Home ఆఫ్ బీట్ చక్కని హావభావాల చెక్కబొమ్మలాట

చక్కని హావభావాల చెక్కబొమ్మలాట

Epic legends in Indian culture are the path of devotion

భారతీయ సంస్కృతిలో పురాణ ఇతిహాసాలు భక్తిమార్గాన్ని ప్రభోదించటమే గాకుండా ఆరాధనా విధానాన్ని అమలు చేశాయి. జన సముహాలు దేవతలు, దేవుళ్ల విగ్రహాల మీద నమ్మకం ఏర్పరచుకొని వారి ప్రతిరూపాలను పూజించటం మొదలుపెట్టారు. ఇదంతా ఒక్క రోజులో జరిగిన ప్రక్రియ కాదు. ఒక వ్యక్తి సృష్టించింది కాదు. దేవతల విగ్రహాలను పూజించటం మొదలైన తర్వాత వాటిని ఆకర్షణీయమైన బొమ్మలుగా తయారుచేసి ఆడించడం మొదలైతది. క్రీ.శ.1160 కాలం వాడైన నన్నెచోడుడు ‘కుమారసంభవం’ కావ్యంలో “తరణులు చిల్క బొమ్మయును దంతపు బొమ్మలు మేలుగాజులు” అంటూ నాలుగు రకాల బొమ్మల గురించి ప్రస్తావించినాడు.

పన్నెండవ శతబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో “భారతాది కథల జీరమఱుగుల, నారంగ బొమ్మల నాడించువారు,కడునద్భుతంబుగ గంబసూత్రంబు,లడరంగ, బొమ్మల నాడించివారు” అని తోలుబొమ్మలాట, చెక్కబొమ్మలాట గురించి వర్ణించటం జరిగింది. అంతేగాక నాచనసోముని ఉత్తర హరివంశంలోను, వేమన శతకపద్యంలో “ఎలుగుతోలు దెచ్చి ఎందాక ఉతికినా, నలుపు నలుపేగాని తెలుపురాదు, కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా, అంటూ ఉంది. ఈ రకంగా చెక్కబొమ్మలాట, తోలుబొమ్మలాట కళారూపాల ప్రస్తావన కాలాన్ని బట్టి చూస్తే క్రీ.శ. 12వ శతాబ్దం కంటే ముందు నుండే ఉన్నట్లు తెలుస్తున్నది. కళాకారుల మాటల్లో తోలుబొమ్మలాట కంటే చెక్కబొమ్మలాటనే ప్రాచీనమైనదని వినిపిస్తున్నది.

తెలంగాణ జానపద కళారూపాల్లో అతిప్రాచీనమైన చెక్కబొమ్మలాట కళారూపం ప్రత్యేకమైంది. ఎందుకంటే తాము చెప్పదలచుకునే కథాంశాన్ని బొమ్మలను ఆడిస్తూ, ఆ బొమ్మలతోనే హావభావాలను ప్రకటిస్తూ ప్రదర్శింపజేస్తారు. అందుకే జానపద సమూహానికి ఈ కళారూపం పట్ల ఆసక్తి ఎక్కువ. ఈ కళారూపానికి చెక్కబొమ్మలాటను కొయ్యబొమ్మలాట అని కూడా పిలుస్తారు. రాయలసీమలో చెక్కబొమ్మలను ఊసబొమ్మలాట అని పిలుస్తారు. ఈ బొమ్మలకు దారాలకు బదులుగా ఊసలు బిగించడంతో ఊసబొమ్మలాట అయింది. ఈ కళారూపాన్ని ప్రదర్శించే కళాకారులను తెలంగాణలో బొమ్మలోళ్లని వ్యవహరిస్తారు. వీరు బుడిగజంగాలలలో ‘బేడ’ (బెడద) వర్గానికి చెందిన ‘మోతె’ ఇంటిపేరుగల వంశస్థులు. నేటికీ ఈ కళారూపాన్ని సజీవంగా నిలుపుతూ ప్రదర్శనలిస్తూ వీరు మనుగడ సాగిస్తున్నారు.

పూర్వం మోతె రామయ్య కుమారులు మోతె రామచంద్రుడు, మోతె నర్సింహులు, మోతె రామలింగం గారికి తోలుబొమ్మలాటలు ఆడేవారు. వీరు శంషాబాద్ నీలకంఠం గారి దగ్గర చెక్కబొమ్మలాట నేర్చుకున్నారు. ఆ తర్వాత నకాశి వారితో చిన్నగా బొమ్మలు చేయించుకొని బొమ్మలాట ప్రదర్శనలిచ్చారని ఉమ్మడి వరంగల్లు జిల్లా నమ్మెట్ట మండలం, అమ్మాపురం గ్రామానికి చెందిన మోతె జగన్నాథం గారు చెప్పారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు చెక్కబొమ్మలాట ప్రదర్శనలో లవకుశ, గయోపాఖ్యానం, నాటకాలు ఊరూరూ తిరుగుతూ ఆడేవారు. ఆ తర్వాత విడిపోయి బొమ్మలను పంచుకోగా ఒక్కొక్కరికి రెండు బొమ్మలు వచ్చాయంటారు. వారు బొమ్మలను తీసుకొని ఎవరికి వారుగ్గా తాలూకాలను పంచుకొని ప్రదర్శనలిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

