Home ఎడిటోరియల్ ఇంగ్లీష్ ఛానళ్లు ఎందుకిట్లా ఉన్నాయి?

ఇంగ్లీష్ ఛానళ్లు ఎందుకిట్లా ఉన్నాయి?

Breaking-Newsజెఎన్‌యు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీల ఘటనలపై ఇంగ్లీష్ ఛానళ్ల తీరును చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు గాని, వాస్తవానికి ఈ తీరు కొత్తది కాదని వాటిని తరచు చూసేవారికి తెలుసు. వాస్తవాలతో సంబంధం లేకపోవటం, సమాజం అంటే పట్టకపోవటం, నగరాలను దాటి గ్రామాలపై దృష్టిపెట్టకపోవటం, ధనికవర్గాలు మధ్య తరగతిలోని శిష్టవర్గం మినహా తక్కినవారు మనుషు లుగా కన్పించకపోవటం, ముఖ్యంగా పేద లూ తమ సమస్యల గురించి మాట్లాడటం దేశాభి వృద్ధికి అవరోధమనే భావన, తెలంగాణ వంటి పీడిత ప్రాంతాల ఉద్యమాలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేవిగా కన్పించటం ఇంగ్లీష్ ఛానళ్లకు ఎప్పటినుంచో సర్వసాధారణమై పోయింది. మరొకవైపు ధనిక వర్గాలు, వర్తక, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, అమెరికన్ కూటమి వంటివారి ప్రయోజనాలే ఆ ఛానళ్లకు శిరోధార్యమవుతున్నాయి. ఈ ధోరణికి ఆరంభం ఆర్థిక సంస్కరణల ప్రవేశం తర్వాత వెంటనే కాదు గాని కొద్ది సంవత్సరాలవెనుక జరిగి గత పదిహేను సంవత్సరాలుగా విజృంభించింది. అయితే ఇందుకు కారణం పూర్తిగా ఛానళ్ళ యాజమాన్యాలే కాదు. స్వయంగా జర్నలిస్టులలోని ముఖ్యస్థానాల వారు, చుట్టూ మోహరించి ఉన్న ఆర్థిక శక్తులు కూడా ఇందుకు కారణమవుతున్నాయి.

అదే ధోరణి నిన్న మనకు తెలంగాణ ఉద్యమ సమయంలో కన్పించింది. ఇపుడు రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల విషయంలో కనిపిస్తున్నది. ఇవే కాదు, ఇటువంటి ఇంకా అనేక ఉదాహరణలను స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలనుంచి పేర్కొనవచ్చు. ఛానళ్ల తీరును ఒక ధోరణి అంటున్నది అందుకే. తాజా ఉదంతమైన జెఎన్‌యు ను గమనించండి. అక్కడ వినవచ్చిన వివాదా స్పదమైన నినాదా లు తప్పక ఖండించదగ్గవే. ఇతర అనేకానేక విషయాలు ఎవరి భావనల ప్రకారం వారు చర్చించ వచ్చునని, ఆ చర్చలు భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఉదారవాదం, సృజనశీలత వగైరాల పరిధిలోకి వస్తావని భావించినప్పటికీ ఆ నినాదాలు మాత్రం తప్పకుండా అభ్యంతరకరమైనవే. వాటిని భావ ప్రకటనా స్వేచ్ఛావాదులు కూడా సమర్థిం చటం లేదు. ఉదార వాదులూ ఖండిస్తున్నారు. కాని ఈ కోణాన్ని విస్మరించి కేవలం నినాదాలను అనువుగా తీసుకుని మొత్తంగానే స్వంత అజెండాను ముందుకు తీసుకు పోవాలని ప్రయత్నిస్తున్న సంఘ్‌పరివార్ వ్యూహం అర్థమవుతూనే ఉంది. అయితే ఇక్కడ చర్చిస్తున్నది ఆ విషయం కాదు. ఇంగ్లీష్ ఛానళ్లు సైతం అదే ధోరణితో ప్రసారాలను వక్రీకరించటం, వాస్తవాలను విస్మరించటం అన్నదే అభ్యంతరకరమవుతున్నది. జర్నలిజాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటున్నపుడు ఆ విలువలను సర్వకాల సర్వావస్థల లో పాటించాలి. గీతకు అటు-ఇటు ఉన్న రెండు వర్గాలకూ వర్తింప చేయాలి. కానపుడు అది జర్నలిజం కాదు, ఆ మనుషులు జర్నలిస్టులు కారు.

