Home రాష్ట్ర వార్తలు హోరాహోరీ ఎదురుకాల్పులు

హోరాహోరీ ఎదురుకాల్పులు

bullets

కాల్పులతో కవ్వించిన మావోయిస్టులు
ఎదిరించి వెంబడించిన పోలీసులు
భద్రాచలం డివిజన్ చర్ల మండల పరిధిలో రెండు గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్

భద్రాచలం: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం లో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య రెండు సార్లు హోరాహోరీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రాచలం డివిజన్‌లోని చర్ల మండల పరిధిలో గల తిప్పాపురం సమీపంలో ఉన్న గోరుకొండ గ్రామం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తో గూడెంలో ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఇటీవల కాలంగా సిఆర్‌పిఎఫ్ బేస్ నిర్వహిస్తోంది. పామేడు నుండి బాసగూడెంకు ఆ రాష్ట్ర టిడబ్ల్యుడి ఆధ్వర్యంలో రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. ఉదయం 11గంటల ప్రాంతంలో రహదారి పను ల రక్షణ కోసం గస్తీ నిర్వహిస్తుండగా పోలీసు బలగాలను లక్షంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం వెంటనే కాల్పులు జరిపారు. మావోయిస్టులు వెనుదిరిగారు. ఇదే అదునుగా పోలీసులు సుమారు 5 కి.మీ దూరంలో
గల తెలంగాణ ప్రాంతమైన గోరుకొండ అటవీ ప్రాంతం వరకు మావోయిస్టులను వెంబడించారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసుల మధ్య మరోసారి సుమారు రెండు గంటల పాటు గోరుకొండలో హోరాహోరీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులకు గాయాలు అయ్యాయి. గాయాలపాలైన వారిని తిప్పాపురం చెరువు వరకు మావోయిస్టులు మోసుకెళ్లారు. తోగ్గూడెం గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉండగా ఆ పాఠశాల సమీపంలోనే ఈ కాల్పులు చోటు చేసుకోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాల్పులు జరుగుతున్న సమయంలో తూటాలు సమీపంలోని చెట్లకు, ఇళ్లపై కప్పులకు, ద్వార బందాలకు తగిలిన పెచ్చులు ఊడాయి. -తిప్పాపురం చెరువు సమీపానికి చేరుకున్న మావోయిస్టులు మావోయిస్టులు పోలీసుల వైపు బాంబులు విసిరేసి దుమ్ముంటే రమ్మని సవాలు విసిరినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు కవ్వింపుచర్యలకు పాల్పడినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారు. ఈనెల 5న తెలంగాణ రాష్ట్ర కమిటీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోరుకొండలో జరిగిన కాల్పుల సంఘటనతో ఆప్రాంత గిరిజనులు భయాందోళనలో ఉన్నారు. పోలీసుల వైపు నుండి ఎటువంటి ప్రాణహాని జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో భయం.. భయం…
జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న మావోయిస్టుల కార్యకలాపాలతో భయానక వాతావరణం చోటు చేసుకుంది. గత నెల 26న రాత్రి పినపాక మండలంలో ఇన్‌ఫార్మర్ అంటూ మావోయిస్టులు ఆ గిరిజనున్ని హతమార్చారు. మరో గిరిజనున్ని కాల్చే ప్రయత్నం చేయగా ఆయన చాకచక్యంగా తప్పించుకోవడంతో తూటా చేతికి తగిలి గాయమైంది. తాజాగా ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో కార్యకలాపాలు ముమ్మరం అవుతున్నట్లు తెలుస్తోంది. ఉనికి కోల్పోయిన ప్రాంతాల్లో సైతం మరో సారి పట్టు సాధిస్తూ వ్యూహాలకు పదును పెడుతుండటంతో మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతమవుతున్నాయి.