Thursday, April 18, 2024

గుండె గు’బిల్’

- Advertisement -
- Advertisement -

Electricity Department unbearable burden on consumers

 బిల్లును చూస్తే కరెంట్ షాకే..!
మూడు నెలలు వాడిన యూనిట్లకు
ఒకేసారి బిల్లులు
ఆన్‌లైన్‌లో కట్టినా నాలుగురెట్లు బాదుడు
విద్యుత్ శాఖ మాయజాలం
ఒక్కో బిల్లుపై రూ. వెయ్యి నుంచి నాలుగువేల వరకు భారం
సామాన్యుడిపై మోయలేని భారం

హైదరాబాద్: విద్యుత్ శాఖ వినియోగదారులపై మోయలేని భారం మోపుతోంది. కరోనా నేపథ్యంలో గత రెండునెలలుగా మీటర్ రీడింగ్ చేయకుండా గతేడాది బిల్లులు వేస్తూ ఆన్‌లైన్ చెల్లింపులు జరిపిన విద్యుత్ శాఖ బుధవారం నుంచి చేస్తున్న మీటర్‌రీడింగ్‌లో వచ్చిన బిల్లులు చూసి వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. మూడు నెలలకు సంబంధించిన యూనిట్లను మొత్తం కలిపి స్లాబ్‌రేట్ మాయజాలంతో నాలుగురెట్లు అదనంగా బిల్లులు వేసి నడ్డివిరుస్తున్నారు. ప్రతినెలా మీటర్ రీడింగ్ ఆధారంగా బిల్లులను జారీచేస్తున్న విషయం తెలిసిందే.

అయితే, మార్చి నుంచి కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో మీటర్ రీడింగ్ చేయకుండా గతేడాది ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన బిల్లులనే చెల్లించాలని, అనంతరం వాటిని సరిచేస్తామన్న పిలుపుమేరకు వినియోగదారులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపారు. అయితే, ప్రతినెలా వచ్చే రీడింగ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా, ఆన్‌లైన్‌లో ఏప్రిల్, మే నెలల్లో చెల్లింపులను సరిచేయకుండా ఏకంగా సామాన్యుల నడ్డివిరిచే కార్యక్రమానికి తెరలేపింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వాడిన యూనిట్లను కలిపి భారీగా విద్యుత్ బిల్లులను జారీచేస్తోంది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

విద్యుత్ చార్జీల బాదుడుపై వినియోగదారులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తుండగా, తమకేం తెలియదని వాడిన యూనిట్లకే బిల్లులు వచ్చాయని వీటిని చెల్లించాల్సిందేనని కరాఖండిగా చెబుతుండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. నగరశివారులోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం జారీచేసిన బిల్లులు వినియోగదారులకు ‘షాక్’కు గురిచేస్తోంది. బండ్లగూడ జాగీర్‌కు చెందిన వినియోగదారుడి (సర్వీస్ నెం. 311403883)కు బుధవారం విద్యుత్ శాఖ అధికారులు ఏకంగా 2140 రూపాయల బిల్లును అందజేసి షాకిచ్చారు.

ఏప్రిల్, మే నెలల్లో చార్జీలకు సంబంధించి ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపినా, వాటిని సరిచేయకుండా మార్చి, ఏప్రిల్, మే నెలల(88రోజులు)కు సంబంధించి మొత్తం 656 యూనిట్లకు 3460 రూపాయలను, కస్టమర్‌చార్జీలు రూ.180, ఎలక్ట్రిసిటీ డ్యూటీ చార్జీలు రూ.39.36 కలిపి 3679 రూపాయలు వేసి, గత ఏప్రిల్, మే నెలల్లో ఆన్‌లైన్‌లో చెల్లించిన రూ.1539 రూపాయలను కట్‌చేసి రూ.2140 బిల్లును చేతిలో పెట్టారు. శ్లాబ్ రేట్‌ను యూనిట్‌కు రూ.5.29 చొప్పున బిల్లు వేసి షాకిచ్చారు.

ప్రతినెలా ఆన్‌లైన్‌లో చెల్లింపుల ఆధారంగా యూనిట్ల టారిఫ్ మార్చాల్సి ఉన్నా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఇలా ఇష్టానుసారంగా బిల్లులు వేయడం సర్వత్రా ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రతినెలా వాడిన కరెంట్ ఆధారంగా బిల్లులు వేస్తే బిల్లులో రూ.2000 తగ్గుతుందని, అలా కాకుండా కరోనా నేపథ్యంలో నాలుగురెట్లు బిల్లులు అధికంగా వేసి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులను సరిచేసి ఆదుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Electricity Department unbearable burden on consumers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News