Wednesday, April 24, 2024

గీటురాయి ఎన్నికలు!

- Advertisement -
- Advertisement -

Elections to five Assemblies are very important

 

మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు జరిగే ఐదు అసెంబ్లీల ఎన్నికలు అనేక కారణాల రీత్యా ఎంతో ముఖ్యమైనవి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ2 ప్రభుత్వం లోక్‌సభలో తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చి ఆర్థిక సంస్కరణలను అమితవేగంతో అమలు చేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న విస్తృత స్థాయి ఎన్నికలివి. మూడు మాసాలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతూ దేశమంతటి మద్దతు చూరగొంటున్నదని భావిస్తున్న రైతు ఉద్యమం ఎటువంటి ప్రభావం చూపనున్నదో తెలియజేసే గీటురాయి వంటి సందర్భమిది. అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఈ ఎన్నికలు దేశ ప్రజల నాడిని పట్టి ఇస్తాయని భావించవచ్చు. దేశవ్యాపితంగా 91కోట్ల పైచిలుకు ఓటర్లుండగా ఈ ఐదు అసెంబ్లీల పరిధిలో 18.68కోట్ల మంది ఉన్నారు. కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా తుద ముట్టించి, వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకూ నూకలు దొరకని స్థితిని సృష్టించి దేశమంతటా తానే అయి ఏకచ్ఛత్రాధిపత్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్న బిజెపి అందుకనుగుణంగానే సకల వ్యూహాలను పన్నుతున్నది.

తనకు కనీస స్థాయి ఉనికి కూడా లేని తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ, పుదుచ్చేరిలో కూడా పాగా వేయాలని చూస్తున్నది. ఏడాది క్రితం 2019లో బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో అనూహ్యంగా 18స్థానాలను బిజెపి గెలుచుకున్నది. అంతేగాక 40.6శాతం ఓట్లు సాధించుకొని పాలక తృణమూల్ కాంగ్రెస్‌కు నువ్వా నేనా అన్నంత పోటీని ఇచ్చింది. పది సంవత్సరాలుగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ బెంగాల్ బెబ్బులి అనిపించుకుంటున్న మమతా బెనర్జీకి ఇప్పటివరకు ఎన్నడూ ఎదురుకానంత సవాల్‌ను విసురుతున్నది. ఈ ఎన్నికల్లో అక్కడ గల 294 అసెంబ్లీ స్థానాల్లో 200 స్థానాలను గెలుచుకొని తడాఖా చూపించాలనే ఉద్దేశంతో కమలనాథులు అన్ని ఆయుధాలనూ ప్రయోగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లో అతిరథ మహారథులనిపించుకున్న వారిని బిజెపిలో చేర్చుకుంటున్నారు. అక్కడ పలు జిల్లాల్లో నిర్ణాయక పాత్ర వహిస్తున్న ముస్లిం ఓటర్లను తన వైపు పూర్తిగా తిప్పుకోవడంలో మమతా బెనర్జీ కృతకృత్యులయ్యారు.

దానిని చూపించి ఆమె ముస్లింలను బుజ్జగిస్తున్నారని ప్రచారం చేసి బిజెపి హిందూ ఓటు బ్యాంకును పెంచుకోగలుగుతున్నది. ఈ ఎన్నికల్లో తృణమూల్‌ను అది ఓడించగలిగితే ప్రతిపక్ష శిబిరంలో తనకు అత్యంతబలమైన ప్రత్యర్థిగా ఉన్న మమతా బెనర్జీ తలనొప్పిని అది వదిలించు కోగలిగినదవుతుంది. ఇది జాతీయ ప్రతిపక్షానికి కూడా నష్టం కలుగజేసే అంశం. ప్రాంతీయ పక్షాల యుద్ధక్షేత్రంగా ఉన్న తమిళనాడులో ప్రాబల్యం గడించుకోవాలని బిజెపి చిరకాలంగా ఆశపడుతున్న సంగతి తెలిసిందే. నేరుగా తాను అధికారంలోకి రాకపోయినా మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆరాష్ట్రంలో ఏర్పడిన నూతన రాజకీయ వాతావరణంలో ఆమె పార్టీ ఎఐఎడిఎంకెకు వెనుక నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా అక్కడ పాలక పీఠాన్ని చెప్పుచేతుల్లో పెట్టుకోవడంలో బిజెపి కృతకృత్యురాలు కాగలిగింది. ఈ ఎన్నికల్లో కూడా తిరిగి ఎఐఎడిఎంకె గెలుపొందేలా చేయాలన్నది దాని వ్యూహంగా కనిపిస్తున్నది. అయితే, ఇందుకు ప్రధానమైన సవాలు డిఎంకె నుంచి అదనంగా జయలలిత స్నేహితురాలు శశికళ నుంచి కమలనాథులకు ఎదురుకానున్నది.

20-19 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో గల 39 లోక్‌సభ స్థానాల్లో 38 స్థానాలను డిఎంకె నాయకత్వంలోని యుపిఎ కూటమి గెలుచుకున్నది. అందుచేత డిఎంకెని నిలువరించి అక్కడ ఎఐఎడిఎంకె వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేలా చేయడం బిజెపికి అనుకున్నంత సులువు కాదు. కేరళలో ఇటీవల జరిగిన స్థానికఎన్నికల్లో అఖండ విజయాలు సాధించుకున్న సిపిఐ(ఎం) నాయకత్వంలోని వామపక్షకూటమి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలదనే జోస్యాలు వెలువడ్డాయి. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ 20స్థానాల్లో 19 గెలుచుకున్న కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యుడిఎఫ్)ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అసోంలో బిజెపి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా ఈ రెండు దాని ప్రతిష్ఠను చాలావరకు దెబ్బతీశాయి. కాంగ్రెస్‌కు పెన్నిధి వంటి తరుణ్ గొగోయ్ మరణం ఆ పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నికలు ఎటువంటి ఫలితాన్నిస్తాయనేది ఉత్కంఠ భరితం. పుదుచ్చేరిలో ఎన్నికలు మూడు మాసాల దూరంలో ఉన్నాయనగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫిరాయింపుల ద్వారా కూలదోయించిన కమలనాథుల పట్ల ఓటర్లు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News