Home తాజా వార్తలు రాజీవించిన పోలీసులు

రాజీవించిన పోలీసులు

ps

హాస్టల్ యజమాని లైంగిక వేధింపులు
ఫిర్యాదు చేస్తే మీ పరువే పోతుందని బాలికలకు బెదిరింపు, వద్దని వారింపు
ఆశ్రయించిన విద్యార్థినులను భయపెట్టిన సరూర్‌నగర్ పోలీసుల నిర్వాకం

మన తెలంగాణ/ హైదరాబాద్: నగరంలోని ప్రైవేటు హాస్టల్‌లో చదువుతున్న ఐదుగురు విద్యార్థినులపై యజమాని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించిన ఆ బాలికలకు చేదు అనుభవం ఎదురైం ది. “మీరు ఆడ పిల్లలు. కోర్టుకు తిరగాల్సి వస్తుం ది. మీ పేర్లు కూడా బయటపడతాయి. పరువు పోతుంది. హాస్టల్‌లో ఉండాలంటే కేసులో రాజీ కుదుర్చుకోండి” అంటూ అక్కడి పోలీసులు బాధి త విద్యార్థులను దబాయించిన ఈ ఉదంతం రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థినులు ‘మన తెలంగాణ’ ప్రతినిధితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ఉన్నత చదువుల నిమిత్తం వచ్చిన 61 మంది విద్యార్థినులు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నారు. హాస్టల్ యజమాని సంపత్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని వారు పేర్కొన్నారు. సినిమాకు రమ్మని బలవంతం చేస్తున్నాడ ని, తాము రామని చెప్పడంతో కక్షగట్టి వేధిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి తమ గదిలోకి వచ్చి డోర్‌లాక్ చేస్తున్నాడని, ఎం దుకు ఇలా చేస్తున్నావని గట్టిగా అడిగితే ‘నా హాస్టల్ నేను రావద్దా’ అని అంటున్నాడని వారు వాపోయారు. సంపత్ లైంగిక వేధింపులకు హాస్టల్‌లోనే పనిచేస్తున్న నాగలక్ష్మి అనే ఉద్యోగిని కూడా సహకరిస్తోందని చెప్పారు. ‘యజమానితో సినిమాకు వెళితే భయం ఎందుకు? నేను కూడా వస్తా’ అని చెబుతోందని బాలికలు వాపోయారు. గతంలో ఇతని వేధింపులు భరించలేక పలువురు విద్యార్థినులు చదువు మధ్యలోనే ఆపేసి ఇంటి ముఖం పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది విద్యార్థినిలు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారని, తాము ధైర్యం చేసి పోలీసు స్టేషన్‌కు వెళితే ముందుగా పోలీసులు బాగానే స్పందించి కేసు పెట్టి, జైలులో పెడతామని ధైర్యం చెప్పారని తెలిపారు. నలుగురు కానిస్టేబుళ్లు తమ హాస్టల్‌కు విచారణ నిమిత్తం వచ్చిన తరువాత వారు సంపత్‌కు ఫోన్ చేసి మాట్లాడారని, తాము ఫిర్యాదు ఇచ్చిన ఆరగంట తరువాత పోలీసు స్టేషన్‌లో వాతావరణం మారిపోయిందని బాధిత విద్యార్థినిలు తెలిపారు. కేసు పెడితే కోర్టుకు తిరగాల్సి వస్తుందని భయపెడుతున్నారని, తమ పేర్లు కూడా బయట పడతాయని పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. హాస్టల్‌లో ఉండాలంటే రాజీ కుదుర్చుకోండి, కావాలంటే సంపత్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారన్నారు. తమకు కౌన్సిలింగ్ కాదని తమ భుజంపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించిన సంపత్‌కు శిక్ష పడాలన్నదే తమ కోరిక అన్నారు. అయితే తమతో పోలీసులు బలవంతంగా కౌన్సిలింగ్ కోసం కాగితం రాయించుకున్నారన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తాము మీడియాలో వచ్చిన కథనాలను చదివి ధైర్యం చేసి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే తమకు పోలీసుల నుంచి చేదు అనుభవం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి చట్టపరంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.