Home ఎడిటోరియల్ కేరళలో గజేంద్ర ‘మోక్షం’!

కేరళలో గజేంద్ర ‘మోక్షం’!

 

కేరళలో జరిగే త్రిస్సూర్ పురం మందిర ఉత్సవాల్లో ఈ సంవత్సరం కొత్త ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది. రాష్ట్రంలోని అతిపెద్ద సెలబ్రిటీ ఏనుగు రాముపై నిషేధాన్ని జిల్లా యంత్రాంగం తొలగించింది. ఇప్పుడు ఉత్సవాల్లో ఈ ఏనుగు కూడా పాల్గొంటుంది. కేరళలో అత్యంత ఎత్తయిన ఏనుగు, మచ్చికైన ఏనుగు, మందిరంలో సేవలందించిన సెలబ్రిటీ ఏనుగు పేరు చిక్కొట్టుక్కావు రామచంద్రన్. చాలా కాలంగా ఈ ఏనుగు వివాదానికి కేంద్రమయ్యింది. కేరళలో జరిగే త్రిస్సూర్ పురం మందిర ఉత్సవాల్లో ఈ ఏనుగు పాల్గొనడానికి జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వడమే కాదు, ఈ ఏనుగుపై ఉన్న నిషేధాన్ని ఇప్పుడు తొలగించింది. ఈ ఏనుగుపై ఇంతవరకు కొనసాగుతున్న వివాదం కూడా దీంతో చల్లారింది. పండుగల్లో ఈ ఏనుగును ఊరేగింపుల్లోను, ఉత్సవాల్లోను ఉపయోగించరాదని గత ఏప్రిల్లో జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఈ నిషేధానికి కారణం ఏనుగు అనారోగ్యం. అనారోగ్యంతో పాటు హింసాత్మకంగా వ్యవహరించడం కూడా ప్రారంభించింది. పైగా ఒక కన్ను గుడ్డిది కూడాను. ఈ ఏనుగు వయసు 55 సంవత్సరాలు. 1990 తర్వాతి నుంచి ఈ ఏనుగు కాళ్ళకింద పడి 14 మంది నలిగి నుజ్జయి చనిపోయారు.

కాని మందిరంలో ఉత్సవం నిర్వహించే నిర్వాహకులు, ఏనుగుల యజమానులు అందరూ ఈ ఏనుగుపై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఏనుగు 10.5 అడుగుల ఎత్తున్న మహాగజరాజు. ఈ ఏనుగు ఉత్సవంలో, ఊరేగింపులో లేకపోతే ఉత్సవానికి కళే ఉండదని అందరూ వాదించసాగారు. మే 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ త్రిస్సూర్ పురం మందిర ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏనుగు అదుపు తప్పి ప్రజలను తొక్కేయడం చాలా సార్లు జరిగింది. ఫిబ్రవరి నెలలో 8వ తేదీన త్రిస్సూర్ జిల్లాలోనే ఒక గృహ ప్రవేశ కార్యక్రమం సందర్భంగా ఈ ఏనుగు అదుపు తప్పి ఇద్దరిని తొక్కేసింది. అదుపు చేయడం కష్టమని, హింసాత్మకంగా రెచ్చిపోతుందని అందరికీ తెలిసినప్పటికీ, ఈ ఏనుగు ఉత్సవంలో ఉండాలనే చాలా మంది కోరుతున్నారు. దాదాపు 10 ఫ్యాన్ ఫేజీలు ఫేస్‌బుక్‌లో ఉన్నాయి.

కేరళలో ఏనుగుల యజమానులు కూడా ఈ ఏనుగుపై నిషేధాన్ని తొలగించాలని గట్టిగా డిమాండ్ చేశారు. అంతేకాదు. నిషేధం ఎత్తేయకపోతే మందిరాలకు తమ వద్ద ఉన్న ఏనుగులను అద్దెకు పంపడం మానేస్తామని బెదిరింపులు, హెచ్చరికలు కూడా మొదలుపెట్టారు. ప్రజల్లో సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఉండే ఆదరణకు ఇది ఒక సూచనగా భావించాలా? ఈ వివాదానికి రాజకీయ రంగు పులమడం బిజెపి ప్రారంభించింది. రాష్ట్రంలోని పిన్నరాయి విజయన్ ప్రభుత్వం కేరళలోని గుడులలో ఉత్సవాలన్నింటినీ నాశనం చేయాలనుకుంటోందని బిజెపి ఆరోపించడం ప్రారంభించింది. శబరిమల మందిరం విషయంలోను ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని గగ్గోలు మొదలుపెట్టింది.

గమనించవలసిన విషయమేమంటే, శబరిమల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వు అది. విమర్శిస్తే బిజెపి సుప్రీంకోర్టును శబరిమల విషయంలో విమర్శించాలి. కాని ప్రజలు ఇవేవీ గమనించకుండా, తలూపుతారన్న గట్టి నమ్మకం బిజెపి నాయకులకే కాదు, మన రాజకీయనాయకులందరికీ ఉంది. అందువల్ల త్రిస్సూరులో ఈ భారీ గజరాజం అనారోగ్యం వల్ల ప్రజలకు నష్టం కలగకూడదని జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపడుతూ, ఇదంతా రాష్ట్రప్రభుత్వం హిందూ మత వ్యతిరేకత అని ప్రచారం చేయడం భారత ఆధునిక రాజకీయాల ప్రత్యేకత. ఇలాంటి ప్రచారం వల్లనే ఓట్ల వాన కురుస్తుందని నమ్మే వాతావరణం ఆధునిక భారత ప్రగతి.

