Friday, March 29, 2024

కవిత్వం వ్యక్తిత్వం కలిసిన కవితత్వం తెలంగాణ రుబాయిలు

- Advertisement -
- Advertisement -

Enugu Narasimha Reddy Telangana rubayilu

 

ప్రతి కవికి ఒక భావనా ప్రపంచం ఉంటుంది. అతడందులో పరుగులు పెడతాడు. వస్తువును దర్శిస్తాడు. పదును పెడతాడు. అల్లుకుంటాడు. కవిత్వము స్ఫూర్తివంతమయ్యేదాకా విశ్రమించడు. తన రచనలో ఒక కొత్తదనాన్ని తెచ్చేదాకా ఆగడు. ఏ రచనలో అయినా వస్తువు ముఖ్య పాత్ర వహిస్తుంది. వస్తువును ఆనుకొని రచనా రూపం విస్తరిస్తుంది. రచనా రూపం అంటే సంవిధాన సమన్వయాల సమాహారమే. శిల్పమని చెప్పినా, ఇంగ్లీషులో టెక్నిక్స్ అని వ్యవహరించినా ఒకటే. ముడి సరకుగా ఉన్న రాయిని చెక్కి వివిధ పనిముట్లుగా చెక్కటం గాని, శిల్పంగా చేయటంలో గాని కవి ప్రతిభకు సంబంధించిన సాధన ఇమిడి ఉంటుంది. ఆ సాధన వలన వస్తుశిల్పాల మేళనం సౌందర్యాత్మకమవుతుంది. రచనా సౌందర్యం పాఠకులను ఆకట్టుకుంటుంది. ఒక సీనియర్ కవిగా రచయితగా ఏనుగు నరసింహారెడ్డి సాహిత్య ప్రస్థానంలో ఆ మెలకువలు ఉన్నాయి. వస్తు వైవిధ్యం గల కవిత్వం ప్రచరించిన ఏనుగు గారి ’తెలంగాణ రుబాయిలు ఒక కొత్త ప్రయోగం. తెలంగాణ రుబాయిలు చదువగానే శబ్ద సారళ్యత, అర్ధ విసృతి, రచన పట్ల జాగరూకత బోధ పడుతాయి.

ఆత్మగత వస్తు తత్వం, వాస్తవికతా ధోరణి కలిసి జనసామాన్యాన్ని స్పం దించే విధంగా ’తెలంగాణ రుబాయిలు నవ్యతను సంతరించుకున్నాయి. కవిత్వం ఒక సృజనాత్మక కళా వ్యాసంగం. ఒక ఉత్తమమైన వ్యసనం.స్పృశించకుండా కవి బతుకలేడు. అందువల్ల తెలంగాణ రుబాయిలు నిండా కాసిన పళ్ల చెట్టు వలె పచ్చని వాసనలను వెదజల్లుతున్నది. ఏనుగు నరసింహారెడ్డి రుబాయిల గురించి చెబుతూతను పాటించిన కొత్తదనాన్ని గూఢంగా చెప్పారు.

‘రుబాయిలు రాయదమొక మజాకు కాదు
రదీపూను కాఫియాను అల్లుడు కాదు
పట్టరాని చేప పిల్లలంటి ఊహలు
మాత్రల్లో పరుగు తీయ సదాకు కాదు’

అన్నారు. నాలుగు పాదాలు గల పద్యాలు వివిధ భాషా సాహిత్యాలలో ఉన్నాయి. హిందీలో చౌపాయి చాలా పాతది.అదేవిధంగా దక్షిణ భారత భాషలలో, ఇంగ్లీషు సాహిత్యంలోనూ ఉన్నాయి. ఉర్దూ భాషలో రుబాయిలకు వేరు వేరు బహార్లు ఉన్నాయి. తెలుగులో రుబాయిలు వంటి రచనలు చేసేవారు ఒక పద్ధతి గల గతులను ఎంచుకొనిరాస్తున్నారు. ఏనుగు నరసింహారెడ్డి గారు తనదైన ఒక విశిష్ట మార్గాన్ని ఎంచుకున్నారు. ఏనుగు నరసింహారెడ్డి 1. మక్కీకి మక్కీగా పరభాషలో నుంచి వచ్చిన ఛందస్సులు యధాతథంగా దిగుమతి చేసుకోలేదు. 2. భావుకత తెంపి ఇచ్చిన పలాయన వాదంలోనే కొట్టుక పోలేదు. మానవీయత తాత్వికతను అద్దినారు. 3. సొంతగా తన భావప్రవాహానికి అనుగుణంగా ఒక గతిని ఏర్చరుచుకొని ఆ దారి వెంబడి ప్రయాణించారు. 4. ఒక పాదానికి ఒక పాదంస్వతంత్రంగా ఉంటూనే తెలంగాణ తెలుగుతనం సాహితీ ముద్రలు పడేటట్టు కవి ఒక సూత్రాన్ని పాటించారు.

