Home హైదరాబాద్ శ్రీవర్షకు న్యాయం జరిగేనా!

శ్రీవర్షకు న్యాయం జరిగేనా!

  కార్పొరేట్ కళాశాలకు కొమ్ము కాస్తున్న పోలీసులు? 

SRI

మన తెలంగాణ/అమీర్‌పేట : పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వారు ఉన్నత స్థానాలకు చేరాలనే ఆశతో కష్టమైనా కూడా వేలాది రూపాయల డొనేషన్‌లు కట్టి తమ కన్నబిడ్డలను కార్పొరేట్ కళాశాలల్లో చదివిస్తారు కొందరు తల్లిదండ్రులు. కాని చాలా మంది తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అవుతాయి. వారి కన్నబిడ్డలు కాటికి చేరాయనే వార్తలు వాళ్ళకు కంటతడి పెట్టిస్తాయి. గుండెను బాధిస్తున్నా తమకు న్యాయం జరగదని తెలిసినా ఆ హృదయాలు మృగ్యమైపోతాయి. కార్పొరేట్ కళాశాల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య అనే వార్త వినపడగానే సంబంధిత విద్యార్థి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతారు. తమకేమైనా న్యాయం జరుగుతుందేమోనని పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తారు. కాని పోలీసు స్టేషన్‌లో కూడా వారికి న్యాయం లభించదు. కాంప్రమైజ్ అవ్వండి, కేసులు వెనక్కి తీసుకోండి కళాశాల వారు మీకు అండగా నిలుస్తారు అంటూ సలహాలు వినిపిస్తాయి. కాదు అంటే ఆ తల్లిదండ్రులు, ఆ బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచే వారే ఉండరు. ఒకవేళ విద్యార్థి సంఘాలు న్యాయం చేయాలని చూసినా స్థానిక పోలీసుల సహకారంతో వారిని కార్పొరేట్ కళాశాలలు అణచివేస్తాయి. బ్రాండ్ ఇమేజ్ పేరుతో మార్కుల దందా సాగించడానికి నిత్యం విద్యార్థుల పైన ఒత్తిడి తెస్తూ, ఇష్టారీతిన వారిని హింసిస్తూ పీల్చిపిప్పి చేసే ఈ కళాశాల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోందనడానికి ఇంటర్ విద్యార్థిని శ్రీవర్ష ఆత్మహత్యే ఒక నిదర్శనం. ఎస్‌ఆర్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాల మదర్ థెరిస్సా క్యాంపస్‌లో ఇంటర్ ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదివే శ్రీవర్ష కళాశాల ప్రిన్సిపల్, ఫిజిక్స్ లెక్చరర్ వేధింపులు భరించలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులకు అండగా నిలబడదామని వచ్చిన విద్యార్థి సంఘ నాయకుల పై కార్పొరేట్ కళాశాల సూచనల మేరకు పోలీసులు తమ ప్రతాపం చూపించారు. శ్రీ వర్ష తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసిన దాఖలాలు లేవు. కనీసం కళాశాలకు వెళ్ళి విచారణ చేపట్టిన సంఘటనలు కూడా శూన్యమే. కాని అదే పోలీసులు కార్పొరేట్ కళాశాలల వద్ద పహారా కాస్తూ వారికి రక్షణ కల్పించడాన్ని చూసి మానవతావాదులు, సాటి పౌరుడు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ కళాశాలకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇంతే. అసలు శ్రీవర్షకు తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా..? శ్రీవర్ష ఆత్మఘోష శాంతిస్తుందా? అనే ప్రశ్నలు పలువురు సమాజ సేవకులను, విషయం తెలిసిన వారిని కలచివేస్తోంది.
అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ …
కార్పొరేట్ కళాశాలల్లో ఏమి జరిగిన తమకు కనిపించదు.. వినిపించదు.. తామేమి మాట్లాడలేం అన్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ వ్యవహరించడం విద్యావేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సంఘటన జరిగి ౩ రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఏ ఒక్క విద్యాశాఖ అధికారి నారాయణ కళాశాలలో తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు. కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా వారు వచ్చినట్లు కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అసలు విద్యాశాఖ అనే వ్యవస్థ ఉందా అని పలువురు విద్యా రంగ నిపుణులు ప్రశ్నించడం విద్యాశాఖ పనితీరును తెలుపుతోంది. విద్యార్థుల శ్రేయస్సు, వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం అని చెప్పుకునే రాష్ట్ర నాయకులు కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు చనిపోయినప్పుడు మాత్రం మీనమేషాలు లెక్కించడం రాష్ట్ర ప్రజలను వేదనకు గురి చేస్తుందని పలువురు సంఘసంస్కర్తలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రీవర్షకు న్యాయం జరిగేలా చూడాలని, నారాయణ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎటువంటి తనిఖీలు చేయకుండానే ఇలాంటి కళాశాలలకు విద్యాశాఖ అనుమతులు ఇవ్వడం పట్ల విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా కార్పొరేట్ కళాశాలలు ఎందరు విద్యార్థులను పొట్టనబెట్టుకున్నా ప్రభుత్వం నిద్రమత్తును వీడదా అని పలు విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి. విద్యాశాఖ నిర్లక్షానికి ఇంకెందరు విద్యార్థులు బలికావాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానరాని పౌర సంఘాలు…
మహిళా హక్కులు, మానవ, బాలల హక్కులు అంటూ పోరాటాలు చేస్తున్నామని చెప్పుకునే ఏ ఒక్క సామాజిక కార్యకర్తకు కార్పొరేట్ కళాశాలల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు కానరారా అని ఒక సగటు పౌరుడు నేడు ప్రశ్నిస్తున్నాడు. బాలల హక్కులు, మానవ హక్కుల కమిషన్‌లు ఉన్నా అవి నిరుపయోగమేనా, కార్పొరేట్ కళాశాలలంటే ఏదైనా చేయగలిగే బలం, బలగం కలిగిన వ్యవస్థలనే సందేశం ప్రజలకు ఇస్తున్నారా అని సమాజం నేడు చట్టపరమైన వ్యవస్థలను ప్రశ్నిస్తోంది. నగర నడి మధ్యలో జరిగిన ఇంత పెద్ద ఘటన మానవ హక్కుల సంఘాల వారికి కనిపించలేదా…? లేదా కావాలనే నిదుర నటిస్తున్నారా అనే విషయం సాధారణ మానవుడికి బోధపడడం లేదనేది వాస్తవం. ఇప్పటికైనా వారంతా శ్రీవర్షకు న్యాయం చేయడానికి ముందుకు వస్తారా..? ఆ బిడ్డ తల్లిదండ్రులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతారా? లేదా అందరి కథలానే శ్రీవర్ష కథ కూడా కాసేపట్టి కంటి తుడుపు లాగే మారుతుందా అనేది సాధారణ పౌరుడి హృదయాన్ని తొలుస్తున్న విషయం.