ఏది ఏమైనా త్రిస్సూరులో అక్కడి జిల్లా కలెక్టరు పశువైద్యుల సలహాలు తీసుకుని, పరీక్షలు నిర్వహించి తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఏనుగును పశువైద్యుల బృందం పరీక్షించిందని, మందిర ఉత్సవంలో పాల్గొనడానికి ఫిట్ నెస్ ఉందని చెప్పారని, అందువల్ల ఈ ఏనుగుపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నామని జిల్లా కలెక్టర్ అనుపమ ప్రకటించారు. కాని ఈ వివాదం తర్వాత కేరళలో గుడులలో ఏనుగులను ఉపయోగించడం పై చర్చ ప్రారంభమైంది. కేరళలో ఆగష్టు నుంచి మే వరకు పది నెలల పాటు వరుసగా అనేక మందిరాల్లో ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఉత్సవంలో ఏనుగులను ఉపయోగిస్తారు. ఏనుగులను అందంగా అలకరించి ఊరేగింపుల్లో తిప్పుతారు. ఏనుగు అంబారీలపై దేవతా విగ్రహాలను తిప్పుతారు. ఈ పది నెలల కాలంలో కేరళలో వివిధ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి ఉత్సవాలు దాదాపు 500 ఉంటాయని అంచనా.

త్రిస్సూర్ పురం మందిర ఉత్సవంలో ఏనుగు ఊరేగింపు ఒక్కటే కాదు, బాజాభజంత్రీలు, టపాసులతో కోలాహాలంగా ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ఏనుగులపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. కొన్ని నెలల పాటు ఈ ఏనుగులకు కనీస విశ్రాంతి కూడా లభించదని అంటున్నారు. మందిరాల్లో ఊరేగింపుల్లో పాల్గొనే మచ్చికైన ఏనుగుల సంఖ్య గత పది సంవత్సరాల్లో తగ్గిపోయింది. మరోవైపు మందిరాల్లో ఉత్సవాల సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల ఏనుగులపై ఒత్తిడి చాలా పెరిగింది 2008లో కేరళలో మొత్తం 617 మచ్చికైన ఏనుగులు ఉండేవి. ప్రస్తుతం కేవలం 400 ఉన్నాయి. పండగల సంఖ్య పెరిగి 500 అయ్యింది. ఇప్పుడు ఈ 400 ఏనుగులే 500 పండగలకు హాజరు కావలసి వస్తోంది. ఒక్కో ఉత్సవంలో అనేక ఏనుగులను ఉపయోగిస్తుంటారు. పెద్ద మందిరాలైతే 120 ఏనుగుల వరకు వాడతారు. చిన్నిమందిరమైతే ఐదు ఏనుగులు ఉపయోగిస్తారు. 2018లో జరిగిన త్రిస్సూర్ పురం ఉత్సవంలో 117 ఏనుగులు పాల్గొన్నాయి.

ఈ ఏనుగులను అద్దెకు ఇచ్చే యజమానులు ఒక్కో ఏనుగుకు రోజుకు మూడు లక్షలు వసూలు చేస్తారు. భారీగా డబ్బుతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి ఏనుగుల యజమానులు ఏనుగు మదమెక్కి ఉన్న కాలంలో కూడా నిర్లక్ష్యంగా అద్దెకు ఇచ్చేస్తారు. అలాంటి ఏనుగును అదుపు చేయడం సాధ్యం కాదు. ఏప్రిల్13వ తేదీన ఒక మదమెక్కిన ఏనుగు ఇలాగే ఒక ఉత్సవంలో బీభత్సం సృష్టించింది. ఈ పండుగల సమయంలో ఏనుగులపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఒక మందిరం నుంచి మరో మందిరానికి వాటిని దూర ప్రాంతాలకు లారీల్లో రవాణా చేస్తుంటారు. సంకెళ్ళతో కట్టేసి ఉంచుతారు. సుదూర ప్రయాణం ముగిసే వరకు అవి అలాగే ఉండాలి. సరిపడనంత ఆహారం లేకపోవడం, విశ్రాంతి లేకపోవడం వల్ల వాటి జీర్ణవ్యవస్థపై, ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావం పడుతుందని, అవి అనారోగ్యానికి గురై మరణిస్తాయని చాలా మంది వివరిస్తున్నారు. గత 18 నెలల్లో 30కి పైగా ఏనుగులు మరణించాయి.

ఏనుగులను రవాణా చేస్తున్నప్పుడు ట్రక్కు డ్రయివర్ల నిర్లక్ష్యం వల్ల కూడా అవి తీవ్ర గాయాలకు గురవుతున్నాయి 2016 తర్వాతి నుంచి 2018 వరకు 59 ఏనుగులు మరణించిన తర్వాత కేరళ అటవీ శాఖ పెంపుడు ఏనుగుల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనల్లో మార్పులు చేసింది. ఏనుగు మదమెక్కిన కాలంలో దాన్ని పనిలో పెట్టరాదు. తగిన ఆహారం, విశ్రాంతి ఇవ్వాలి తదితర నియమాలు నిర్దేశించారు. పండగల్లో, ఊరేగింపుల్లో జబ్బుపడిన, గర్భంతో ఉన్న ఏనుగులను వాడరాదని, ఈ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు మే 9వ తేదీన ఆదేశించింది. పెంపుడు ఏనుగుల సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించడం, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకోవడం, మానవ హక్కులను పరిగణనలోకి తీసుకోవడం ఇవన్నీ అవసరం. కాని రాజకీయాలు మాత్రమే ముఖ్యంగా పార్టీలు భావిస్తున్నాయి.

Elephant Ramu opens Kerala festival after ban lifted