Home ఖమ్మం అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలు

అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలు

Rural-sports Rural-sports.jpg1

ఖమ్మం: సమిష్టి తత్వాన్ని, సామూహిక జీవితాన్ని, అనుబంధాలను, పరస్పర ప్రేమానురాగాలను పెంచేవే గ్రామీణ క్రీడలు. నేడు గంటల తరబడి టీవిల ముందు కూర్చొని సీరియల్స్ చూడడం, ఆట ఆడడం కన్నా ప్రేక్షకుల్లా, శరీరం కదలకుండా చూడడమే మనకు ఆటపాట అవుతుంది. ఇది చాలదన్నట్లు యువత వీడియోగేమ్స్ రూపంలో తీరిక లేకుండా ఉంది. గత కాలంతో పోల్చిచూస్తే గ్రామీణ క్రీడలకు ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుతం గ్రామీణ క్రీడల్లో చాలావరకు మాయమై ఒకటి, రెండు మాత్రమే మిగిలాయి. వస్తువులు మాయమైనట్లే, మనుషులతోపాటు మమతలు దూరమైనట్లే ఆటలు కూడా వాటిని అనుసరించాయి. గ్రామీణ క్రీడలు మన శరీరానికి, మానసిక వికాసానికే కాక వినోదానికి కూడా ప్రాధాన్యత ఇస్తాయి. తార్కిక బుద్దికి ఎత్తుకు పైఎత్తులు ‘పుంజీతం’ నేర్పితే, ముందువాడిని వెనక్కునెట్టి రాజు కావడం ఎలానో ‘పచ్చీసు’ వివరిస్తుంది. ఇటువంటి ఆటలు గ్రామీణ క్రీడలుగా చెబుతున్నప్పటికీ ప్రతి ఆటలోని మనవాళ్లు ఐక్యతకు పెద్ద పీట వేశారు. ఈ క్రీడలు ఆటకైనా, బ్రతుకు ఆటకైనా నిబంధనలుంటాయని తెలుపుతాయి. సృజన వ్యక్తిగత ప్రతిభ నుండి పుట్టి సమాజగతమవుతుందని ఈ క్రీడలు నిరూపిస్తాయి. చిన్నారులు ఆడే గోలీల ఆటతో వారిలో చక్కని స్నేహబంధాన్ని చూడవచ్చు. మనిషి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న తరుణంలో పిల్లలు గోళీల ఆట ఆడి అధికంగా గోళీలు సంపాదిస్తే వారు పొందిన ఆనందానికి అవధులుండవు. ఐదువేళ్లు కలిపి ఆడే అచ్చనగిల్ల చేతివేళ్లకు వ్యాయమంతోపాటు బాలికలలో దాగి ఉండే సృజనాత్మక శక్తిని వెలికి తీసేదిలా ఉంటుంది. శరీర వ్యాయామానికి తొక్కుడుబిళ్ల ఆట దోహదపడుతుంది. గతంతో తీరిక సమయాల్లో గ్రామాల్లోని కూడలి వద్ద అష్టచమ్మ, దాడి, వామనగుంటలు లాంటి ఆటలు గ్రామస్తులు అధికంగా ఆడేవారు. చిన్నచిన్న పందాలు కాస్తూ ఆటకు రక్తికట్టించేలా వారు క్రీడల్లో పాల్గొనేవారు. గ్రామీణ క్రీడలు ఎటువంటి ఘర్షణ వాతావరణానికి తావివ్వకుండా ఐక్యత వాతావారణంలో కొనసాగేవి. ఇంతేకాకుండా గోడిబిళ్ల, చెడుగుడు, కబడ్డీ క్రీడలు దేహధారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా మనిషిలోని సహజస్థితి, కలసికట్టు తనానికి నిదర్శనంగా ఉంటాయి. ప్రస్తుత సెల్‌యుగంలో ఈ గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్నాయి. గ్రామాల్లో ఐక్యత వాతావరణం దెబ్బతిని కక్షపూరిత వాతావరణం పెరుగుతుంది. ప్రశాంతతకు భంగం వాటిల్లిన పల్లెలు సౌభాగ్యాన్ని పూర్తిగా కోల్పోతున్నాయి. కబడ్డీ మోటయింది. గోలీలు మూలనపడ్డాయి. దాగుడుమూతలు దగాకోరు ఆటగా ఎదిగింది. గ్రామీణ క్రీడల స్థానంలో క్రొత్త క్రీడలు వచ్చాయి. క్రికెట్, టేబుల్‌టెన్నిస్, గోల్ఫ్, స్నూకర్ తదితర పాశ్చాత్య ఆటలను ప్రస్తుతం అనుకరిస్తున్నారు. ప్రశాంత గ్రామీణ వాతావరణంలో ఆడాల్సిన క్రీడలను మరచిపోయి పాశ్చాత్య ఆటలను కొనసాగిస్తున్న గ్రామీణ ప్రజలు ఒకరినొకరి మధ్య ఎటువంటి ఐక్యత లేకుండా గడపాల్సిన దుస్థితి రోజురోజుకీ పెరుగుతుంది. ప్రభుత్వం గ్రామీణ క్రీడలు ప్రోత్సహించేందుకు గ్రామాల్లో క్రీడలు నిర్వహిస్తున్నప్పటీకి వాటికి గురించి ప్రజలను చైతన్య పరచడంలో విఫలమవుతుంది. ప్రతి పాఠశాలలో గ్రామీణ క్రీడలు విద్యార్ధులకు నేర్పించే విధంగా చర్యలు తీసుకొని, ఐకత్య వాతావారణం చోటు చేసుకునేలా ప్రయత్నించాలని క్రీడకారులు కోరుతున్నారు.