Home తాజా వార్తలు ఉపాధిహామీ పని దినాలు 12 కోట్లు

ఉపాధిహామీ పని దినాలు 12 కోట్లు

Minister-Errebelli

వేతనాల ఖర్చు రూ. 1800 కోట్లు
పల్లెప్రగతిలో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ఉపాధి హామీ పనుల మంజూరులో ప్రాధాన్యత
పథకం అమలుపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ’పల్లె ప్రగతి (30 రోజుల ప్రణాళిక)’అమలులో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ఉపాధి హామీ పనుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా జిపి భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకం అమలుపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో మంత్రి దయాకర్ రావు హైదరాబాద్లోని తన కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు.

’201920-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో 12 కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపిందని, ఆ వేతనాల అంచనా ఖర్చు రూ.1800 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇప్పటికి 9.77 కోట్ల పని దినాలు పూర్తయ్యాయని, దీని కింద 38.80 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది మెటిరియల్ కాంపౌండ్ కింద రూ.1200 కోట్లకు ఆమోదం ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులతోపాటు, హరితహారం చెల్లింపులు పోగా మిగిలిన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని సూచించారు. వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, సిసి రోడ్ల నిర్మాణానికి అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పల్లె ప్రగతిలో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు అభివృద్ధి పనుల మంజూరులో అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రతి గ్రామపంచాయతీలో శ్మశానవాటిక, డంపింగ్ యార్డుతోపాటు అవసరమైన సిసి రోడ్లను నిర్మించాలని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకం పనుల ప్రతిపాదనలు త్వరగా పూర్తి చేయాలన్నారు. జనవరిలోపు అన్ని పనులకు మంజూరు ఇవ్వాలని మంత్రి అన్నారు. శ్మశానవాటికలు నిర్మించే గ్రామపంచాయతీలకు సిసి రోడ్లు, ఇతర పనులలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని ఒకసారి పరిశీలించి నివేదిక రూపొందించాలన్నారు. ఇంకా మొదలుపెట్టని పనుల విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట కొత్త పనులు చేపట్టాలి’ అని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జిఎస్‌ఎ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామపంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలలో కొత్త గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భూమి లభ్యత ఉన్న వాటికే మంజూరు ఇవ్వాలని స్పష్టం చేశారు. పల్లె ప్రగతిలో పనితీరు బాగా ఉన్న గ్రామపంచాయతీలకే ఆర్‌జిఎస్‌ఎ భవనాల మంజూరులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికారాజ్, కమిషనర్ ఎం.రఘునందన్‌రావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్‌సీ సత్యనారాయణరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.

Employment Guarantee Working Days 12 crores