5.ప్రాచీన కాలంలో భావుకత ప్రధానంగా వ్యక్తమయింది. ఆధునిక కవి అయిన ఏనుగు నరసింహారెడ్డి ఆ స్థానంలో వర్గ స్వభావాన్ని మొదలుకొని చైతన్య ప్రబోధం దాకా తాత్వికత దాకా పలు అంశాలను రుబాయిలలోకి వొంపినారు. 6. సమకాల బహు విషయాలను రుబాయిలలో ఎలా చిత్రిక వేయవచ్చునో చూపించారు. 7. రుబాయిలలోఎంత భావం ఒదుగుతుందో, ఎంతవరకు చెప్పాల్నో, ఎక్కడ ఆపివేయాల్నో తెలిసి ఒక వ్యూహంగా తెలంగాణ రుబాయిలను రూపొందించారు. 8. సమాజానికి అవసరమైన వస్తువు తీసుకుని బలహీనుల పక్షాన నిలబడే పాదాలను కవి ఆవిష్కరించారు 9. పాదాల మధ్య భావ నష్టం జరగకుండా సమన్వయశీలతను పాటించారు. 10. తెలంగాణ రుబాయిలలో మితమైన శబ్దాలు ఉన్నాయి. వాటిని వ్యాఖ్యానిస్తే విపులార్థతత్వం వ్యక్తమవుతుంది.

తెలుగు సాహిత్యంలో రుబాయిల రచనలో బాగా ప్రభావిత పరచిన లబ్దిప్రతిష్టులైన కవులు 1. డా. దాశరధికృష్ణమాచార్యులు 2. డా.తిరుమల శ్రీనివాసాచార్య, అటు తర్వాత ఎక్కువ మొత్తంలో సమయాన్ని వెచ్చించి రుబాయిల కోసం తపించిన వారు 3వ కవి ఏనుగు నరసింహారెడ్డి. ఎవరి రచనాపద్ధతులు వారివే. ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త విధానాన్ని పాటిస్తారు. భిన్నమైన వ్యక్తీకరణ పాఠకులను వెంటాడుతుంది. అట్లా వెంటాడే గుణాన్ని కలిగి ఉన్న కవి ఏనుగు నరసింహారెడ్డి గారు. వ్యక్తిత్వం కవిత్వం కలిస్తే ఆధునిక రుబాయి కవిత్వం అవుతుంది. నరసింహా రెడ్డికి ఆ విలక్షణత ఉన్నది .

ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలంగాణ రుబాయిలలో శాస్త్రీయ పరిశీలనం ఉంది. సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కోణాలు ఉన్నాయి. ప్రపంచీకరణ , కార్పొరేటీకరణ, వ్యవసాయ సంక్షోభం మానవ సంబంధాలు తాత్వికత తెలంగాణ స్థానీయత చైతన్య ప్రబోధము, ఆత్మీయ, భావ సంఘర్షణల కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. మారుతున్న కాలం యొక్క చిత్రాలు, ఉత్పత్తి సంబంధాలు, అస్తిత్వ జీవనం బొమ్మ గీసుకున్న జాడలు ఉన్నాయి. అందువలన ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం మాధుర్య భరితమైనది. మనిషిసంఘజీవి. సంఘ జీవితం చైతన్య ప్రధానమైంది. అందువలన కవి అనే జ్ఞాని సమాజానికి రెండు అడుగుల ముందు ఉంటాడు. కవి క్రాంత దర్శి అంటారు. ఏనుగు నరసింహారెడ్డి ఆ విధంగా సమాజానికి తోవ చూపించే రుబాయిలు రాశారు.

శాస్త్రీయత పెరిగినకొద్దీ మనుషులు అప్లేట్ కావాలి. కానీ అందుకు భిన్నంగా ఇద్దరి మనుషుల మధ్య అంతరం పెరుగుతున్నది. అనంతరం వట వృక్షమై నిలుస్తున్నది ( చూ. 517వ రుచాయి. ) ఇట్లా ఈ లోకం ఎక్కడ దాక విస్తరిస్తుంది? వంటివి కవి వేదనలోంచి ఉదృవించినవే. నిర్ధారణ కోరితివా లోలోతులు చూడాలె’ అంటారు. బాధ్యత లేకుండా ఉండటం గాని, ఎవరో ఏదో చెప్పారని ఆ వెంట నడవటం గాని గమ్యాన్ని చేర్చదని కవి చింతన. కవి ఘటన మూలాన్ని చూడుమన్నారు. వైర హేతువు ఏదో తెలిస్తే ప్రేమ ధాతువు అంతుపడుతుంది. అనిశ్చితాంశాలను మనలోపలి నుండి తొలగించుకుంటే అంతా సుఖంగానే ఉంటుంది. స్వార్ధపరులు తమ ప్రయోజనం కోసం ఎన్నో అంతరాలు సృష్టించారు. అవన్నీ ఆమోదయోగ్యం కావు. సమాజానికి అవి అసహజత్వాన్ని ఆపాదిస్తున్నాయి. వాటిని వదులుకోవాలనే కవి రచనా హేతువు .