మోతె రామచంద్రుని సంతతివాడైన మోతె కొండయ్య జనగామలో స్థిరపడి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ప్రదర్శిస్తున్నాడు. అలాగే మోతె నర్సింహులు ఊరూరూ తిరుగుతూ మల్యాల గ్రామంలో బొమ్మలాట ఆడిస్తుండగా, మల్యాల దొర వారు పాతబడిపోయిన ఆ రెండు బొమ్మలను చూచి, ఈ బొమ్మలతో ఎన్ని నాటకాలు ఆడవచ్చని అడగ్గా నర్సింహులు లవకుశ, గయోపాఖ్యానం అని చెప్పగా, అప్పుడు దొర ఇంకా నీకు ఏమేమి నాటకాలు వచ్చు అని అడిగాడు. అందుకు నర్సింహులు బాలనాగమ్మ, చెంచులక్ష్మి, ధర్మాంగద, భక్తరామదాసు, సతీ సావిత్రి నాటకాలు వస్తాయని చెప్పారు. దానితో ఔసల రామయ్యను పిలిచి నాటకాలకు సరిపోయే బొమ్మలను చేయించి ఇచ్చాడు. అందుకే కళాకారులు బొమ్మలాట ప్రదర్శన ప్రారంభంలో మల్యాల దొరను కీర్తిస్తూ పాడుతారు. మోతె నర్సింహులు సంతతివారే మోతె జగన్నాథం ప్రస్తుతం నర్మెట్ట మండలం, అమ్మాపురం గ్రామంలో స్థిరపడి ఒక బృందంగా ఏర్పడి ప్రదర్శనలిస్తూ జీవిస్తున్నారు.

ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన మోతె రామలింగం సంతతి అయిన మోతె రామస్వామి, యాదగిరి, నర్సింహంగారు ఉమ్మడి వరంగల్లు జిల్లా , నారాయణపూర్ మండలం, బూర్గుపేటలో స్థిరపడి పంచుకొన్న బొమ్మలతో పాటుగా మరిన్ని బొమ్మలను స్వయంగా తయారుచేసుకొని ప్రదర్శనలిస్తూ వస్తున్నారు.

బొమ్మల స్వరూపం ఆడించే విధానం
చెక్కబొమ్మల తయారీకి బూరుగు కర్ర అనువుగా ఉంటుంది. కర్ర బరువు లేకుండా తేలికగా ఉంటుంది. ఈ బొమ్మలకు అలంకరణా వస్త్రాలు, ఆభరణాలు లేకుండా చూస్తే సుమారుగా మీటరు పొడవుతో తల, చేతులు, నడుము భాగాలు విడివిడిగా ఉంటాయి. వీటిని తాడుతో బిగించి కడతారు. చేతులు, భుజాలు, మోచేయి అరచేటు వద్ద కోళ్లను కలిగి ఉంటాయి. వాటిని భుజం లోపలి నుండి ఒక దారంతో భుజం వద్ద లాగి కడతాయి. తల బొమ్మ శరీర మొండానికి బిగించడానికి వీలుగా ఉంటుంది. శరీర భాగం అడుగున తాడుతో ముడివేసి కడతారు. కాబట్టి బొమ్మలు కదలికలు తక్కువగా కట్టడి చేయబడతాయి. బొమ్మల కుడి చేయి చూపుడు వేలు, బొటన వేలు కలిసే ఉంటుంది. అంతేగాక ఎడమ చేయి నిటారుగానే ఉంటుంది. ఈ రకంగా ఉన్న బొమ్మలకు తల శరీర భాగం కదలడానికి బొమ్మ తలకు చెవి వెనుక భాగం నుండి దారాలు కట్టి ఒక జానెడు వెదురుబద్ధకు కడతారు. అట్లాగే బొమ్మ చేతులు కదపడానికి, బొమ్మ రెండు చేతులకు దారాలు కట్టి మరో వెదురుబద్ధకు కడతారు.

