Friday, March 29, 2024

ఎన్నికల వ్యయ పరిమితులు!

- Advertisement -
- Advertisement -

    Election expenditure limits for Lok Sabha and Assembly polls  లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు పరిమితిని 10 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరచూ ఉల్లంఘనకు గురయ్యే నీతి వాక్యంలా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే అభ్యర్థులు పోటాపోటీగా పెట్టే ఖర్చు హద్దులు మీరుతున్న రోజుల్లో పెద్ద ఎన్నికలకు వ్యయ పరిమితిని లక్షల్లో నిర్ణయించడం కంటే హాస్యాస్పదం ఏముంటుంది? లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ. 75 లక్షలు, శాసన సభకు నిలబడే వ్యక్తి రూ. 30 లక్షల 80 వేల వరకు ఖర్చు చేయవచ్చని కేంద్రం తాజా పరిమితిని విధించింది. ఇంత వరకు ఈ పరిమితులు లోక్‌సభ స్థానానికి రూ. 70 లక్షలు, అసెంబ్లీకి రూ. 28 లక్షలుగా ఉండేవి. కరోనా నేపథ్యంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఈ మేరకు పరిమితులను ఎన్నికల సంఘం సిఫార్సు పై పెంచినట్టు సమాచారం.

ఈ వ్యయ హద్దులను పరిశీలిస్తే వాములు మేసే స్వామికి గడ్డిపోచను వడ్డించిన చందం అనిపించక మానదు. ఈ నెల, వచ్చే నెలలో జరిగే బీహార్ శాసన సభ ఎన్నికల్లోనూ, దేశ వ్యాప్తంగా 59 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ నియోజక వర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఈ పెంచిన ఖర్చు పరిమితులు వర్తిస్తాయి. క్రితం సారి 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు వ్యయ మొత్తాలను నిర్ణయించారు. ఎన్నికలలో ధన ప్రాబల్యాన్ని అరికట్టి ప్రచార రంగం బరిలోని అభ్యర్థులందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా చేయడం తప్పనిసరి ప్రజాస్వామిక అవసరంగా భారత రాజ్యాంగం గుర్తించింది. అందు కోసం ప్రచార ఘట్టాన్ని పర్యవేక్షించి నియంత్రించే బాధ్యతను, అధికారాలను 324 అధికరణ ద్వారా ఎన్నికల సంఘానికి కట్టబెట్టింది. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఫలితం వెల్లడయ్యే వరకు స్వయంగా గాని, ఏజెంటు ద్వారాగాని పెట్టే ప్రచార ఖర్చుకు లెక్క చూపించవలసిన బాధ్యతను ప్రజాప్రాతినిధ్య చట్టం అభ్యర్థిపై ఉంచింది.

అలా చూపించే లెక్క కేంద్రం నిర్ణయించే వ్యయ పరిమితికి లోబడి ఉండేలా చూసుకోడానికి అభ్యర్థులు ఎన్ని అబద్ధాలను ఆశ్రయిస్తారో చెప్పనలవికాదు. ఇప్పుడు నిర్ణయించిన ఖర్చు పరిమితులు ఆ లెక్క చూపించడానికి మాత్రమే ఉపయోగపడతాయి గాని వాస్తవంలో అభ్యర్థులు పెట్టే వ్యయం అంతకు కొన్ని పదుల రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రచార ఖర్చు గోడ ప్రకటనలు, జెండాలు, కొద్ది పాటి వాహనాలకు, చిన్నచిన్న సభలకు మాత్రం పరిమితం కావలసి ఉంది. కాని ఆచరణలో అభ్యర్థుల వ్యయ విన్యాసాలు వర్ణనాతీతంగా సాగిపోతుంటాయి. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఖరీదైన కానుకలు, భారీ నగదు, ప్రవాహ స్థాయిలో మద్యం సరఫరా వంటివి విచ్చలవిడిగా జరిగిపోతుంటాయి. ఇలా నేరుగా ఓటర్ల కింద పెట్టే అభ్యర్థుల వ్యయమే మొత్తం ఎన్నికల ఖర్చులో నాలుగో వంతు ఉంటుందని ఒకసర్వే నిగ్గు తేల్చింది. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో పెట్టే వ్యయానికి రెట్టింపుగా భారత ఎన్నికల పర్వంలో వ్యయపరుస్తారని రుజువయింది.

ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో బరిలోని ప్రధాన అభ్యర్థులు కోట్లాది రూపాయలను మంచి నీళ్ల ప్రాయంగా కుమ్మరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన కీర్తిశేషులు కోడెల శివప్రసాద్ రావు సత్తెనపల్లి నియోజక వర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక కావడానికి తాను రూ. 11.5 కోట్లు ఖర్చు పెట్టినట్టు స్వయంగా ప్రకటించిన సందర్భం తెలిసిందే. ప్రత్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల ఈ ఖర్చు ఊహకందని స్థాయిలో జుగుప్సాకరంగా ఉంటున్నది. ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారిపోయాయని అభ్యర్థులు సమర్పించే ఖర్చు లెక్కలు వాస్తవాలకు చాలా దూరంగా ఉంటున్నాయని, నిజమైన ప్రజా సేవకులు నిజాయితీపరులు ఎన్నికల్లో పోటీ చేయడం కలలోని మాట అని 2015 డిసెంబర్‌లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ స్వయంగా ప్రకటించారు. లోక్‌సభకు, శాసన సభలకు ఎన్నికవుతున్న అభ్యర్థులు ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ పదులు, వందల కోట్ల రూపాయల కిమ్మత్తు ఆస్తిపరులేననడం ఎంత మాత్రం అసత్యం కాదు.

2009 సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 58 శాతం మంది కోటీశ్వరులైతే, 2019 ఎన్నికల నాటికి వీరు 88 శాతానికి పెరిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోలీసు తనిఖీల్లో పట్టుబడిన సొమ్ము రూ. 30475.76 కోట్లు అంటే భారత ప్రజాస్వామ్యం ఎంతగా ధన ప్రాబల్యానికి లొంగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఓటు అమ్ముడుపోడమనేది కఠోర వాస్తవంగా మారిన చోట ప్రజాభీష్టం మేరకు ప్రజా ప్రభుత్వాలు ఎన్నిక కావడం ఎడారిలో నీటి చుక్క మాదిరి అసంభవమే. అందుచేత అభ్యర్థుల వ్యయ పరిమితులు వారు అధికారికంగా సమర్పించే ఖర్చు లెక్కలకు మాత్రమే ఉపయోగపడతాయి కాని ఆచరణలో నిరూపితం కావు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News