Home ఎడిటోరియల్ ‘ఒక దేశం ఒక ఎన్నిక’ సాధ్యమా?

‘ఒక దేశం ఒక ఎన్నిక’ సాధ్యమా?

simultaneous elections

 

లోక్‌సభకు, రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలని నరేంద్ర మోడీ అఖిల పక్ష సమావేశాన్ని పిలిచారు. ఆయన ప్రధానిగా మొదటి సారి ఎన్నికైనప్పుడు కూడా లోక్‌సభకు, దేశంలోని శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాలని అన్నారు. ఈ పద్ధతి కోసం అప్పుడు కూడా ప్రయత్నించారు. కాని అప్పట్లో ఈ ఐడియాకు మద్దతు లభించలేదు. కాని ఈ సారి లోక్‌సభలో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి, మరింత బలంగా మళ్ళీ అదే ఐడియాను ముందుకు తీసుకు వెళుతున్నారు. ఒకే జాతి .. ఒకే ఎన్నిక అసలేమిటి? వ్యతిరేకించేవారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనేది ఒకసారి చూద్దాం. లోక్‌సభకు, రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికల ప్రయోజనాలు చాలా వరకు పరిపాలనలో సౌలభ్యానికి సంబంధించినవి.

ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (కోడ్) అమల్లోకి వస్తుంది. అందువల్ల ప్రభుత్వాలు కొత్త పాలసీలు, కొత్త సంక్షేమ చర్యలేవీ ప్రకటించడం సాధ్యం కాదు. ఒకేసారి ఎన్నికలు జరిపితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సమయం తగ్గిపోతుంది కాబట్టి పరిపాలనలో సౌలభ్యం ఉంటుందన్నది ఒక వాదన. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ట్ అమల్లో ఉండడం వల్ల సాధారణ పరిపాలన కూడా స్తంభిస్తుందని, తరచూ ఎన్నికలు వస్తుండడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆయా ప్రాంతాల్లో విధించే పరిస్థితి వస్తుందని, ఒకేసారి ఎన్నికలు జరిపితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చని వాదిస్తున్నారు. గతంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటించింది. అలాగే ఒకేసారి ఎన్నికలు జరిపితే ఖర్చు కూడా కలిసి వస్తుందన్న వాదన మరొకటి. నీతి ఆయోగ్ నివేదికలో ఈ విషయాన్నే చెప్పింది. తరచు ఎన్నికలు వస్తుండడం వల్ల దీర్ఘకాలిక విధాన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదనే వాదన కూడా ఉంది.

ఒకేసారి ఎన్నికలు జరపడం అనేది కొత్త విషయమేమీ కాదు. దేశంలో మొదటి సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శాసన సభలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఇది చక్కగా 1967 వరకు కొనసాగింది. ఆ తర్వాతి నుంచే ఈ క్రమం దెబ్బతింది. జమిలి ఎన్నికలు ఆ తర్వాత సాధ్యం కాలేదు. కొన్న రాష్ట్రాల్లో సాధ్యమైతే కొన్ని రాష్ట్రాల్లో సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. దానికి కారణం, కొన్ని రాష్ట్రాలో ప్రభుత్వాలు పడిపోవడం, మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల మొత్తం దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించడం 1967 తర్వాతి నుంచి జరగలేదు. 1999లో లా కమిషన్ మరోసారి ఈ చర్చను ముందుకు తెచ్చింది. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరపాలని చెప్పింది.

భారతదేశం వెస్ట్ మినిస్టర్ శైలి ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తోంది. ఈ పద్ధతి ప్రకారం ఎన్నికైన శాసన సభ్యులు ఖచ్చితంగా ఐదేళ్ళ పాటు శాసన సభ్యులుగా కొనసాగే నిర్దిష్ట కాలవ్యవధి ఏమీ లేదు. ప్రభుత్వం శాసన సభను రద్దు చేస్తే శాసన సభ్యులు కూడా సభ్యత్వం కోల్పోతారు. మళ్ళీ ఎన్నికలు జరపవలసి వస్తుంది. ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వల్ల కూలిపోతే, కొత్త ప్రభుత్వం ఏర్పాడే అవకాశం లేనట్లయితే అప్పుడు కూడా సభ రద్దవుతుంది. శాసన సభ్యులకు సభ్యత్వం ఉండదు. మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి జమిలి ఎన్నికలు జరపాలంటే అనేక ఇబ్బందులను పరిష్కరించవలసి ఉంది.