తెలంగాణ రుబాయిలలో ఏనుగు గారి స్నేహధర్మం ఉంది. ఆయన స్నేహశీలి. స్నేహానికి గొప్ప విలువనిచ్చే హృదయం కలిగిన వారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పిలవగానే పలికే సున్నితమైన హృదయం కలిగిన వారు. ఏ ఆపదతోనో ఒక ఫోన్ కాల్ చేసినా, ఏ సమస్య వచ్చినా సరే, తగు సూచనలిచ్చి సహాయపడే మనస్తత్వం కలిగినవారు. చిన్నప్పటి నుండి ఎన్నో సుఖ దుఃఖాలను కలిమిలేములను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగిన కవి కనుక స్నేహం గురించి బాగా తెలిసిన వారు.

‘ వందలాది మిత్రులంటే ఏమి లాభం, చెప్పుకొనుడె
నీ కోసం ప్రాణమిచ్చు నేస్తమొక్క రుండాలి అన్నారు.
(ఇలాంటి స్నేహికలు గల రుబాయిలు సంపుటిలోవేరు వేరు సందర్భాలుగాచోటు చేసుకొని ఉన్నాయి.
ఒక సామాజిక చింతనాపరుడు, ఒక మేధావి, ఒక సాహితీ వేత్త , ఒక చదువరి, ఒక ఉపాధ్యాయుడు మరణిస్తే వేల గ్రంధాలయాలు తగలబడినట్లు. ఎందుకంటే వారి అనుభవాలు గొప్పవి. అనుభవాన్ని మించిన గురువు మరొకరు లేరు. చాలా అనుభవాలు పుస్తకాలలో రాసిపెట్టి ఉండకపోవచ్చు. కొన్ని అనుభవాలు వ్యక్తీకరించడానికి తగిన పనిముట్లు దొరకకపోవచ్చు. అందువలన తరతరాలుగా సంక్రమిస్తున్న మౌఖిక సాహిత్యాన్ని గౌరవిస్తున్నాం. ఆత్మకథలు చదువుకుంటున్నాం. సాహిత్య ప్రక్రియలు అన్నిటినీ జెపోసన పడుతున్నాం. విజ్ఞానానికి అంతులేదు. అది ఒక తీరని దాహం. ఎంతవెతికినా ఇంకా కొంత మిగిలే ఉంటున్నది. ఏనుగు నరసింహారెడ్డి అనుభవ విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయన నిరంతర అధ్యయనశీలి, పరిశీలకుడు, పరిశోధకుడు.

’వేదనేదీ లేకపోతే లోతు పెరుగదు తమ్ముడా !
గాథ లేవో గాయ పరచక మనసు ఎదగదు తమ్ముడా!
అన్నారు.
‘రాజకీయమంటే ఇప్పుడు త్యాగమందువా?
డబ్బు ఇచ్చి పదవి కొనుడు త్యాగ మందువా?
లక్షలాది దుడ్లు బోసి కొన్న ఓట్లతో
పీఠమెక్కి దండు కొనుడు త్యాగ మందువా ?

రాజకీయ చైతన్యాన్ని స్థాపించడం కోసంప్రశ్నించారు . గనుగు పూలు, గడ్డిపూలు శ మట్టి పూలు , బతుకమ్మ చిన్నవేమీ కావు . మిన్న గుణం లేనివి కావన్నది ఏనుగు గారి తెలంగాణస్థానీయ సాంస్కృతిక చైతన్యం. దేన్నీ చిన్నగా చూడకుమని ఆహంకారులకు సన్నటి చురక వేసారు. ఏనుగు గారిది వ్యవసాయ కుటుంబం కావటం వలన ఆయనకు వ్యవసాయ సంక్షోభం గురించి బాగా తెలుసు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి, బీదరికం యొక్క మూలాల గురించి తెలుసు. కోతల నాటి ఆశ తెలిసి, కుప్పల నాటి ఆశ తెలిసి, కల్లాల పండుగ తెలిసి, అప్పులు గుర్తొచ్చినపుడు విలవిలలాదే సామాన్యుడు. సామాన్యుని పక్షమే వహించారు. ఎండిపోయిన చెరువులను, వట్టిపోయిన వాగులను, వలస పోయిన ఊరులను ఆయన కవిత్వంలో మరువలేదు. పట్టణీకరణ పెరిగి ఏవిధంగా ఆగమై నష్టపోతున్నాయో, మానవ సంబంధాలు ఏ విధంగా లుప్తమై పోతున్నాయో కవి కండ్ల ముందర మారుతున్న స్థితిని చూసి చెలించారు. అందుకే రక్తం సలసల మరిగే రచన’ అన్నారు.

