Home ఎడిటోరియల్ విద్యుత్తే సుస్థిరాభివృద్ధి ఇంధనం

విద్యుత్తే సుస్థిరాభివృద్ధి ఇంధనం

Electricity is the fuel for sustainable development2015లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ప్రకా రం ‘2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సానుకూల సుస్థిరాభివృద్ధి మార్పులు’ చేపట్టాలనే సదుద్దేశంతో 17 ‘ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు -2030’ ని నిర్ణయించారు. ఈ 17 లక్ష్యాలను ‘2030 ఎజెండా’ అని కూడా పిలుస్తాం. పేదరికం, ఆకలి చావులు, ఆరోగ్యం, విద్య, పర్యావరణ మార్పులు, లింగ సమానత్వం -మహిళా సాధికారత, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, శక్తి వనరులు, పట్టణీకరణ, భూతాపం, సామాజిక న్యాయం లాంటి ప్రధాన అంశాలను తీసుకొని 2030 నాటికి ప్రగతి సాధించాలని లక్ష్యంగా తీసుకున్నారు. సామాజిక న్యాయం, అసమానతలు, పేదరికం, లింగ భేదం, ఆకలి చావులు, నిరుద్యోగం లాంటివ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. గత దశాబ్దకాలంగా విద్యారంగంలో ప్రపంచ మానవాళి ఎంతో ముందడుగు వేసింది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 7వ అంశంగా ‘చవకైన స్వచ్ఛ విద్యుత్తు (ఎఫర్డబుల్ క్లీన్ ఎనర్జీ)’ ను ముఖ్యమైనదిగా తీసుకోబడింది. ఆధునిక వేగవంతమైన శాస్త్ర సాంకేతికత డిజిటల్ యుగంలో సరసమైన, నమ్మకమైన, సుస్థిరమైన విద్యుత్తు అవిచ్ఛిన్న లభ్యత కనీస అవసరంగా మారింది. విద్యుత్తు లభ్యతతోనే వ్యాపారం, వాణిజ్యం, విద్య, వ్యవసాయం, వైద్యం, మౌలిక వనరులు, కమ్యూనికేషన్ వ్యవస్థ, హై- టెక్నాలజీ ప్రగతి సుసాధ్యం అవుతుంది. రాబోయే రేజుల్లో తరిగే శిలాజ ఇంధనాల (బొగ్గు, వంట చెరుకు, చమురు, గ్యాస్ లాంటివి) వినియోగాన్ని తగ్గిస్తేనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని తెలుసుకొని తరగని సాంప్రదాయేతర పునరుత్పాదక హరిత విద్యుత్తును (సౌర, పవన, అలల శక్తి లాంటివి) వాడవలసిన అగత్యం ఏర్పడుతున్నది.
ప్రపంచ పవర్ వినియోగం
నేటికీ ప్రపంచ వ్యాప్తంగా 33 శాతం జనాభాకు విద్యుత్తు సదుపాయాలు, వంట గ్యాస్ వసతులు, ఆధునిక సాంకేతిక ఫలాలు అందకపోవడం విచారకరం. కరోనా మహమ్మారితో అధిక ప్రపంచ జనాభా విద్యుత్తు వసతులను కోల్పోవడం, గ్యాస్, చమురు ధరలు పెరగడంతో పేదరికం పెరిగిపోయింది. 2010లో 83 శాతం జనాభాకు విద్యుత్తు సదుపాయం ఉండేదని, 2019 నాటికి 90 శాతం ప్రజలకు చేరువైంది. 2019 నాటికి 789 మిలియన్ల ప్రజలకు విద్యుత్తు అందక గుడ్డి దీపపు చీకట్లోనే మగ్గుతున్నారు. ప్రజారోగ్య వ్యవస్థలకు 28 శాతం మాత్రమే స్వచ్ఛమైన విద్యుత్తు సౌకర్యం అందుతున్నది. 2030 నాటికి 660 మిలియన్లకు విద్యుత్తు అందకపోవచ్చని ఐరాస అంచనా వేసిం ది. కొవిడ్ -19 విపత్తుతో ఆఫ్రికా, ఆసియా దేశాల్లో 25 మిలియన్ల జనాభా విద్యుత్తు దూరమైంది. పేదరికం పెరగడంతో గత్యంతరం లేక విద్యుత్తు ఖర్చులు తప్పించుకునే ఆలోచనలతో పేదలు చీకటిని కౌగిలించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అర్థం చేసుకోవాలి. 2010లో 57 శాతం జనాభా వంట గ్యాస్ వాడగా, 2019లో 66 శాతం జనం వినియోగించినా, మిగిలిన 2.6 బిలియన్ జనాభా వంటగ్యాస్‌కు దూరంగానే ఉన్నారు. సత్వరమే చర్యలు తీసుకోని యెడల విద్యుత్తు సదుపాయాలు 33 శాతం ప్రజలకు అందకపోవచ్చని అంచనా.
