Home ఆఫ్ బీట్ అమీర్‌పేట్.. గేట్‌వే ఆఫ్ అమెరికా

అమీర్‌పేట్.. గేట్‌వే ఆఫ్ అమెరికా

ఎంత సంక్షోభం ఉన్నా.. సరికొత్త నైపుణ్యాలున్నవారికి ఇప్పటికీ రెడ్‌కార్పెటే. అందులోనూ తాజా టెక్నాలజీలపై పట్టున్న ప్రెషర్స్‌కి ఎప్పటికీ డిమాండే. ఎవరైనా ఇంజనీరింగ్‌గానీ, ఇతర టెక్నాలజీ కోర్సులుగానీ పూర్తి చేసుకుని అమెరికా వెళ్లాలన్నా… లేదా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో చేరాలన్నా  అమీర్‌పేట్‌లో శిక్షణ తీసుకోవాల్సిందే. రోజురోజుకు సాంకేతికతలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నా, అందుకు సంబంధించిన కోర్సులు అమీర్‌పేటలో ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సును అందిపుచ్చుకునే లోపే, మరో కోర్సు సాఫ్ట్‌వేర్ యువతకు పరిచయం  అవుతోంది. అమీర్‌పేటలో కోచింగ్ తీసుకుని హైటెక్ సిటీలో ఉద్యోగం సాధించవచ్చనే ఆలోచన చాలామంది విద్యార్థులది. కొత్త టెక్నాలజీలో అనుభవం ఉన్న ఫ్యాకల్టీ.. కాలేజీల్లో కన్నా అమీర్‌పేట శిక్షణ కేంద్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నారని అక్కడ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు చెబుతున్నారు.

* సాఫ్ట్‌వేర్ కోర్సులకు చిరునామా * దేశవిదేశాల విద్యార్థుల చూపు ఇటు వైపే
* తక్కువ ఫీజు..తక్కువ వ్యవధిలో నైపుణ్యాలు పెంచే శిక్షణ
* మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు

Software-Courses

కొత్త కోర్సులకు చిరునామా అమీర్‌పేట్.. ఒక పక్క ఐటి ఉద్యోగులను తొలగిస్తున్నా, రకరకాల వీసాల ఆంక్షలతో అమెరికా దారులు మూసుకుపోతున్నా అమీర్‌పేట్ ఐటీ కేంద్రాలకు వస్తున్న వాళ్ల సంఖ్య తగ్గలేదు. ఎప్పటికప్పుడు మార్కెట్ ఓరియెంటెడ్ కొత్త కోర్సులను అందుబాటులోకి తేవడమే అమీర్‌పేట్ ఐటీ శిక్షణా కేంద్రాల సక్సెస్‌కి కారణం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కోర్సులు పుట్టుకురావడం సహజమే. అమీర్‌పేట్‌లోని శిక్షణ కేంద్రాలలో సి లాంగ్వేజ్, సి++, ఒరాకిల్, డాట్‌నెట్, జావా వంటి బేసిక్ కోర్సులతో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఎడబ్లూఎస్), క్లౌడ్, డాటా సర్వీసెస్, సైబర్ సెక్యురిటీ, మొబైల్ టెక్నాలజి వంటి అధునాతన కోర్సుల వరకు అన్ని రకాల కోర్సులకు శిక్షణ లభిస్తోంది.

సరికొత్త సాఫ్ట్‌వేర్ కోర్సులతో పాటు హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్ కోర్సులకు ఇక్కడ శిక్షణ అందిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్వాసనల నేపథ్యంలో చాలా మంది పాత టెకీలు తమనుతాము అప్‌డేట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న వారితో పాటు పూర్తయిన వారిలో చాలామంది అమీర్‌పేటలో ఏదో ఒక కోర్సులో చేరి శిక్షణ తీసుకుంటుంటారు. ప్యూచర్ టెక్నాలజీని నేర్చుకోవాలంటే ఇక్కడి కోచింగ్ సెంటర్లలో ఎక్కడో ఒకచోట అందుబాటులో ఉంటాయి. థియరీతో పాటు వారి కోసం ప్రాక్టికల్ చేయించేందుకు ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఖర్చుతోనే డిమాండ్ ఉన్న కోర్సులు లభిస్తాయి. కాబట్టి అమీర్‌పేట్ ఐటీ శిక్షణ పరంగా ఎప్పటికీ బిజీగానే ఉంటుంది. తక్కువ ఫీజు ఉంది కదా… క్వాలిటీ ఎలా ఉంటుందోనని భయపడనక్కర్లేదు. నాణ్యతా ప్రమాణాలలోనూ ఇక్కడి సంస్థలు పోటీ పడుతుంటాయి.

