Home ఎడిటోరియల్ సమకాలీనత గుబాళించిన తెలంగాణ సాంఘిక నాటకం

సమకాలీనత గుబాళించిన తెలంగాణ సాంఘిక నాటకం

Stage

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు ఆలంకారి కులు. నాటకం వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుం ది. సామాజిక స్పృహను కలుగజేస్తుంది. జనులను చైతన్యవంతం చేస్తుంది. తెలంగాణ లో వచ్చిన అనేక ఉద్యమాలపై నాటకం ప్రభావం ఎంతో ఉంది. ఆనాటి ప్రాచీన సాహిత్యం నుంచి నేటి ఆధునిక కాలం వరకు ఎన్నో నాటకాలు తెలంగా ణాలో ఆవిర్భవించాయి. మొదట పౌరాణిక, చారిత్రక నాటకాలు వచ్చాయి. అనంతరం ఉద్యమ స్వభావంతో కూడిన నాటకాలు వచ్చా యి. తర్వాత సాంఘిక నాటకాలు వచ్చాయి. సామాజిక, రాజకీయ, జాతీయ, సాహిత్య, సాంస్కృతికోద్యమాల్లో క్రియాశీలమైన పాత్రను పోషించిన తెలంగాణ నాటక సాహిత్యం విశేషమైన కృషి సల్పింది. నాటకం దృశ్య కావ్యం ప్రదర్శన యోగ్యమైనది. అన్ని రసాలను పలికించగల ఏకైక సాహిత్య ప్రక్రియ నాటకం. తెలంగాణలో నాటక రచన సంస్థానాల కాలం నుంచి పురుడుపోసుకున్నది. పండిత పామరజనకంగా అందరికీ అందుబాటులో ఉండి ప్రదర్శించే కళ నాటకం.

నాటకం పురాణాలనుంచి సామాజికం వైపు నడిచి అనేక రూపాల్లో అభివ్యక్తమైంది. నాటిక, రూపకం, భువనవిజయం వంటి రూపాల్లో నాటకం రంజింపజేసింది. దశ రూపకాల్లో నాటకం సర్వ సమగ్రమైన కళారూపం. నాటకం ప్రారంభం నుంచి నేటి వరకూ అనేక మార్పులకు లోనై సమగ్రతను పొంది తన స్థానాన్ని భద్రపరచుకుంది.

తెలంగాణలో సమకాలీన సమస్యలను పట్టి చూపించే సాంఘిక నాటకాలు అనేకం వచ్చాయి. జనజీవన పరిస్థితుల ను, సమస్యలను తెలుపుతూ రాయబడ్డ నాటకాలు తెలంగా ణాలో విరివిగా వచ్చాయి. శేషాద్రి రమణ కవులు ‘విచిత్ర వివాహం, సుశీల, చంద్రరేఖ’ వంటి సామాజిక నాటకాలను రచించారు. సందేశాత్మక రచనగా ‘విచిత్ర వివాహం’ ఈ నాటకం రచించబడింది. ‘చంద్రరేఖ’ నాటకంలో అస్పృ శ్యత, నిరుద్యోగం, బాలవితంతువు, రైతుల శ్రమ వంటివి పేర్కొనబడ్డాయి. తెలంగాణా నాటకరంగంలో తొలి ప్రయోగాత్మక నాటకమైన ‘భిషగ్విజయం’ను డాక్టర్ చొల్ల్లేటి నృసింహ్మ రామశర్మ రచించాడు. ఈ నాటకం ఆయుర్వేద వేద్య విజ్ఞానానికి సంబంధించినది. డా॥పి.వి.రమణ ‘ఆకురాలిన వసంతం’, దేవతలెత్తిన పడగ’, చలిచీమ, ప్రేమ పోరాటం, ధర్మదేవత, ‘గురువుగారూ మన్నించండి, మానవతకు నిండాయి నూరేళ్ళు’ వంటి నాటకాలను రచించాడు. ఇవన్నీ బహుళ ప్రాచుర్యం పొందాయి. ఒద్దిరాజు సీతారామాచంద్రరావు ‘మైత్రి పరిణితి, ఎరువు సొమ్ము, మేనరికం, మేనత్త, ఆడపెత్తనం, మగసంసారం’ మొదలైన సాంఘిక నాటకాలను రచించాడు. ఇంకా వానమామలై వరదాచార్యులు ‘రాజ్యశ్రీ’, దాశరాథి ‘వాసనలేని పూలు’, పాములపర్తి సదాశివరావు ‘ఆత్మ గౌరవం, కర్తవ్యం, గోవా పోరాటం’ వంటివి రచించాడు.

ఆవాల దామోదర్ రెడ్డి ‘పేద గుండెలు’, డాక్టర్ వనం మధుసూదన్ ‘అమ్మాయ్యో గాంధీ బతికాడు, ఋణం తీరిపోయింది, జీర్ణ జీవితాలు, అంటరాని వాళ్ళు, భారతీ కళ్ళు తెరిచింది. అతకని బతుకులు, గుడంబాసురుడు వంటి నాటకాలను రచించారు. ఎం. మధుసూదనరావు ‘సార్థకజీవి’, వల్లంపట్ల నాగేశ్వరరావు ‘మాయాజూదం’, ‘రాతిబొమ్మ’, ‘కళకారులారా కళ్ళు తెరవండి’, ‘మహిమా నీ చోటెక్కడ’, ‘ఎలచ్చన్లచ్చినయ్’ వంటి నాటకాలు వివిధ సామాజిక రుగ్మతలపై మార్కెట్ మాయా జాలంపై రచించబడ్డ నాటకాలు.నల్గొండకు చెందిన ప్రొఫెసర్ దేవరాజు మహారాజు 1940లో ‘దయ్యాల పన్గడీ’ అనే నాటకాన్ని తెలంగాణా భాషలో రచించాడు.కోదాటి లక్ష్మీనరసింహ్మరావు గెలుపునీదే అనే నాటికను రచించాడు. వేయి ప్రదర్శనలతో తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన నాటిక ఇది.

