Wednesday, April 24, 2024

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

Electric Vehicles

 

రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాలు 138
హైదరాబాద్ నగరంలో స్టేషన్‌లు 118
పై సంస్థలతో ఒప్పంది చేసుకున్న టిఎస్ ఆర్‌ఇడిసిఓ
టిఎస్‌ఇఆర్‌సి సూచనతో చార్జింగ్ రుసుంల ఖరారు

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టిఎస్ ఆర్‌ఇడిసిఓ)కు ప్రభుత్వం అప్పగించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో అనుభవం ఉన్న ప్రధానమైన మూడు సంస్థలతో టిఎస్ రెడ్‌కో ఇటీవల అవగాహన ఒప్పందం చేసుకున్నది. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల విభాగం(డిహెచ్‌ఐ జిఓఐ) మార్గనిర్దేశకాలకు అనుగుణంగా చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని టిఎస్ రెడ్‌కో ఆ సంస్థలకు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 138 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆ సంస్థలకు టిఎస్ ఆర్‌ఇడిసి సూచించింది. ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) సూత్రాలకు లోబడి ఆ కేంద్రాలు ఉండాలని ఆ సంస్థలకు స్పష్టం చేసింది.

138 చార్జింగ్ కేంద్రాలు
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు మొత్తం 138 ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని టిఎస్ రెడ్‌కో నిర్ణయించింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌లో 118, వరంగల్ నగరంలో 10, కరీంనగర్ నగరంలో 10 కేంద్రాలను ఏర్పాటు చేయాలని రెడ్‌కో నిర్ణయించింది. వీటి ఏర్పాటు చేసేందుకు రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంట్స్ లిమిటెడ్(ఆర్‌ఇఐఎల్)కు 57(హైదరాబాద్‌లో 37, వరంగల్‌లో 10, కరీంనగర్‌లో 10), నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్(ఎన్‌టిపిసి)కు హైదరాబాద్‌లో 32, ఎనర్జీ ఎఫిసెయెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్)కు హైదరాబాద్‌లో 49 కేంద్రాల ఏర్పాటు చేయాలని ఒప్పందంలో రెడ్‌కో స్పష్టం చేసింది.

స్థానిక సంస్థలకు ఆదాయం
చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పుటకు కావాల్సిన భూమిని లీజు ప్రాతిపదికన లేదా వచ్చే ఆదాయాన్ని పరస్పరం పంచుకునేట్టుగా పట్టణ స్థానిక సంస్థలతో లేదా విద్యుత్ సంస్థలతో ఒప్పందిం కుదుర్చుకోవాలని రెడ్‌కో సూచించింది. అయితే ఆ ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసేందుకు నివేదికను భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల విభాగంకు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ చార్జింగ్ కేంద్రాలను ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ ప్రవేశించే, బయటకు వెళ్ళే మార్గాల్లో, పార్కులు, ప్రజలు వాహనాలను నిలిపే పార్కింగ్ ప్రాంతాల్లో, విద్యుత్ సబ్‌స్టేషన్‌లకు చేరువగా ఏర్పాటు చేయాలని రెడ్‌కో సూచించింది.

నియంత్రణ మండలి వద్ద చార్జి ప్రతిపాదనలు
ఎలక్ట్రిక్ వాహనాలను ‘లో టెన్షన్, హై టెన్షన్’ వాహనాలనే రెండు కేటగిరీలుగా విభజించి చార్జింగ్ రుసుంలను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మం డలి నిర్ణయించనున్నది. గతంలో 2017, 2018లో ఎల్‌టి వాహనాలకు సున్నా నుంచి 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్‌కు రూ.7.50లు, 101 నుంచి 300 యూనిట్ల వరకు ప్రతి యూనిట్‌కు రూ. 8.90 లు, 301నుంచి 500 యూనిట్ల వరకు ప్రతియూనిట్‌కు రూ.9.40లు, చార్జింగ్ ఫిక్స్‌గా నెలకు రూ. 60లుగా నెలకు కె.డబ్లూగా ఖరారు చేయాలని భావించింది. హైటెన్షన్ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్‌కు 11కెవి వరకు ప్రతి యూనిట్‌కు రూ. 7.80లు, 33 కెవి వరకు ప్రతి యూనిట్‌కు రూ. 7 లు, 132 కెవి వరకు ప్రతి యూనిట్‌కు రూ. 6.80లుగా నిర్ణయించాలనే ప్రతిపాదనల్లో ఉన్నాయి. విద్యుత్ సంస్థలు మాత్రం ఎల్‌టి వాహనాలకు ప్రతి యూ నిట్‌కు రూ. 6.10లు, హెచ్‌టి వాహనాలకు య్రూనిట్‌కు రూ. 6.10లుగానూ కానీ, ఉ.6 నుంచి ఉ. 10 గం.ల వరకు చార్జింగ్ చేసుకుంటే యూనిట్‌కు రూ. 7.10లు, రా.10గం.ల నుంచి ఉ. 6గం.ల వరకు రూ. 5.10లుగా ప్రతిపాదించాయి.

 

Encouragement for Electric Vehicles
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News