Home తాజా వార్తలు వర్షాకాలంలో పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదాలు…

వర్షాకాలంలో పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదాలు…

Electrical Hazards

 

జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచనలు

షాబాద్ : వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అప్రమత్తంగా లేక పోవడంతో విద్యుత్‌దాఘాతంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలతో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు సంభవించి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రైతులు విద్యుత్ మోటార్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంలో పశువులు విద్యుదాఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండదని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.

ఇళ్లలో వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విద్యుత్ మీటర్లు, స్విచ్ బోర్డులు, బల్బులు వర్షానికి తడవకుండా చూసుకోవాలి.
ఇంట్లో కరెంట్ వైరింగ్‌కు ఎర్త్ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
ఇళ్లలో బట్టలు ఆరవేయడానికి ఇనుప తీగలు ఉపయోగించవద్దు.
తడి చేతులతో విద్యుత్ సరఫరా అయ్యే పరికరాలు, హోల్డర్లు, సర్వీస్ వైరు, స్విచ్‌లు తాకొద్దు.
పాడైపోయిన సర్వీస్ వైరు, హోల్డర్లు, బల్బులు ఉపయోగించవద్దు.
పిల్లలకు అందనంత ఎత్తులో స్విచ్ బోర్డులు, విద్యుత్ పరికరాలు ఉండాలి.
ఇంట్లో తరచూ ఉపయోగించే గృహోపకరణాలు అవసరం అయిపోగానే ప్లగ్గులు బోర్డులో నుంచి తీసివేయాలి.
ప్లగ్గులు తీసే ముందు స్విచ్ ఆఫ్ చేయాలి స్విచ్ ఆన్‌లో ఉంచి ప్లగ్గులు తీయవద్దు.
ఉరుములు, మెరుపులు, వర్షం సమయంలో గృహోపకరణాలు, టీవీలు, కూలర్లు, ఫ్రీజ్‌లు, ఏసీలు, కంప్యూటర్లకు విద్యుత్ సరఫరా లేకుండా చూసుకోవాలి .
ప్లగ్గులు తీసివేయాలి.

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు వెంటనే తొలగించాలి.
నీటికి దగ్గరగా, తడిచేలా విద్యుత్ పరికరాలు, తీగలు ఉంచకూడదు.
ఇనుప వస్తువులు, రేకులు, చెట్లు విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
విద్యుదాఘాతానికి గురైతే వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి.
పొడికర్రతో, విద్యుత్ సరఫరా కానీ ప్లాస్టిక్ వస్తువులతో ఆ వ్యక్తిని తొలగించాలి.
ఆసుపత్రికి వెంటనే తరలించాలి.

రైతులు పాటించాల్సిన సూచనలు…
వ్యవసాయ విద్యుత్ మోటార్లకు తప్పనిసరిగా ఎర్త్ ఉండేలా చూసుకోవాలి.
పంపుసెట్లు వర్షంలో తడవకుండా కవర్లు కప్పి ఉంచాలి.
పొలంలోని వ్యవసాయ విద్యుత్ మోటారు తీగలు కింద, బురదలో లేకుండా చేసుకోవాలి.
మోటారుకు విద్యుత్ సరఫరా చేసే వైర్లు నాణ్యమైనవి వాడాలి.
విద్యుత్ మోటార్లను తడి చేతులు, తడి దుస్తువులతో తాకొద్దు.
విద్యుత్ తీగలు తెగిపడినా, విద్యుత్ సరఫరాపై అనుమానాలు వచ్చిన మరమ్మతులు చేయకుండా వెంటనే లైన్‌మన్, ఎలక్ట్రీషియన్‌కు సమాచారం అందించాలి.
విద్యుత్ మోటార్లకు ఇనుము, రేకులతో కూడిన బాక్స్‌లు అమర్చకుండా ప్లాస్టిక్ బాక్స్‌లు అమర్చాలి.

Electrical Hazards during Rainy Season