‘సంధి దశలుంటే ఎలా సరిచేసుకోవాలె
వింత సందర్భాలెలా సరిచేసుకోవాలె
గుండె బలం అనెడి ఆయుధం ధరించి పోవాలె
సకల వేదనలను అలా సరిచేసుకోవాలె’ ( చూ 140 వ రుబాయి) అని ప్రబోధం చేసారు.
కవి కులమతాల రాజకీయాలను అసహ్యించుకున్నారు. కుల పార్టీ, మత పార్టీ, జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అన్ని ఒకటే అవుతాయి అన్నారు. అన్నీ ఒకటి కావటానికి కి వాళ్ల కు ఒక అంతస్సూత్రం పనిచేస్తుంది.అది వాళ్ళ స్వప్రయోజనాలకు సంబంధించింది. నిజానికి ప్రజలకు అలాంటివి ఏమీ లేవు. రాచరిక వ్యవస్థలో కులమతాలకు ప్రాధాన్యత ఉండేది. మనం స్వాతంత్రానంతరం ప్రజాస్వామిక రాజ్యాన్ని ఏర్పరచుకున్నాం. లౌకిక వాదాన్ని నమ్ముకున్నాం. సమానత్వానికి సంబంధించి దశాబ్దాలుగా ఎన్నో నీతులు వల్లిస్తూనే ఉన్నాం. అవి ఆచరణలో సఫలం కావడానికి చట్టాలు ప్రభుత్వాలు బలంగా పని చేయాలి. ప్రభుత్వాలు తలుచుకుంటే వివక్షతలు ఒక లెక్క కాదు. కానీ ఓటు బ్యాంకు కోసం కులమతాలు ఆశ్రయాలు అవుతున్నాయి. ఆ స్వార్థచింతన తొలగిపోవాలి. అందుకే కవి

‘అడ్డమైన గడ్డి బాగా నమిలే టందుకు
అధికారమే లక్ష్యంగా ఒక్కటైత’ అన్నారు.
ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ రుబాయిలలో, రాలే పూల మే మనం, ఊదకుండానే ఆరిపోయే
దీపం’వంటి తాత్వికత ఉన్నది. మట్టి పులకరిస్తే స్వర్ణమయే పూల తోటలు ఉన్నాయి. మనిషి కోసం తాపత్రయ పడిన సంబంధాలున్నాయి. ఆత్మీయ మమకారం తెలంగాణ ఆత్మ కలిసిన స్థానీయతలు పరమళిస్తున్నాయి. పర్యావరణం దాకా ఎన్నో ప్రాధాన్యాంశాలను రుబాయిల్లో వస్తువును చేశారు. సమకాల సామాజికత దృష్టి కోణంలో ఆలోచనలు కల్లించటంలో ఈ సంపుటిలో కొత్తదనంతో నూతన ప్రయోగాలను తీసుకున్నది. ఏనుగు నరసింహారెడ్డి రుబాయిల రచన ఒక భిన్న ప్రక్రియ.
ఈ మధ్య కాలంలో అనేక సమీక్షలు వచ్చిన పుస్తకాలలో గారి ’తెలంగాణ రుబాయిలు ఒకటి. ఈ ప్రచురణ వలన రుబాయిలు చాలా కాలానికి మళ్లీ చర్చనీయాంశమైనాయి. ఏది ఏమైనా రుబాయిలలో భావం నాలుగు పాదాలలోనే ఒదిగి పోవాలి అన్నది కవి స్వేచ్ఛ కు ఆటంకం కారాదు. ఫ్రీవర్స్ కవిత్వాన్ని బలంగా రాసిన ఏనుగు నరసింహా రెడ్డి గారు దీర్ణ నిడివి గల కవితలు రాశారు. రాస్తున్నారు. ఆయన బహుముఖ రచనా పాఠవానికి రుబాయిలు ఒక మచ్చు మాత్రమే. ఛందో నిర్భంధాలలో ఒదిగిపోడని తన భావ స్వేచ్చ తెల్పుతూనే ఉన్నది. బహుముఖీనంగా ఉన్నత సాహితీ శిఖరాలకు చేరాలని ఆశిస్తాను .

 

                                                                    – డా. బెల్లంకొండ సంపత్ కుమార్
                                                                               99085 19151

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News