ఉదాహరణకు వేర్వేరు వీడియోలను కలిపి డాక్టరింగ్ చేయటం, వాటిని ప్రసారం చేయటం, నకిలీ ట్విట్టర్ అకౌంట్లను నిజమైనవిగా ప్రచారం చేయటం, ఛానల్ చర్చల సమయంలో మనకు నచ్చనివారిపై విరుచుకుపడటం, ఉద్దేశపూర్వకంగా కొన్ని భావాలకు అడ్వకసీ వహిస్తున్నామనే అభిప్రాయం వీక్షకులకు కలిగించటం, నచ్చని వాస్తవాలను ఉపేక్షించటం లేదా కత్తిరించటం వంటివి జెఎన్‌యు ఘటనల సందర్భంగా ఇంగ్లీష్ ఛానళ్లలో కనిపించిన విషయాలు. ఇది కన్హయ్య కుమార్ లేదా ఉమర్ ఖాలిద్ వంటి భావజాలాలు ఉన్నవారి విషయంలోనే కాదు. అందుకు పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు గలవారి విషయంలో కూడా జరగకూడదు. వాటిపై వ్యాఖ్యలు చేసేటపుడు ఎవరు దృక్పథం ప్రకారం వారు ఏమైనా మాట్లాడవచ్చు కాని వార్తలను, వాస్తవాలను చూపటంలో, వ్యాఖ్యా నించేందుకు అందరికి సమానావకాశాలు కల్పించ టంలో, ఏదో ఒక పక్షం వహించకుండా ఉండటంలో మాత్రం వృత్తి విలువలు చూపాలి. ఇంగ్లీష్ ఛానళ్లు అట్లా చేయకపోవటం జెఎన్‌యు, హైదరాబాద్ యూనివర్శిటీలు రెండింటి విషయంలోనూ కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది.

ఇందుకు సంబంధించి యాజమాన్యాలు నిందలకు గురవుతున్నాయి గాని, నిజానికి జర్నలిస్టు ల పాత్ర అందుకు తీసిపోవటం లేదు. ఈ కోణం చర్చకు రావటం లేదు కూడా. వీరి పాత్ర ఎందుకిట్లా రూపుతీసుకున్నదో కూడా తెలుసుకోవలసిఉంది. దేశంలో ఛానల్ టివి జర్నలిజం ఆరంభమైన కొత్తలో ఎడిటర్లు మొదలుకొని సీనియర్లంతా ప్రింట్‌మీడియా నేపథ్యంనుంచి వచ్చినవారు. ప్రింట్ మీడియాలోనూ విలువలు మారటం అప్పటికే కొద్దిగా మొదలైనా ఇంకా గణనీయంగా ఉండేవి. కిందిస్థానాలలో కొత్తగా రంగంలోకి వచ్చేవారు గాని, లేదా ప్రింట్ మీడియానుంచి ఇటువచ్చిన జూనియర్లుగాని సీనియర్ల మార్గనిర్దేశకత్వంలో పనిచేసేవారు. ఆ తొలిదశలో ఆర్థిక శక్తులు, యాజమాన్య ప్రయోజ నాలు, రాజకీయ శక్తుల ప్రయోజనాలు ఛానల్ జర్నలిజం వ్యవస్థను ప్రభావితం చేయటం ఇంకా పరిమితంగానే ఉండేది. కాని, ఎలక్ట్రానిక్ మీడియా దృశ్య – శ్రవణ మాధ్యం అయినందున స్వరూప స్వభావాలు, వాటితోపాటు విలువలు వేగంగా మారుతూ పోయాయి. దాని శక్తిని గుర్తించిన వివిధ ప్రయోజనాలవారు ఛానళ్లను నియంత్రించేందుకు వేగంగా ప్రయత్నించారు. ఈ పరిణామాల ప్రభావాలు ఛానల్ జర్నలిజం వ్యవస్థపై పడ్డాయి.

