Home ఆఫ్ బీట్ ప్రాంతీయ భాషలదే భవిష్యత్తు

ప్రాంతీయ భాషలదే భవిష్యత్తు

intnet

  ఇంటర్నెట్ వినియోగంలో వెనకబడిన ఆంగ్లం
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం గడచిన ఐదేళ్లలో గణనీయంగా పెరిగింది. ఇటీవలి కాలంలో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, డిజిటల్ అక్షరాస్యత పెరగడమే ఇందుకు కారణం. దీనికి తోడు మొబైల్ ఫోన్‌లోనే ఇంటర్నెట్‌ను వినియోగించేవారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. వివిధ ప్రైవేటు మొబైల్ ఆపరేటర్ల మధ్య ఏర్పడే పోటీ కారణంగా తక్కువ ధరకే అపరిమితమైన డాటాను వినియోగించుకునే అవకాశం ఇందుకు కారణం. స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు సరసమైన ధరలు అందుబాటులోకి రావడంతో ప్రాంతీయ భాషల్లో వినియోగించేవారు ఎక్కువగా ఛాటింగ్‌కు, వినోదానికి ఈ ఫోన్లను వాడుతున్నారు. గూగుల్, కెపిఎంజి గతేడాది నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో ఆంగ్లం కంటే ప్రాంతీయ భాషల్లో వినియోగిస్తున్నవారే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. గతేడాది చివరినాటికి దేశం మొత్తంమీద 40.9 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతూ ఉండగా ఇందులో 23.40 కోట్ల మంది వివిధ ప్రాంతీయ భాషల్లో వాడుతున్నారు. కేవలం 17.50 కోట్ల మంది మాత్రమే ఆంగ్లంలో వాడుతున్నారు. 2011 నాటికి దేశం మొత్తంమీద 11 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్‌ను వినియోగించగా అందులో ఆరున్నర కోట్ల మంది ఇంగ్లీషులో వాడేవారని, మిగిలిన నాలుగున్నర కోట్ల మంది ప్రాంతీయ భాషల్లో వాడేవారని తేలింది. 2021 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగించేవారి సంఖ్య 53.60 కోట్లకు పెరుగుతుందని, ఇలా పెరుగుతున్నవారిలో కేవలం 2.40 కోట్ల మంది మాత్రమే ఆంగ్లంలో ఉంటారని, మిగిలినవారంతా ప్రాంతీయ భాషల్లోనే అని ఈ సర్వే అంచనా వేసింది. ప్రాంతీయ భాషల్లో ఇంటర్నెట్‌ను వినియోగించేవారు దాదాపు 30 కోట్ల మంది వాడకాన్ని సామాజిక మాధ్యమానికే వెచ్చించే అవకాశం ఉందని అంచనా వేసింది. భవిష్యత్తులో కొత్తగా చేరే ఇంటర్నెట్ వినియోగదారుల అవకాశాలను విశ్లేషిస్తే 2021 నాటికి ప్రతి పది మందిలో తొమ్మిది మంది ప్రాంతీయ భాషల్లోనే వాడవచ్చని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సాంద్రత మొత్తం జనాభాలో 52%కి పెరగవచ్చని అంచనా. 2021 నాటికి కొత్తగా చేరే ఇంటర్నెట్ వినియోగదారుల్లో 17.60 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లను వాడేవారే ఉంటారని తేల్చింది. దేశం మొత్తంమీద ఇంటర్నెట్‌ను 78% మంది మొబైల్ ద్వారానే వాడుతుండగా, ప్రాంతీయ భాషల్లో ఇంటర్నెట్‌ను వాడేవారిలో 99% మంది స్మార్ట్‌ఫోన్లనే ప్రస్తుతం వినియోగిస్తున్నారని ఆ సర్వే గణాంకాలు తేల్చాయి. హెచ్చుశాతం మంది గూగుల్ క్రోమ్‌నే ఇంటర్నెట్ బ్రౌజర్‌గా వాడుతున్నట్లు తేలింది. ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నవారిలో ఎక్కువగా వివిధ ఆన్‌లైన్ వెబ్‌సైట్ల ద్వారా ఎలక్ట్రానిక్ ఉపకరణాల గురించి తెలుసుకోవడం, కొనుగోలు చేయడం తదితరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆ తర్వాత ఫ్యాషన్ డిజైన్, లైఫ్‌స్టైల్ తదితరాలకు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. దేశంలోని గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల్లో ఎక్కువగా హిందీని వినియోగించేవారు ఉన్నారని, ఆ తర్వాత బెంగాలీ, మరాఠీ, తమిళం ఉన్నాయని, ఐదవ స్థానంలో తెలుగు ఉందని తెలిసింది. మొబైల్ ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నవారిలో గ్రామీణ ప్రాంతాల్లో సగటున వారానికి 530 నిమిషాలు, పట్టణ ప్రాంతాల్లో 487 నిమిషాలు ప్రాంతీయ భాషల్లో వినియోగిస్తున్నట్లు తేలింది. ఇంటర్నెట్‌లో ఆంగ్ల భాషకు అన్ని రకాల సమాచారం తెలుసుకోవడానికి కీలక ప్లాట్‌ఫారంగా ఉంటున్నప్పటికీ ఇటీవలి కాలంలో హిందీ, తమిళం, గుజరాతి, బెంగాలీ, తెలుగు భాషలు కూడా వీలైనంత ఎక్కువ అందుబాటులో ఉండేలా అభివృద్ధి జరుగుతోందని ఈ సర్వే అభిప్రాయపడింది. ప్రాంతీయ భాషను వినియోగించేటప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఆన్‌లైన్ కామర్స్ సంస్థల్లో పెద్దగా సాంకేతిక ఇబ్బందులు లేకపోవడం కూడా ఒక కారణమని తేలింది. ప్రస్తుతం షాపింగ్, లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, వినోదం తదితరాల తర్వాత ఎక్కువగా డిజిటల్ చెల్లింపులు, వార్తలకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో డిజిటల్ చెల్లింపులు చేసేవారు ప్రస్తుతం 4.7 కోట్ల మంది ఉంటే రానున్న మూడేళ్లలో ఇది 17.50 కోట్లకు చేరే అవకాశం ఉందని సర్వే అభిప్రాయపడింది. తెలుగులో వార్తలు చూసేవారు ప్రస్తుతానికి ఆరు మిలియన్ల మంది మాత్రమే ఉండగా 2021 నాటికి ఇది 17 మిలియన్లకు చేరుతుందని పేర్కొనింది. దేశంలో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో దాదాపు 75% మంది ప్రాంతీయ భాషల్లో వాడేవారే ఉంటారని అంచనా.