పునరుత్పాదక శక్తి వనరులదే భవిత
2010లో పర్యావరణ హిత స్వచ్ఛ విద్యుత్తు వినియోగం 16.4 శాతం ఉండగా, 2018 నాటికి 17.1 శాతానికి పెరిగింది. ప్రస్తుతం తరగని పునరుత్పాదక హరిత స్వచ్ఛ విద్యుత్తు ఉత్పత్తికి సౌరశక్తి, పవన, అలలశక్తి రూపాలను వినియోగించడం క్రమంగా పెరగడం శుభపరిణామంగా గుర్తించాలి. పేద, మధ్య ఆదాయ దేశాల్లో నేటికీ శిలాజ ఇంధనాల వినియోగమే అధికంగా ఉండడం ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు శాపంగా మారుతోంది. నేటి కీ 13 శాతం జనాభా నాణ్యమైన విద్యుత్తుకు దూ రంగా ఉండడం, 3 బిలియన్లు శిలాజ ఇంధనాలను వాడడంతో 60 శాతం గ్రీన్ హౌజ్ వాయువులు విడుదల కావడంతో భూతాపం పెరుగుతోంది.
ఇండియాలో విద్యుత్తు సమస్య
ప్రపంచ దేశాల్లో అత్యధిక శక్తిని వినియోగించే దేశాల్లో చైనా, అమెరికా, ఇయు దేశాల తరువాత భారత్ నాలుగో స్థానంలో నిలుస్తున్నది. ప్రస్తుతం బొగ్గు కొరతతో దేశం చీకటి అంచున ఉందన్న వార్త సామాన్య పౌరున్ని కలిచి వేస్తున్నది. భారతదేశంలో విద్యుత్తు సమస్య అనాదిగా వెంటాడుతున్నప్పటికీ దినదినం విద్యుత్ ఉత్పత్తి పెరగడం, 2017 నాటికి 63 శాతం జనాభాకు అందుబాటులోకి రావడం జరిగింది. శిలాజ ఇంధనాలతో పాటు అణుశక్తి, సౌరశక్తి, పవనశక్తి లాంటివి వినియోగంలో ఉన్నాయి. మన దేశంలో 80 శాతం శక్తి ఉత్పత్తి బొగ్గు, చమురు, బయోమాస్‌ల వల్లనే జరుగుతోంది. 2017 వివరాల ప్రకారం మన దేశంలో బొగ్గు 44.3 శాతం, బయోమాస్ 21.2 శాతం, చమురు 25.3 శాతం, సహజ వాయువు 5.8 శాతం, హైడ్రోఎలక్ట్రికల్ 1.4 శాతం, అణువిద్యుత్తు 1.1 శాతం, ఇతర తరగని శక్తి వనరులు 0.9 శాతం వినియోగించడం జరిగింది. గత రెండు దశాబ్దంలో 900 మిలియన్ల భారతీయులకు (25 శాతం జనాభాకు) కొత్తగా విద్యుత్తు సౌకర్యం కల్పించబడింది. ప్రస్తుతం కొవిడ్ -19 వల్ల దేశం లో 5 శాతం విద్యుత్తు వినియోగం తగ్గిందని తెలుస్తున్నది. 2020లో విద్యుత్తు రంగానికి 20 శాతం నిధులు తగించబడినవి. కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేసే దేశాల్లో ఇండియా 3వ స్థానంలో ఉండడంతో దేశ ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకోవడం జరుగుతోంది. దీనికి తోడు మహా నగరాల్లో పియమ్ 2.5 గాలి కాలుష్య కారణంగా ఒక మిలియన్ అకాల మరణాలు జరిగాయి. 2040 నాటికి భారత విద్యుత్తు వినియోగం రెట్టింపు కావచ్చని అంచనా. 2030 నాటికి ప్రజల శక్తి వినియోగం 50 శాతం పెరగవచ్చని, కాని 35 శాతం మాత్రమే అందుబాటులో ఉంటుందని అంటున్నారు. గత 3 దశాబ్దాల్లో ప్రపంచ ప్రగతిలో 10 శాతం ఇండియా చూపిందని, 2040 నాటికి 20 శాతానికి పెరగవచ్చని నిపుణుల అంచనా. ఆధునిక భారత సమాజంలో బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగం క్రమం గా పెరగడం పర్యావరణానికి హానికరం అని తెలుసుకోవాలి. చమురు, యల్‌పిజీ ధరలు క్రమంగా పెరిగినా వాటి వినియోగాన్ని సామాన్యుల మానలేకుండా ఉన్నారు.
నేడు ప్రపంచ మానవాళి ముందు శిలాజ ఇంధనాల వినియోగంతో పర్యావరణ సంక్షోభంలో పడుతున్నారు. తరిగే శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ, తరగని పునరుత్పాదక సాంప్రదాయోతర ఇంధనాల వైపు దృష్టి సారించి రాబోయే సమాజానికి పర్యావరణ హిత శక్తి వెలుగులను అపూర్వ ఆరోగ్యకర ఆస్తిగా అందిద్దాం. మన హరిత శక్తి వెలుగుల వెనుక శిలాజ ఇంధన కాలుష్య నీడలు ఉండకుండా చూసుకుందాం. ఆరోగ్యంగా ఉంటేనే సుఖసంతోష జీవితం, అన్నీ ఉండి అనారోగ్యం కమ్ముకుంటే బతుకంతా చీకటే అని తెలుసుకుందాం.