ప్రచారం

కవిత గెలుపు కోసం జోరుగా ప్రచారం

Kavithaజగిత్యాల : నిజామాబాద్ పార్లమెంట్ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత గెలుపొందడం ఖాయమైపోయిందని, అయితే రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని టిఆర్‌ఎస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఎంపిగా కవిత గడిచిన ఐదేళ్లలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గణనీయమైన అభివృద్దిని సాధించారని, వేల కోట్ల నిధులు మంజూరు చేయించి అనేక అభివృద్ది పనులు చేసిన ఘనత ఆమెకే దక్కిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మీద పోటీకి దిగేందుకు కాంగ్రెస్ వెనుకంజ వేసి చివరి నిమిషంలో పోటీలో లేకుంటే పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమవుతుందనే భయంతో మధుయాష్కీ పోటీలో నిలిచారని, నామమాత్రంగా పోటీలో నిలిచారే తప్పా గెలిచే అవకాశం లేదని ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక బిజెపిది ప్రచార హోరే తప్పా బిజెపిని ప్రజలు విశ్వసించడం లేదని, టిఆర్‌ఎస్‌తో అన్ని వర్గాలకు మేలు జరిగిన నేపథ్యంలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుందనే భావనతో ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టం కడతామని బాహటంగానే చెబుతున్నట్లు టిఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవగా వారంతా తమకు వచ్చిన మెజార్టీ కంటే మరింత ఎక్కువ మెజార్టీ సాధించేందుకు వారి వారి అసెంబ్లీ పరిధిలో ఎంఎల్‌ఎలు గట్టి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కవిత పలుమార్లు మండలాల వారీగా రోడ్‌షోలు నిర్వహించడంతో పాటు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి టిఆర్‌ఎస్‌కు ఓటు వేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు, అభివృద్ది గురించి వివరించారు. ప్రజల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోని బిజెపి, కాంగ్రెస్‌లకు తగిన గుణపాఠం చెప్పాలని, టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే గల్లీలో సేవకులుగా, ఢిల్లీలో సైనికులుగా పని చేస్తామని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కవిత విస్తృత ప్రచారం నిర్వహిస్తూనే ఎంఎల్‌ఏలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే ఎంఎల్‌ఏలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంత మెజార్టీ సాధిస్తామని లెక్కలతో సహా కవితకు చెప్పారు. తక్కువలో తక్కువగా 5 లక్షల మెజార్టీతో కవితను గెలిపించడమే తమ ధ్యేయమని ఎంఎల్‌ఎలు పేర్కొంటున్నారు. రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి అందరి దృష్టి నిజామాబాద్ పార్లమెంట్‌పై నిలిచేలా చేయడమే తమ ధ్యేయంగా పెట్టుకున్నట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే టిఆర్‌ఎస్ పకడ్బందీ కార్యచరణ సిద్దం చేసుకుని దానికి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి టిఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తోందని, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఎలా ఉంటారో కూడా తమకు తెలియదంటున్నారని, అలాంటప్పుడు వారికెలా ఓట్లు వేస్తామని ప్రజలు బాహాటంగానే చెబుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ 16 సీట్లు గెలుచుకున్నట్లయితే ఇతర పార్టీలను కలుపుకుని కేంద్ర రాజకీయాల్లో టిఆర్‌ఎస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, కెసిఆర్ సూచించిన వ్యక్తే ప్రధానమంత్రి అవుతారని, కేంద్ర మంత్రి వర్గంలో కవితకు చోటు లభిస్తుందని టిఆర్‌ఎస్ నేతలు బలమైన నమ్మకంతో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తూ టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. మంగళవారం ప్రచారం పరిసమాప్తి కావడంతో చివరి రోజున బూత్ కమిటీల వారీగా ప్రచారం నిర్వహించి టిఆర్‌ఎస్‌కు ఎదురు లేదనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కవిత గెలుపును ఎవరూ ఆపలేరని, రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించడంతో పాటు కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల, నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు.

Election Campaign for Kavitha in Jagityal