ఇంకా ఈయన ఆదర్శలోకాలు, అభాగ్యులు, స్వార్థం, అడుగుజాడలు, కొత్తగుడి,అగ్ని పరీక్ష, భారతి,కొడిగట్టిన దీపాలు, కల్పతరువు, ప్రజాదేవత, పుట్టిన రోజు పండుగ, మతిలేని మహారాజు, ముచ్చట్లు, అందరికి చదువు వంటివి రచించాడు.తెలంగాణ మాండలిక రచయిత్రి పరిశోధకురాలు, కథా రచయిత్రి అయిన ఆచార్య పాకాల యశోదారెడ్డి పలు నాటకాలను రచించింది. ‘నందుని ధర్మదీక్ష, జీవన యాత్ర, ప్రహసనం’ వంటి నాటకాలను రచించి ప్రదర్శింపజేసింది.నల్లగొండకు చెందిన పెరిక రాజారత్నం ‘ఇష్టంలేని పెళ్ళి, నూతన కాంతులు, ఎవరు బాధ్యులు’ వంటి సామాజిక నాటకాలను రచించాడు. చిల్లర భావనారాయణ ‘కళాభిమాని, దేశద్రోహం, ఉప్పెన, కామందు, పరిణామం, కొత్త మనిషి, పదవులుపెదవులు’, లను ఎ.ఆర్.కృష్ణ ‘అరగంటలో అదృష్టం, కల్లోలం ఎక్కడికి, దేశంకోసం చేసిన నేరం’ నాటకాలను రచించారు.

ఇంకా గుండాల నరసింహరావు ‘మరుగుతున్న తరం, ఎర్రబస్సు’ లను, అంకం లింగమూర్తి ‘జలతారు, చక్రశీల, అగ్ని దీపం, పితృదేవోభవ’ నాటకాలను, ఎం.వి.సుబ్రహ్మణ్యం ‘చదరం గం, జెండాపై కపిరాజు, మీరు మారాలి’ నాటకాలను, డాక్టర్ నాంపల్లి మధుబాబు ‘మేడిపండు, దూరపుకొండ లు’ లను, తక్కెళ్ల బాలరాజు ‘నవతరానికి నాంది’ చైతన్య పథంలో, మరో పొద్దు పొడుపు, డాక్టర్ పెద్ది వెంకటయ్య ‘చైతన్యరథం’, అంబేద్కర్ మళ్ళీ పుట్టాడు, మేలుకొలుపు, చెమట బిందువులు, నేను సైతం’ వంటి నాటకాలను రచించా రు. ఎ.వి.నరసింహరావు ‘అభయపదం, మలయ సమీరం, నీలిరాగం, జీవనసమరం’ లను, వల్సపైడి ‘ఆచార్య దేవోభవ’ వంటి నాటకాలను రచించాడు. జాజాల వెంకటశేషయ్య “వసంతవనవిహారం” అనే నాటక రచన చేశాడు. గద్వాలకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రభాకరవర్ధన్ ‘ప్లాను సాగింది, విద్వత్ గద్వాల, భూదాన్, ప్రమీలార్జునీయం’ అనే నాటికలను రచించాడు.ప్రసిద్ధ పరిశోధకులు, నిత్యసాహిత్య పరాయణుడు అయిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ‘రాజరథం’ అనే భువన విజయ నాటకంను, ఇతర సాంఘిక నాటకాలను రచించాడు.

వరంగ ల్‌కు చెందిన డా॥వి.వీరా చారి అనేక నాటకాలు రచించాడు.“వర్ణమాల” నాటిక సంపుటిని వెలువరించాడు. ఇందులో 15 నాటికలు, 3 ఏకపాత్రాభినయాలు ఉన్నాయి. హాస్య, చారిత్రక, రేడియో, స్త్రీపాత్ర లేని నాటికలు ఇందులో కనిపిస్తా యి. టి.వి.రంగ య్య అందరూ అందరే, డాక్టర్ తికమక, మాకు స్వతంత్య్రం కావాలి, అక్షరజ్ఞానం, ఔన్న త్యం, గురువును కొట్టిన శిష్యుడు, అక్షరమే ఆయుధం, చదు వు విలువ వంటి నాటకా లను రచించాడు. అంపయ్య “తుఫాను గాలి, నారూ పోయా పోతావుంటే’ వంటి నాటికల ను రచించాడు. విశ్రాంత ఆంగ్ల ఉపాన్యాసకుడు రాజేంద్ర బాబు ‘నడుం బిగించుదాం’ అనే నాటికను రచించాడు.

ఇంకా ఎందరెందరో తెలంగాణ నాటకరంగానికి ఊపిరి పోశారు. శక్తివంతమైన మాధ్యమంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళ గల ఏకైక సాహిత్య ప్రక్రియ నాటకం. ఒకప్పటి రాజసాన్ని పొందిన నాటకానికి ఊపిరిపోయడానికి ప్రభుత్వం, సంస్థలు, కంకణం కట్టుకున్నప్పుడే అది సజీవమై నిలుస్తుంది. ‘నాటకాంతం హిసాహిత్యం’ అన్న ఆర్యోక్తికి దర్పణంగా నిలుస్తుంది.

 _Srikanth డా॥ భీంపల్లి శ్రీకాంత్
9032844017