Friday, April 19, 2024

25న టిఆర్‌ఎస్ అధ్యక్ష ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Election of TRS party president on oct 25th

పార్టీకి 20సం॥లు, అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినందున వచ్చే నెల 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన భారీ బహిరంగ సభ
అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ 17న విడుదల అధ్యక్ష ఎన్నిక తర్వాత పార్టీ విస్తృతస్థాయి సమావేశం 17న టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ
తెలంగాణ భవన్‌లో మీడియాతో సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 25వ తేదీన జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. పార్టీని ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు, అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వచ్చే నెల 15వ తేదీనాడు వరంగల్ వేదికగా ’తెలంగాణ విజయ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరగగా, 2020లో కరోనా విజృంభించడం, ప్రస్తుత సంవత్సరంలో కూడా కరోనా తీవ్రత అధికంగా ఉన్న కారణంగా పార్టీ ప్లీనరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం సాధ్యపడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తిగా ఆధీనంలో ఉన్న నేపథ్యంలో పార్టీలో వివిధ రకాల సంస్థాగత ఎన్నికల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే గ్రామ, మండల, బస్తీ వార్డు కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందన్నారు.

రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల17వ తేదీన విడుదల అవుతుందని కెటిఆర్ తెలిపారు. షెడ్యూల్ విడుదల వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కెటిఆర్ తెలిపారు. ఇది ముగిసిన వెంటనే 23వ తేదీన నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. 25వ తేదీన నగరంలోని హెచ్‌ఐసిసిలో పార్టీ అధ్యక్షుని ఎంపిక ఉంటుందన్నారు. తదనంతరం సుమారు 14వేల మంది ప్రతినిధులతో పార్టీ ప్లీనరీ సమావేశం జరుగుతుందని కెటిఆర్ తెలిపారు. కాగా అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పార్టీ కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎంఎల్‌సి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని పార్టీ సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ పర్యవేక్షిస్తారన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాల కమిటీ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వ్యవహరిస్తారన్నారు.

17న పార్టీ ఎల్‌పి సమావేశం

17వ తేదీన పార్లమెంటరీ, అసెంబ్లీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న కెటిఆర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై పార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో సిఎం కెసిఆర్ చర్చించి దిశానిర్దేశం చేయనున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి ఏడేళ్లు అవుతున్నప్పటికీ…శరవేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా అమలు జరగడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధించిన అద్భుత విజయాలకు దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు.

నవంబర్ 15వ తేదీన విజయ గర్జన

రెండు దశాబ్దాల టిఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానం, అధికారంలోకి వచ్చి ఏడేళ్ల జనరంజకమైన పాలన, తెలంగాణ రాష్ట్రం సాధించిన చిరస్మరణీయమైన విజయాలు వీటన్నింటిని కూడా ఘనంగా జరుపుకోవడానికి నవంబర్ 15వ తేదీనాడు వరంగల్ వేదికగా ’తెలంగాణ విజయ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కెటిఆర్ వెల్లడించారు. ఈ విజయ గర్జనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలతో పాటు లక్షలాదిగా ప్రజలు హాజరుకానున్నారన్నారు. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టిఆర్‌ఎస్ నిలిచిందని ఈ సందర్భంగా కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అద్భుతమైన విధానాలతో పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోనున్నాన్నారు.

ఈ సమావేశానికి పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హాజరు కావాలన్నారు. విజయ గర్జన బహిరంగ సభ కోసం ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విజయ గర్జన ముగిసిన అనంతరం పార్టీ జిల్లా ఆఫీస్‌లు ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయని కెటిఆర్ వెల్లడించారు. తదనంతరం జిల్లా అధ్యక్షుల ఎంపికతో పాటు పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News