Home ఖమ్మం ’పచ్చడి ముక్కల’ బతుకులు

’పచ్చడి ముక్కల’ బతుకులు

Mango Chutneyఖమ్మం : ఎండాకాలం వచ్చిందంటే మామిడి సీజన్ ప్రారంభమైనట్లు లెక్క. మామిడిపండ్లు, పచ్చడి మామిడి కాయలు సమృధ్దిగా లభించేరోజులివి. ఫలరాజుగా పేరొందిన మామిడి అంటే ఇష్టపడని వారు అస్సలు ఉండరు. మామిడితో పులిహోర మొదలు, కోరు పచ్చడి, ఇంకా చెప్పాలంటే ఏడాది పాలు నిల్వ ఉండే మామిడికాయ (మాగాయ) పచ్చడిని టేస్ట్ చూడాలని ఉవ్విళ్లూరని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మామిడికాయ పచ్చడి తయారికి ముందు కాయను ముక్కలు ముక్కలుగా ఒకే సైజులో కట్‌చేస్తేనే చూడటానికి, తినటానికి పచ్చడి కమ్మగా ఉంటుంది. ఖమ్మం నగరం కాల్వోడ్డు ప్రాంతంలో రోడ్డుపై వెళుతుంటే రోడ్డు పక్కన పచ్చడికోసం మామిడికాయలు కట్ చేసే తోపుడుబండ్లు వరుసగా దర్శనమిస్తుంటాయి. ఖమ్మం పట్టణం శివారు కాలనీకి చెందిన కొన్ని కుటుంబాలు గత ఐదారేళ్లుగా వేసవి సీజన్‌లో దీన్నొక చిన్న తరహా సీజనల్ స్వయం ఉపాధిగా మలుచుకుని జీవనోపాధి పొందుతున్నారు. వారంతా ఉదయం 6 గంటలకు కాల్వోడ్డుకు వస్తారు. తోపుడు బండ్లపై పచ్చడి మామిడికాయలు కోసే ప్రత్యేకంగా ఉన్న పొడవాటి ప్రత్యేకమైన కత్తిపీటలను వెంట తెచ్చుకుంటారు. తోపుడు బండ్ల అడ్డాగా ఈ వేసవి సీజన్‌లో మామిడికాయలను పచ్చడికి అనుకూలంగా కట్ చేసే పనిని మొదలుడతారు. కాల్వోడ్డులో జూబ్లీక్లబ్ ముందు భాగం నుంచి అటు నెహ్రూ విగ్రహం వరకు, ఇటు కాల్వోడ్డు సెంటర్ వరకు వరుసగా తోపుడు బండ్లపై పచ్చడి మామిడికాయలు కట్ చేసేవారు, వారి దగ్గరుండి కాయలను కట్ చేయించుకునే వారు  కనిపిస్తుంటారు. అందుకు అవసరమైన కత్తిపీటలను పొడవుగా, పెద్దగా ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. తోపుడు బండ్లకు పరదాలు కట్టి ఆ నీడను నిలబడి ఉంటూ దంపతులిద్దరూ కష్టపడుతుంటారు. ముందుగా మామిడికాయలను నీటిలో నానబెడతారు. తరువాత పొడిగుడ్డతో శుభ్రంగా తుడుస్తారు. ఆ తరువాత ఆ కాయలు కొన్న వినియోగదారుని కోరిక మేరకు సైజు ప్రకారంగా చాలా జాగ్రత్తగా ముక్కలు ముక్కలుగా పచ్చడి పెట్టడానికి అనువుగా కట్ చేస్తుంటారు. ఈ పనిలో మామిడికాయలను నీటిలో నానబెట్టడం, పొడిగుడ్డతో శుభ్రంగా తుడవటం వంటి పనులు ఆడవారు చేస్తే ఏకాగ్రతతో మామిడికాయలు పచ్చడికి అనుకూలంగా ముక్కలు ముక్కలుగా కట్ చేయడం వంటి పనులు పురుషులు చేస్తున్నారు. ఈ పని ఏదో గంటో రెండు గంటలో మాత్రమే సాగేది కాదు. ఒకళ్లు తరువాత మరొకరు వచ్చి మామిడికాయలు కట్ చేయించుకుంటుంటారు. పచ్చడికి అనుకూలంగా మామిడికాయలను చివరి కాయ వరకు ఒకే పద్దతిలో కట్ చేయటం అంత ఈజీ కాదు. దానికి ఎంతో అనుభవం, నేర్పు, జాగ్రత్త ఉండాలి. మనసు పూర్తిగా చేస్తున్న పనిపైనే పెట్టాలి. ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నా వేళ్లు, చేతులు తెగటం ఖాయం. ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాలు కూడా అక్కడే చేసి ఇలా వీరు రాత్రి 9 గంటల వరకు తోపుడు బండ్ల వద్ద ఉండి వినియోగదారులకు మామిడికాయలు పచ్చడికి అనువుగా కట్ చేసి ఇస్తుంటారు. ఈ విధంగా వేసవి కాలం సీజన్‌లో దాదాపు 50 నుంచి 70 కుటుంబాలు దీన్నొక స్వయం ఉపాధిగా ఎంచుకున్నాయి. వీరు ఒక్కోక్కరు రోజుకు 400 నుంచి 600 వరకు మామిడికాయలను పచ్చడి కాయలుగా మారుస్తుంటారు. కాయను ముక్కగా మలిచే సైజును బట్టి ధర నిర్ణయిస్తారు. ఒక్కో కాయకు ముక్క సైజును బట్టి అర్ధ రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు చార్జ్ చేస్తారు. ఈ విధంగా రోజంతా కష్టపడితే వారికి వచ్చే రూ. 300లు మాత్రమే. కష్టానికి తగ్గ ఫలితం రాకపోయినా ఎండలకు వేరే పనికి వెళ్లలేక ఈ పనితోనే సర్దుకుంటున్నారు. సాధారణంగా వినియోగదారులు మార్కెట్‌లో పచ్చడి మామిడికాయలు కొని తెచ్చి ఇక్కడ ముక్కలుగా కొట్టించుకుంటారు. అలా చేసేవారు ఇప్పటికీ ఉన్నారు. అయితే ఇక్కడున్న వారిలో చాలా మంది తామే పచ్చడి మామిడికాయలు అమ్మటం, పచ్చడి ముక్కలు చేయడం వల్ల రెండు విధాలు ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల వీరి ఆదాయం మరికొంత పెరిగే అవకాశం ఉంది. ముక్కలుగా కొట్టాక వినియోగదారులు ఇంటికి తీసుకెళ్లి జీడి తీసి, పచ్చడిగా తయారుచేస్తుంటారు. ఒక్కొక్కరు సగటును రోజుకు 500 కాయల వరకు ముక్కలుగా కొడతారు. వర్షం పడితే పల్లెల నుంచి ప్రజలు వస్తే తమకు గిరాకీ పెరుగుతుందని ఇదే పనిలో ఐదేళ్ల అనుభవం ఉన్న ఖమ్మం కాల్వోడ్డుకు చెందిన లింగయ్య, లక్ష్మీ చెప్తున్నారు. ఇప్పటికే 20 రోజుల నుంచి ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. ఇంకొక పది, పదిహేను రోజుల్లో వర్షం పడితే సీజన్ మరింత పుంజుకుంటుందని చెప్తున్నారు. మరో నెలరోజుల వరకు తమకు ఈ పని ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటివరకు స్వల్ప సంఖ్యలోనే మామిడికాయలు కొట్టించుకునేవారు వస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో కాయలు కొట్టించుకుంటేనే శ్రమకు తగిన ఫలితం వస్తుందని అంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు , వసతిగృహాలు, క్యాటరింగ్ వాళ్లు, ఇళ్లల్లో పచ్చళ్లుపెట్టి స్వయం ఉపాధి పొందేవారు, మెస్, హోటళ్లవారు పెద్ద సంఖ్యలో కాయలు కొట్టించుకుంటుంటారని వారు వస్తేనే తమకు గిరాకీ బాగా ఉంటుందని వారు చెప్పారు.

Employment With Mango Chutney Manufacturing