Friday, April 19, 2024

60 గంటలుగా అంధకారంలోనే గ్రామాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఉద్యమం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలను మొదట వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు బలాన్ని చేకూర్చే విధంగా యూపి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆందోళనలు జరుగుతున్నాయి. వ్యవసాయ పంప్ సెట్ల వద్ద మీటర్లు పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బిజెపి పాలిత రాష్ట్రమైన యూపిలో విద్యుత్ ఉద్యోగులు ఏకంగా ఉద్యమించడం జాతీయ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు టెన్షన్ పడుతున్నారనే విమర్శలు వచ్చాయి. యూపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె దేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

యూపిలోని విద్యుత్ ఉద్యోగుల సమ్మె చిలికి చిలికి గాలి వానగా మారి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కొందరు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు వివరించారు. కాగా విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 60 గంటలుగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో యూపి రాష్ట్రం అంధకారంలోనే ఉంటోంది. ముఖ్యంగా విద్యుత్ లేక ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని ప్రధాన పట్టణాలు , గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వారణాసి తదితర ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. నగరంలోని బదాయిని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమ డిమాండ్ల కోసం గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నా యూపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అటు విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో సాధారణ ప్రజానీకంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విద్యుత్ సంస్థల్లో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ కోసం, అలాగే వేతనాల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ఆదివారం రాత్రి కూడా కొనసాగింది.ఫరాఖాబాద్, మజఫర్ నగర్, ప్రయాగ్‌రాజ్‌లో సమ్మె తీవ్ర స్థాయికి చేరింది. కాగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల హర్దోయి, ఫిరోజాబాద్, మురాదాబాద్, ఎటా, వారణాసి, రాయ్ బరేలీలో విద్యుత్ సరఫరాలో సమస్యలు నెలకొన్నాయి. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయ్‌బరేలీలో సుమారు వెయ్యి గ్రామాలు చీకట్లో మగ్గాయి.

70 అర్భన్ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. రాయ్‌బరేలీలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. జనరేటర్ల ద్వారా విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అరెస్టులు, సస్పెండ్‌లకు భయపడం …
కాగా ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని పవర్ జనరేషన్లను ఇంజనీర్ ఉద్యోగులు షట్ డౌన్ చేసేయడంతో విద్యుత్ పూర్తిగా నిలిచి పోయింది. సమ్మె ప్రారంభమైన తొలి రోజు నుండే విద్యుత్ సరఫరాలో అంతరాలు రావడం ప్రారంభించినా ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ కారణంగా విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో మెజారిటీ యూనిట్లు మూసివేయబడ్డాయి. ఫలితంగా ఉత్తర ప్రదేశ్‌లో విద్యుత్ సరఫరాలో సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా ఇస్టాల్ చేయబడిన పలు యూనిట్లు మూసివేశారు. ఇందులో అపర్ణా 2630 మెగావాట్లు, ఓబ్రా 1000 మెగావాట్లు,హర్దు గంజ్ 1265 మెగావాట్ల యూనిట్లు ఉన్నాయి. సమ్మె కారణంగా మొత్తంగా 1030 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది. కొన్ని చోట్ల కాంట్రాక్ట్ విద్యుత్‌ఉద్యోగులతోనే పని చేయించుకునేందుకు యత్నించిన ప్రభుత్వం సమ్మెపై బెట్టుగానే ఉంటోంది.

అటు ఓబ్రా థర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కారణంగా 200 మెగావాట్ల తొమ్మిది, 11 యూనిట్లు ఉద్యోగులు అందుబాటులో లేక మూతపడ్డాయి. కాగా మరో వైపు విద్యుత్ శాఖ ఉద్యోగుల సమ్మె వల్ల సుదీర్ఘ విద్యుత్ కోతలపై వారణాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నగరంలోని భదాయిని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనలు నిర్వహించారు. కాగా సమ్మె విరమించక పోతే చర్యలు తప్పవన్న ప్రభుత్వ హెచ్చరికలను విద్యుత్ ఉద్యోగులు లెక్క చేయడం లేదు. సమ్మెలో పాల్గొన్న విద్యుత్ సిబ్బందిని సస్పెండ్ చేయడం లేదా అరెస్టు చేయడం వంటి చర్యలకు దిగితే నిరవధిక సమ్మె చేపడతామని విద్యుత్ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News