సీనియర్లు వయసుపైబడో, వారి తీరు యాజమాన్యాలకు ఈ కొత్త పరిస్థితులలో నచ్చకనో తెరమరుగయారు. వారి స్థానాలలోకి వచ్చే ద్వితీయ శ్రేణి జర్నలిస్టులకు, లేదా పూర్తిగా కొత్తగా రంగంలోకి వచ్చి ఒకేసారి సీనియర్ స్థానాలు ఆక్రమించిన వారికి పాత విలువలతో పనిలేక పోయింది. యాజమాన్యాలు, ఆర్థిక-రాజకీయ శక్తుల ప్రయోజనాలే వారి వ్యక్తిగత ప్రయోజనాలు కూడా అయ్యాయి. ఈ ప్రయోజనాలన్నీ కలిసి ఒక తత్తంగా మారి వారికది బాగా వంటబట్టింది . అంతకు ముందుతరాల జర్నలిస్టుల సామాజిక, ఆర్థిక, కుటుంబ నేపథ్యాలు, చదువులూ, పెరిగిన తీరు, సంస్కృతీ ఆలోచనా ధోరణులు సాధారణ సమాజానికి దగ్గరగ ఉండేవి. ఆ విలువలకు, జర్నలిజం విలువలకు ఒక సహజమైన సారూప్యత, సామీప్యత ఉండేవి. కాని ఈ కొత్తతరం చాలావరకు భిన్నమైనది. పైన పేర్కొన్న అన్ని అంశాలలోనూ భిన్నమైంది. అందువల్ల వారికి స్వీయ ప్రయోజనాల స్పృహ, అందుకు ఉపయోగపడే ఇతర వర్గాల ప్రయోజ నాలతో ఏకీభావం ఏర్పడింది. అటువంటి స్థితిలో వారి విలువలకు, జర్నలిజం విలువలకు సహజంగానే భిన్నత్వం రూపుతీసుకుంది. భిన్నత్వా లు కనీసం కొన్ని సందర్భాలలో వైరుధ్యాలు గా వికటిస్తున్నాయి. అటువంటివారు ఏ విధమైన జర్నలిజం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మనమిపుడు చూస్తున్నది అదే.

పైన అన్నట్లు ఇది కొంతకాలంగా ఉన్నదే. ఆ స్థితి గురించి జర్నలిజం విలువలు అనే దృక్కోణం నుంచి ఆలోచించేవారు ఎప్పటినుంచో తరచు వ్యాఖ్యానించి బాధపడుతూనే ఉన్నారు. అవే పరిస్థితులు జెఎన్‌యు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వంటి క్లిష్టమైన ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. దీని అర్థం ఇంగ్లీష్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులలో నూటికి నూరు శాతం మంది ఇదే విధంగా ఉన్నారని కాదు. వృత్తి విలువలపరమైన స్పృహగల వారు కూడా తగినంత మంది కన్పి స్తారు. తమ సంస్థలలో ఏమి జరుగుతున్నదో తమకు బాగా తెలుసు. కాని నిస్సహాయులు, పరిస్థితిని మార్చటం వారికి వీలయ్యేది కాదు. ఉద్యోగాలు అవసరం గనుక బయటకు రాలేరు. అరుదుగా తప్ప మొత్తం మీద ఈ విధంగా స్వరూప స్వభావాలను మార్చుకున్న ఇంగ్లీష్ ఎలక్ట్రానిక్ మీడియా మరింత కట్టుదిట్టంగా మారేందుకు పారిశ్రామిక సంస్థలు, విదేశీ గ్రూపులు వాటిలో పెట్టుబడులు పెట్టటం కొన్ని సంవత్సరాల క్రితమే మొదలైంది. ఇటువంటి పరిణామాలు రాగల కాలంలో మరింత బలపడటం తప్ప వెనుదిరిగే అవకాశాలు కల్పించటం లేదు. అనగా, వృత్తి విలువలకు చోటు లేని ఇంగ్లీష్ ఛానళ్లు మన బౌద్ధికరంగంలో, సాంస్కృతిక పరిధిలో భాగమై పోయాయన్నమాట. వాటిని ఎంత భరించటం, ఎంత ఉపేక్షించటమన్నది ఎవరికి వారుగా, వ్యక్తిగతంగా చేయగలపని.
– 9848191767