2018లో లా కమిషన్ ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది. “నిర్మాణాత్మక అవిశ్వాస ఓటు” గురించి చెప్పింది. అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకురావాలంటే, ఆ ప్రభుత్వ స్థానంలో మరో ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించే పరిస్థితి ఉంటేనే అవిశ్వాసం పెట్టాలి. కాని ఈ ప్రతిపాదన పట్ల ఎవరూ ఆసక్తి చూపించ లేదు. మరో ప్రతిపాదన ఏమిటంటే, లోక్ సభ ఎన్నికలతో పాటు శాసన సభ ఎన్నికలు కూడా కలిపి జరపడానికి అనువుగా, శాసన సభల కాల వ్యవధిని తగ్గించడం లేదా పెంచడం చేయాలి. ఈ రెండు ప్రతిపాదనలకు కూడా రాజ్యాంగ సవరణ అవసరం.

బ్రిటన్‌లో నిర్మాణాత్మక అవిశ్వాస ఓటు అనేది కాస్త అటుయిటుగా తీసుకు వచ్చారు. అంటే 2011లో నిర్దిష్ట కాల వ్యవధి పార్లమెంటేరియన్ల చట్టం వచ్చింది. దానివల్ల మధ్యంతర ఎన్నికలకు ప్రధాని నిర్ణయించే అధికారాలకు కోత వేశారు. అంటే, పార్లమెంటు పూర్తి కాలం పని చేయక తప్పదు. మధ్యంతరంగా రద్దయ్యే అవకాశాలు చాలా తగ్గించారు. ఇది బాగుందని మొదట్లో అనుకున్నారు. కాని బ్రెగ్జిట్ తర్వాత తలెత్తిన పరిస్థితులకు ఈ చట్టమే కారణమైందని పలువురు విశ్లేషకుల అభిప్రాయం. ఎకనమిస్ట్ పత్రిక ప్రకారం బ్రిటన్‌లో రాజ్యాంగ సంక్షోభానికి ఈ చట్టమే దారి తీసింది.

బిజెపి ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీగా బిజెపి జమిలి ఎన్నికలు కావాలంటోంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వైఎస్‌ఆర్‌సిపి, బిజెడిలు తప్ప జమిలి ఎన్నికలు జాతీయ పార్టీలకు ప్రయోజనకరమని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఐడిఎఫ్సీ ఇనిస్టిట్యూట్ 1999, 2004, 2009, 2014 ఎన్నికలను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ప్రకారం 77 శాతం ఓటర్లు లోక్‌సభకు, శాసనసభకు జమిలి ఎన్నికలు జరిగితే ఒకే పార్టీకి ఓటు వేస్తారు. ఇది ఓటర్లపై అవాంఛనీయ ప్రభావమని పేర్కొంది. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌లో మాజీ డీన్, ప్రొఫెసర్ జగదీష్ ఛోకర్, ఢిల్లీలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ కలిసి చేసిన పరిశోధనలో 31 జమిలి ఎన్నికలను విశ్లేషించారు. 1989 తర్వాత జరిగిన ఎన్నికలివి. ఇందులో 24 ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఒకే విధంగా ఉన్నాయి. కేవలం 7 ఎన్నికల్లో మాత్రమే కొద్ది పాటి తేడా కనిపించింది. అంటే, లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు జాతీయ సమస్యలను మాత్రమే దృష్టిలో ఉంచుకుంటారని, శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ సమస్యలపై ఓటు వేస్తారని ఎవరెన్ని మాటలు చెప్పినప్పటికీ, జమిలి ఎన్నికలు జరిగితే చాలా మంది ఓటర్లు ఒకే పార్టీకి రెండు ఓట్లు వేస్తారు. అంటే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసే పార్టీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఫలితం దేశంలో ఫెడరలిజం దెబ్బతింటుంది.

ప్రభుత్వానికి అవసరమైన చెక్ అండ్ బ్యాలన్స్‌గా ఎన్నికలు ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర ప్రభుత్వం అటు న్యాయ వ్యవస్థను, ఇటు మీడియాను రెండింటిపైనా పెత్తనం చెలాయించింది. కాని ఈ పరిస్థితికి చెక్ పెట్టింది ఎన్నికలు మాత్రమే. ప్రజల తీర్పు మాత్రమే ఈ పరిస్థితిని మార్చింది. 1977లో ఇందిరా గాంధీని ప్రజలు ఓడించారు. జమిలి ఎన్నికలు జరిపి, తరచు ఎన్నికలు జరిగే పరిస్థితి తప్పించడం వల్ల పరిపాలన గొప్పగా ఉంటుందని, ఖర్చు తగ్గుతుందని, ప్రజాసేవ గొప్పగా చేయవచ్చని చెబుతున్నప్పటికీ, నిజానికి దీని వల్ల ప్రభుత్వాలపై ప్రజల కోసం పని చేయాలనే ఒత్తిడి తగ్గిపోతుంది. నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలు పెరుగుతాయి. జాతీయ పార్టీకి, వనరులు ఎక్కువగా ఉన్న పార్టీకి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

Elections to Lok Sabha, state legislatures simultaneously