అమెరికాకు దగ్గరి దారి అమీర్‌పేట్

అమెరికా… సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కలల ప్రపంచం. అందమైన భవిష్యత్తును అందించే అద్భుత లోకం. ఆ కలలను సాకారం చేసుకోవాలనుకున్న వారు ముందుగా అమీర్‌పేట్‌లో అడుగు పెట్టాల్సిందే. తెలుగు రాష్ట్రాల యువతే కాక, దేశ రాజధాని ఢిల్లీ సహా దేశం నలుమూలల నుంచి బోలెడన్ని ఐటీ కలలతో ‘అమెరికా వయా అమీర్‌పేట్’ వెళ్దామనే ఆశతో ఇక్కడ ల్యాండయిపోతుంటారు. అప్పుడే కళాశాల నుంచి బయటకు వచ్చిన వారితో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు సైతం ఇక్కడ తమ సాంకేతిక ప్రతిభకు మెరుగులు దిద్దుకొని… విమానం ఎక్కుతున్నారు. సాఫ్ట్‌వేర్ కోర్సులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతం…అభ్యర్థులకు శిక్షణ అందించడమే కాదు… పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం సాఫ్ట్‌వేర్ శిక్షణకు అమీర్‌పేట్ వస్తుంటారు. వీటితో పాటు ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్‌లో ప్రాజెక్టు శిక్షణకూ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. దాదాపు లక్షకు పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో వివిధ కోర్సులు, ప్రాజెక్టులకు సంబంధించి శిక్షణ పొందుతున్నారు. మిగతా నగరాల్లో ఎన్నో శిక్షణ సంస్థలు ఉన్నప్పటికీ…ఇక్కడ ఫీజు తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఇటువైపు క్యూ కడుతున్నారు.

ఎందరికో ఉపాధి : సాఫ్ట్‌వేర్ కోర్సులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అమీర్‌పేలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. టీ స్టాళ్లు, చాట్‌బండార్, టిఫిన్ సెంటర్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారుల నుంచి హాస్టళ్లు, సాఫ్ట్‌వేర్ కోర్సుల మెటీరియల్ విక్రయించేవారు, ట్రావెల్ ఏజెన్సీలలో ఎంతోమంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. శిక్షణ సంస్థలు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన పనుల ద్వారా ఎందరో ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వెలిసిన ట్రావెల్ ఏజెన్సీలు అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి.

20 ఏళ్ల క్రితం 4 కంపెనీలు…ఇప్పుడు 400 శిక్షణ సంస్థలు

అమీర్‌పేట్‌లో 20 ఏళ్ల క్రితమే సాఫ్ట్‌వేర్‌కు బీజం పడింది. ఇక్కడ సాఫ్ట్‌వేర్ టెక్నాలజి పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్‌టిపిఐ) కార్యాలయం ఉండటంతో 199798 సంవత్సరంలో మొదట నాలుగు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వెలిశాయి. బడా సాఫ్ట్‌వేర్ కంపెనీలు సైతం మొదట అమీర్‌పేటలోనే ప్రారంభమయ్యాయి. ఎస్‌టిపిఐ కార్యాలయానికి సమీపంలో కంపెనీలు ప్రారంభిస్తే అనుమతులు, ఇతర కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని భావించి ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా కంపెనీలు పెరిగాయి. అనంతరం సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైటెక్ సిటీ బదిలీ కాగా, ఇక్కడ కోచింగ్ సెంటర్లు స్థాపించడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అమీర్‌పేట్ మైత్రీవనం, హుడా కాంప్లెక్స్‌లలో సాఫ్ట్‌వేర్ కోర్సులకు శిక్షణ సంస్థలు సుమారు 400 వరకు ఉన్నాయి. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ కోర్సులతో పాటు బ్యాంకింగ్ ఉద్యోగాలకు శిక్షణ అందించే సుమారు 20 సంస్థలు కూడా ఇక్కడ వెలిశాయి.

