Friday, March 29, 2024

ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్!

- Advertisement -
- Advertisement -

Engineering in regional languages!

 

ఆశయమెంత మంచిదైనా, గొప్పదైనా ఆచరణ గీటురాయి మీద విఫలమైతే దాని వల్ల మేలు కలగదు, సరికదా చెప్పలేనంత కీడు కలిగే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. తగిన పునాదిని నిర్మించకుండా కట్టిన భవనం మాదిరిగా కుప్పకూలుతుంది. దేశమంతటి మీద హిందీని రుద్ది దానిని జాతీయ భాషగా ప్రజల నాలుకలపై నర్తింప చేయాలని కేంద్రంలోని ఉత్తరాది పాలకులు ఎంతగా ప్రయత్నిస్తున్నా అది ఫలించడం లేదు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ డిగ్రీ విద్యను మాతృభాషల్లో బోధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఘనమైనదిగా భావించి ప్రశంసించలేము. తెలుగు, మరి నాలుగు ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ విద్యా బోధనను దేశంలోని 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాలు, దళితులు ఇంజినీరింగ్ విద్యను సులభంగా చదువుకోడానికి ఇది తోడ్పడుతుందని ఆయన అన్నారు. అణగారిన వర్గాల పిల్లలు ఉన్నత సాంకేతిక విద్యను నేర్చుకొని బాగుపడాలన్న ఆయన ఆకాంక్షను, ఆరాటాన్ని ఎంతైనా మెచ్చుకోవాలి.

అయితే అటువంటి సమున్నత లక్షాలను చేరుకోడానికి దగ్గరి దారులుండవు. ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉండే ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక విద్యలను ఆ మాధ్యమంలోనే చదివి ఉత్తీర్ణులై సమాజానికి విశేషంగా ఉపయోగపడగల ప్రతిభ పాటవాలు కింది వర్గాల పిల్లల్లో ఉండవనే అభిప్రాయం కూడా నిజం కాదు. సంపన్నులకుండే అవకాశాలను పరిపూర్ణంగా కల్పిస్తే వారికి దీటుగానూ, అంతకంటే మిన్నగానూ ఎంతటి జటిలమైన విద్యలలోనైనా ఆరితేరగల సామర్థం అణగారిన వర్గాల పిల్లల్లో ఉండి తీరుతుంది. మాతృభాషల్లో ఇంజినీరింగ్ తదితర సాంకేతిక విద్యల బోధన అనే లక్షాన్ని సాధించాలంటే ఆంగ్లంలో ఉండే ఆయా చదువుల పాఠ్యగ్రంథాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా, నిర్దోషంగా ఆయా భాషల్లోకి అనువదింప చేయాలి. అలాగే మాతృభాషల్లో సాంకేతిక విద్యలు చదువుకున్న వారికి తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు లభించే విధంగా చూడాలి. ఈ బాధ్యత పాలకులపై ఇనుమిక్కిలిగా ఉంది.

వారు అలా చేయలేకపోతే ఆ వైఫల్యం మాతృభాషల్లో పై చదువులు చదువుకున్న పిల్లల భవిష్యత్తు పై పడి వారి బతుకులను నాశనం చేస్తుంది. కొత్త జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో ఈ ఏడాది నుంచి ఇంజినీరింగ్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 12 ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సును నేర్పాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కళాశాలల్లో ఆంగ్లాన్ని ఒక భాషగా మాత్రమే బోధిస్తారు. తెలుగు మాధ్యమంలో పట్టభద్రులైన అనేక మంది యువతీ యువకులకు మంచి ఉద్యోగావకాశాలు ఎంతగా గగనమైపోతున్నాయో చూస్తున్నాము. మాతృభాష ఔన్నత్యాన్ని గురించి ఎవరెన్ని విధాలుగా చాటుతున్నా వాస్తవంలో కింది స్థాయి నుంచి పై వరకు తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్లంలో బోధించే ప్రైవేటు పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. సంపన్నులు తమ పిల్లలను ఖరీదైన, కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తుంటే పేదలు వారి సంతానాన్ని అతి తక్కువ ఫీజులు తీసుకునే ఆంగ్ల మాధ్యమ ప్రైవేటు ‘పాక’శాలలకైనా పంపిస్తున్నారు గాని తెలుగులో చదువు చెప్పే ప్రభుత్వ బడులలో చేర్చడం లేదు.

దీనితో కొన్ని రాష్ట్రాల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్లంలో బోధించే పద్ధతిని ప్రవేశపెట్టడం, మాతృభాషా వాదులు దానిని అడ్డుకోబోడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయి, విద్యావంతులైన యువత ప్రైవేటురంగంపై ఆధారపడకతప్పని పరిస్థితి తలెత్తి చాలా కాలమైంది. విదేశీ ప్రైవేటు సంస్థలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్న సంగతీ విదితమే. అందుచేత ఆంగ్లంలో చదువుకున్న వారికి గల ఉద్యోగావకాశాలు మాతృభాషామాధ్యమాల్లో విద్య నేరుకునే వారికి ఉండవు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి విదేశాల్లో ఉద్యోగాలకైతే స్థానిక భాషల్లో చదువుకునే వారు బొత్తిగా అనర్హులవుతారు. తమిళనాడులో పదకొండేళ్ల నుంచి సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులను ప్రయోగాత్మకంగా తమిళంలోనే బోధిస్తున్నారు. కాని విద్యార్థుల నుంచి ఈ కోర్సులకు తగిన స్పందన లేదు.

ఇంగ్లీషు మీడియం సీట్లు పూర్తిగా భర్తీ అయిపోయిన తర్వాత మాత్రమే కొంత మంది విద్యార్థులు తమిళ ఇంజినీరింగ్ చదువుల్లో చేరుతున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ తర్వాత పిజి కోర్సుల్లో చేరడానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘గేట్’ ను కూడా ఆంగ్లంలోనే రాయాలి. అందుచేత ఆంగ్లాన్ని ఏదో విధంగా తరిమేసే ముందు ప్రాంతీయ భాషల్లోనూ ఆ తర్వాత హిందీ మాధ్యమంలోనూ చదవక తప్పని పరిస్థితి కల్పించాలనే వ్యూహం విజయవంతం కాజాలదు. ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ చదువుకునే వారి సంఖ్య అసాధారణంగా పెరిగిపోయిన తర్వాత ఉద్యోగాల్లో కోటా కోసం వారి నుంచి కూడా డిమాండ్ పెరిగే అవకాశం లేకపోలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News