Home తాజా వార్తలు జంతువుల్లో మానవ అవయవాల పెంపు

జంతువుల్లో మానవ అవయవాల పెంపు

Japanese scientist

 

అద్భుత ప్రయోగానికి జపాన్ శాస్త్రవేత్త శ్రీకారం

టోక్యో: జపాన్ శాస్త్రవేత్తలు జంతువుల్లో మానవ అవయవాలను పెంపొందింప చేయడానికి నడుం కట్టుకున్నారు. ఈ మేరకు ప్రయోగాలు చేయడానికి అక్కడి ప్రభుత్వ అనుమతిని కూడా పొందుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ వివాదాస్పద ప్రయోగానికి శ్రీకారం చుడతారు. ఆధునిక శాస్త్ర ప్రక్రియల ద్వారా మార్చిన జంతు గర్భస్థ పిండాలను మానవుని ప్రేరేపిత మూలకణాల (ఇండ్యూస్‌డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్)తో అంటే శరీరం లోని ఏ కణాలనయినా మూల కణాలుగా మార్చి వాటిని జంతు గర్భస్థ పించాల్లోకి పంపిస్తారు. అవి శరీరం లోని ఏ అవయవంగా నైనా మారడానికి సిద్ధం అవుతాయి. మానవ అవయవాలు జంతువుల్లో రూపొందే భావి సుదీర్భ అద్భుత ప్రక్రియకు ఇది మొదటి మెట్టుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.

స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన జెనెటిక్ ప్రొఫెసర్ హిరోమిత్సునక చౌకి ఈ ప్రయోగానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. మానవ కణాలను జంతువుల్లోకి పంపించే ప్రయోగాలపై ప్రభుత్వం తన నిబంధనలను సడలించిన తరువాత ఈ ప్రయోగానికి ప్రభుత్వం నుంచి అనుమతిని కోరిన మొదటి శాస్త్రవేత్త ఆయనే అవుతారు. ఇదివరకు మానవ మూల కణాలను జంతువుల గర్భస్థ పిండాల్లోకి పంపిన ప్రక్రియలో 14 రోజుల తరువాత ఆ కణాలను జంతువుల్లోంచి తొలగించి వేయాలని జపాన్ ప్రభుత్వం శాస్త్రవేత్తలను కోరేది. జంతు పిండాలను ఈ ప్రక్రియ నుంచి కాపాడాలని అభ్యర్థించేది. కానీ మార్చిలో ఈ ఆంక్షలు రద్దయ్యాయి. ఇటువంటి పరిశోధనలకు వ్యక్తిగతంగా పరిశోధకులు అనుమతి పొందవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

ఈ అద్భుత ప్రయోగం నిర్వహించడానికి పదేళ్లు పడతాయి. అయినా తాము ఈ ప్రయోగాన్ని ప్రారంభిస్తాం అని నకౌచి స్పష్టం చేశారు. పాంక్రియాస్ వంటి ముఖ్యమైన అవయవ భాగాలు లోపించిన జంతువుల ముఖ్యంగా మూషికాలు, ఎలుకలు, లేదా పందుల్లో గర్భస్థ పిండాల్లో మానవ అవయవ భాగాలను ఉత్పత్తి చేస్తారు. అత్యంత శాస్త్రీయ ఆధునిక ప్రక్రియ ద్వారా గర్భస్థ పిండాల్లోకి మానవ ప్రేరేపిత ప్లూరిపోటెంట్ మూలకణాలను (ఐపిఎస్) పంపిస్తారు. ఆ కణాలు లోపించిన పాంక్రియాస్ గా తయారవుతాయి. పనిచేసే మానవ క్లోమాలుగా గర్భస్థ పిండాలు మార్పు చెందుతాయి.

ఆ తరువాత ఆ క్లోమాలను ఎలుక లోకి మార్చుతారు. డయాబెటిక్ ఎలుకలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించ గలుగుతాయి. మూసికాల మూత్రపిండాలను ఎలుకల్లోకి మార్పిడి చేసే ప్రయోగాలు కూడా పరిశోధకులు చేసినా మూసికాల మూలకణాలను ఎలుక కణాలు స్వీకరించ లేక అవి విఫలమయ్యాయి. ఇప్పుడు చేపట్టిన ఈ ప్రయోగం వల్ల అడ్డంకులను తొలగించడానికి వీలవుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

                                                                                                              – (సైన్ విభాగం)

Enhancement of human organ regeneration in animal