రాలేని వారికి ఆన్‌లైన్ కోర్సులు

దూరప్రాంతాల నుంచి అమీర్‌పేట్‌కు రాలేని విద్యార్థులు, ఉద్యోగాలలో బిజీగా ఉంటూ స్వయంగా వచ్చి శిక్షణ తీసుకునే అవకాశం లేని వారి కోసం ఇక్కడి శిక్షణ సంస్థలు ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నాయి. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా అన్ని రకాల కోర్సులకు శిక్షణ ఇస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో పాటు విదేశాలకు చెందిన విద్యార్థులు సైతం ఇక్కడి శిక్షణ సంస్థల ద్వారా ఆన్‌లైన్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు.

తక్కువ ఫీజుతో సాఫ్ట్‌వేర్ కోర్సులు

దేశంలో ఢిల్లీ, బంగళూరు వంటి ప్రముఖ నగరాలలో అందించే ఐటి కోర్సులకు ఫీజులు అధికంగా ఉంటాయి. కానీ అమీర్‌పేట్‌లో అందించే కోర్సులకు ఫీజులు చాలా తక్కువ. వివిధ రకాల కోర్సులు రూ.500 ఫీజుతో ప్రారంభమై, గరిష్టంగా రూ.15వేల ఫీజుతో ఇక్కడి శిక్షణ సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, కలకత్తా వంటి నగరాలతో పాటు దక్షిణ ఆఫ్రికా, దుబాయి, అబుదబి వంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. అమీర్ పేట్‌లో అందించే కోర్సుల కాలవ్యవధి కూడా చాలా తక్కువగా ఉంటోంది. నెల రోజుల నుంచి 45 రోజుల వరకు వివిధ కోర్సులకు శిక్షణ అందిస్తున్నారు. ఇక్కడికి శిక్షణ కోసం వచ్చే విద్యార్ధులకు కోర్సు ఫీజు కంటే ఉండటానికి, తినడానికే ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి సమయం వృథా చేయకుండా వీలైనంత త్వరగా కోర్సు పూర్తి చేసుకుని వెళ్లడానికే ఆసక్తి కనబరుస్తుంటారు.

మార్కెట్‌లో ఎక్కడా లేని కోర్సులు
ఇక్కడ లభిస్తాయి

సాఫ్ట్‌వేర్ రంగంలో మార్కెట్‌లో ఎక్కడా లభించని కోర్సులకు అమీర్‌పేట్‌లో లభిస్తాయి. ఇక్కడ ఫీజులు కూడా తక్కువ ఉండటంతో దేశవిదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి ఇస్తున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న కొత్త కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అవసరమైన కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి. ఇంజనీరింగ్‌తోపాటు ఇతర కోర్సులు చదివిన విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఐటి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు అవకాశం ఉండటంతో ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అమీర్‌పేటలో శిక్షణ పొందితే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకం విద్యార్థుల్లో కనిపిస్తుంటుంది.

ఎన్.కోటేశ్వరరావు
పీర్ టెక్నాలజీస్ ఆపరేషన్స్ మేనేజర్

ఎం. భుజగేందర్
ఫొటోలు : బాష

కోర్సు వ్యవధి ఫీజు(సుమారు)
ఎడబ్లూఎస్ 30 రోజులు రూ. 5000
క్లౌడ్ 30 రోజులు రూ. 7000
సైబర్ సెక్యురిటీ 75 రోజులు రూ. 15,000
జావా 30 రోజులు రూ. 5000
సి++ 30 రోజులు రూ. 1000
మొబైల్ టెక్నాలజి
(ఐఓఎస్) 30 రోజులు రూ. 6000
మొబైల్ టెక్నాలజి
(అండ్రాయిడ్) 30 రోజులు రూ. 2500.