Home తాజా వార్తలు కొవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు

కొవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు

Election Commissioner Parthasarathy Press Meet

 

99 నియమావళి ఉల్లంఘన ఎఫ్‌ఐఆర్‌లు నమోదు – రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి
ప్రచారం ముగిసింది, బయటివారు వెళ్లొచ్చు
జిహెచ్‌ఎంసి ఎన్నికల బరిలో 1,122 మంది అభ్యర్థులు
ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌ను వీడాలి
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
పోలింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలపై నిషేధం : ఎన్నికల కమిషనర్

మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరిగే డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేదం విధించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయటి వ్యక్తులు జిహెచ్‌ఎంసి పరిధి దాటి వెళ్లాలని చెప్పారు. జిహెచ్‌ఎంసి పరిధిలో నివాసం లేనివారు, ఓటర్లు కానివారు, స్టార్ క్యాంపెయినర్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు జిహెచ్‌ఎంసి పరిధి దాటి వెళ్లాలని అన్నారు. ఈ ఆదేశాలను పోలీసులు అమలు చేయాలని పేర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జిలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. తనిఖీలలో వ్యక్తుల ఐడెంటిటీ పరిశీలిస్తారని, ఏమైనా అనుమానం ఉంటే బయటకి పంపిస్తారని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వఛ్చందంగా జిహెచ్‌ఎంసి పరిధి దాటి బయటకి వెళ్లాలని కోరారు. ఎన్నికలు జరిగే గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలుకు 19 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 150 వార్డులకు డిసెంబర్ 1వ తేదీన(మంగళవారం) ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నాయని, ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 74,44,260 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 678 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. మొత్తం 150 వార్డుల నుంచి 1,122మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని అన్నారు. అత్యధికంగా జంగంమ్మెట్ వార్డు 20 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అతి తక్కువగా ఉప్పల్, బార్కాస్, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలిచౌకి, జీడిమెట్ల డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. గ్రేటర్ మైలార్‌దేవ్‌పల్లి అతిపెద్ద డివిజన్ అని, రామచంద్రపురం అతి చిన్న డివిజన్ అని పేర్కొన్నారు.

9,101 పోలింగ్ కేంద్రాలు
గ్రేటర్‌లో మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాలు ఎన్నికలు జరుగనున్నట్లు కమిషనర్ సి.పార్థసారధి తెలిపారు. అందులో 2,336 సున్నితమైన కేంద్రాలుగా, 1,207 అతి సున్నితమైనవిగా, 279 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. 2,277 కేంద్రాలలో లైవ్ వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 5,095 వీడియోగ్రాఫర్ల బృందం పనిచేస్తుందన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు 14 మంది జనరల్ అబ్జర్వర్లను, 1,729 మైక్రో అబ్జర్వర్లను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయాన్ని లెక్కించడానికి 34 మంది ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్లను, 60 మంది ఫ్లయింగ్ స్కాడ్‌లను, 30 మంది స్టాటిస్టికల్ సర్వలెన్స్ బృందాలను, 661 మంది జోనల్ అధికారులు, రూట్ అధికారులు నియమించినట్లు చెప్పారు. ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులచే బందోబస్తు ఉంటుందన్నారు.

మొత్తం 28,683 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని చెప్పారు. ఈ ఎన్నికల కోసం 81,881686 బ్యాలెట్ పేపర్లను ముద్రించామని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్‌లో కింది భాగంలో నోటాను ముద్రించామని పేర్కొన్నారు. కోవిడ్- 19 మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందురోజు శానిటైజ్ చేయాల్సిందిగా ఆదేశించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ – 19 పాజిటివ్ ఉండి పోస్టల్ ఉన్నవారికి, 80 ఏళ్లు పైబడిన వృద్దులు, వికలాంగులకు ఈసారి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని, వీరు ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 2,571 మంది ఉద్యోగులకు పోస్టర్ బ్యాలెట్ జారీ చేయగా, 260 మంది వికలాంగులు, వృద్దులు, కోవిడ్- 19 పాజిటివ్ రోగులు పోస్టల్ బ్యాలెట్ జారీ చేశామన్నారు.

పోలింగ్ కేంద్రాలలో భౌతికదూరం పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, శానిటైజ్ ఉపయోగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 10 చొప్పున మొత్తం 1.20 లక్షల కోవిడ్- 19 కిట్లు సిద్ధం చేశామని, ఒక్కో పోలింగ్ కేంద్రానికి 500 మిల్లీ లీటర్ల శానిటైజర్ బాటిళ్ల చొప్పున మొత్తం 60 వేల శానిటైజర్ బాటిళ్లను సిద్ధం చేశామని తెలిపారు. ఆదివారం సాయంత్రం నాటికి 92.04 శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని, 100 శాతం పూర్తి చేస్తామని చెప్పారు. ఓటర్ స్లిప్పుల అందరివారు మై జిహెచ్‌ఎంసి యాప్ లేదా ఎస్‌ఇసి వెబ్‌సైట్ ద్వారా ఓటర్ స్లిప్పులు పొందవచ్చని వివరించారు.

రూ.1,46,37,180 నగదు సీజ్
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మొత్తం రూ.రూ.1,46,37,180 నగదు సీజ్ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి వెల్లడించారు. రూ.14,68,941 విలువైన ఇతర వస్తువులను సీజ్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఇప్పటివరకు 100 ఫిర్యాదులు రాగా, కేసులు, 99 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. 5,330 మంది లైసెన్స్ ఆయుధాలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారని అన్నారు. 3,630 మంది బైండోవర్ చేశామని, 345 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని తెలిపారు. గ్రేటర్ పరిధిలో 15,711 బ్యానర్లు, 54,734 ఫ్లాగ్‌లు, 25,476 పోస్టర్లు, 4,795 బోర్డులు, 23,188 ఫ్లెక్సీలను తొలగించామని వివరించారు.

డిసెంబర్ 4న కౌంటింగ్
గ్రేటర్ ఎన్నికల పూర్తయిన తర్వాత డిసెంబర్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి తెలిపారు. ఇందుకోసం 150 స్ట్రాంగ్ రూమ్‌లు సిద్ధం చేశామన్నారు. 150 కౌంటింగ్ కేంద్రాలలో 158 హాళ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వార్డుకు 14 కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

Election Commissioner Parthasarathy Press Meet