Thursday, April 25, 2024

కాకలుతీరిన కమ్యూనిస్టు యోధుడు

- Advertisement -
- Advertisement -

ఇఎంఎస్ నంబూద్రిపాద్ మొట్టమొదట 1939లో మద్రాసు ప్రొవిన్షియల్ శాసన సభకు ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీని విస్తృత పరచడానికి ఆయన తన వాటాగా వచ్చిన ఆస్తిని పార్టీకి విరాళంగా ఇచ్చారు. అతను 1939-42, 1948- 50 మధ్య అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన 1941 లో భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు. డిసెంబరు, 1950లో సిపిఐ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సెక్రటేరియట్ సభ్యునిగా పని చేశారు. 1957లో కేరళ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ మెజారిటీ సాధించడంతో 1957 ఏప్రిల్ 5 నాడు కేరళ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్టు ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు.

భూ సంస్కరణల చట్టాన్ని, విద్యా చట్టాన్ని తీసుకు వచ్చారు. వివాదాస్పదమైన పరిస్థితుల్లో 1959లో కేంద్ర ప్రభుత్వం, భారత రాజ్యాంగంలోని 356 వ అధికరణం అనుసరించి రాష్ట్రపతి పాలన విధిస్తూ ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. కేరళ శాసన సభకు 1960- 64, తిరిగి 1970-77 కాలంలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. 1967లో రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి నంబూద్రిపాద్ ముస్లిం లీగ్‌తో సహా 7 పార్టీల మద్దతు స్వీకరించారు. 1964లో సిపిఐ(ఎం)ను స్థాపించిన తరువాత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి అందులో చేరారు. 1964లో జరిగిన అఖిల భారత మహాసభలో పార్టీలో కేంద్ర కమిటీ, పార్టీ పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. ఆయన మరణం వరకు ఈ పదవిలో కొనసాగారు.

1977లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శిగా పదవిని చేబట్టి 1992 వరకు ఆ బాధ్యతలను నిర్వహించారు. అన్ని వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను సమీకరించడంలో ఆయన నాయకత్వం అమూల్యమైనది. ఒక తెలివైన మార్క్సిస్ట్ సిద్ధాంత కర్తగా, భారతీయ సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజం లెనినిజం అన్వయించడంతో పాటు భారతీయ విప్లవం వ్యూహానికి అనుగుణంగా సాగించాల్సిన, సాగించిన కృషిని ఆయన రచించారు. ఆయన రాసిన పలు గ్రంథాలలో కేరళ చరిత్ర అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.

భూమి సంబంధాలు, కేరళ, సమాజం, రాజకీయాలు, మార్క్సిస్టు తత్వశాస్త్రం, సాహిత్యం, చరిత్రలపై ఆయన రాసిన రచనలతో ఆయన్ను దేశంలోనే గాక ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కమ్యూనిస్టు ఆలోచనాపరులలో ఒకరిగా గుర్తించబడ్డారు. విశిష్ట మార్క్సిస్ట్ సూత్రవేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ముందు చూపుకు, నిజాయితీ నిబద్ధతలకు కేరళ సాధించిన అభివృద్ధే తార్కాణం. ప్రజల యోజన ద్వారా కేరళలో అధికార, వనరుల వికేంద్రీకరణకు, అక్షరాస్యత ఉద్యమానికి కృషి చేశారు. ఆంగ్ల, మలయాళ భాషల్లో అనేక పుస్తకాలు రచించిన నంబూద్రిపాద్ పత్రికా విలేకరిగా కూడా సుపరిచితుడే. ఈ నాటికీ కేరళలో ఆయన పేరు, ఒకప్పటి ఈయన ప్రభుత్వ పనితీరుల గురించి దినదినం గొప్పగా చెప్పుకుంటూనే ఉంటారు.

రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News