ఈ రకంగా కట్టిన దారాలతో బొమ్మలను ఆడించేటప్పుడు కథలోని సన్నివేశాన్ని బట్టి బొమ్మ శరీర భాగం తల కదలాలంటే తల నుండి కట్టిన వెదురుబద్ధను లేపితే బొమ్మ శరీర భాగాలు కలిపి పూర్తిగా లేస్తుంది. ఆ వెదురుబద్ధను కిందకు మీదకు కదిపితే బొమ్మ కూడా అడ్డంగా రెండు పక్కల కిందకు మీదకు కదులుతుంది. అట్లాగే చేతులకు కట్టిన వెదరుబద్ధను కదిపితే బొమ్మ చేతులు కదులుతాయి. ప్రదర్శనలో ఈ రకంగా కళాకారులు ఎడమ చేత్తో బొమ్మను పట్టుకొని కుడి చేత్తో ఆడిస్తూ, చేతులను కదుపుతూ కథకు తగ్గట్టుగా బొమ్మలచేత ప్రాణమున్నట్టుగా హావభావాలను ప్రకటిస్తూ ఆడిస్తారు. బొమ్మ శరీరం , తల కలిపి మీటరు ఎత్తు ఉండే బొమ్మలకు అలంకరణా వస్త్రాలు ఆభరణాలు అలంకరించి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెంచుతారు. బొమ్మల్ని ఆడించేటప్పుడు అలంకరించబడిన బొమ్మల బరువు కూడా పెరగటంతో కళాకారులు శారీరకంగా కూడా బరువును మోయలేక శ్రమపడాల్సి ఉంటుంది.

ప్రదర్శించే కథలు పాత్రల బొమ్మలు
కళాకారులు, బొమ్మలతో ప్రదర్శించే కథల్లో లవకుశ, గయోపాఖ్యానం, బాలనాగమ్మ, చెంచులక్ష్మి భక్తరామదాసు, సతీసావిత్రి, ధర్మాంగద మొదలైన నాటకాలను ప్రధానంగా ఆడతారు. ఈ నాటకాలు ఆడటానికి ప్రధానంగా పది బొమ్మల వరకు ఉంటాయి. ఇందులో రాముడు, లక్ష్మణుడు, సీత, చెంచులక్ష్మి, భరతుడు, కౌసల్య, కైక బొమ్మలు ఉంటాయి. అయితే ఇవేకాకుండా ప్రదర్శన ఆద్యంత హాస్యం రక్తి కట్టించడానికి హాస్యపాత్రల బొమ్మలను కూడా ఉపయోగిస్తారు. ఈ బొమ్మలు కథకు సంబంధం లేకుండా సమాజంలోని వ్యక్తుల వింత స్వభావాన్ని తెలియజేసేవిధంగా, వికృతమైన రూపంతో హాస్యాన్ని కలిగించే విధంగా బొమ్మలుంటాయి. ఇందులో గొల్లమల్లక్క, ఫకీరు, బ్రాహ్మణుని బొమ్మలు ప్రత్యేకమైనవి. కొన్ని సందర్భాల్లో కళాకారులు ఒక పాత్రను ఉపయోగించిన బొమ్మను మరొక పాత్రకు కూడా ఉపయోగించుకుంటారు.

ఉదాహరణకు సీత పాత్ర కు ఉపయోగించిన బొమ్మను చెంచులక్ష్మి నాటకంలో ఆ బొమ్మ యొక్క చీరను మార్చి చెంచులక్ష్మీగా కూడా ఉపయోగించుకుంటారు. వీరి బొమ్మల్లో ఎక్కువ ప్రాధాన్యం కలిగినవి. కథకు సంబంధం లేకపోయిన, ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించేవి గొల్లభామలు, శ్రీకృష్ణుడు. ఈ బొమ్మలు ప్రధానమైన బొమ్మలకంటే చిన్నగా ఉండి ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి. ఇందులో గొల్లభామల బొమ్మలు అయిదు వేరు వేరు రంగులు వేయబడి తలకు కొప్పు వేసుకొని, పువ్వులు ధరించి పెద్దకల్లు , ముక్కుకు ముక్కెరపోగులు పెట్టుకొని, ఓని వేసుకొని గొల్లభామల మాదిరిగా కనిపిస్తాయి. ఈ బొమ్మలన్ని చేతుల్లో కోలలు ధరించి, కలిసి ఉంటాయి. వీటితోపాటు కృష్ణుడు కోలాటం ఆడినట్లుగా నీలం రంగు ముఖానికి, చేతులకు వేయబడి, తలలో నెమల పింఛం, కిరీటం, మెడలో ఆభరణాలు కలిగి తెల్లని వస్త్రం ధరించి కనిపిస్తాడు. ఈ రకంగా కళారూపంలో ఉపయోగించే ప్రతి బొమ్మను ప్రేక్షకుడు చూడగానే ఆ పాత్రను గుర్తించే విధంగా అలంకరణ, వేషభూషణాలతో బొమ్మను తీర్చిదిద్దుతారు.

ప్రదర్శకులు వేషధారణ
ప్రదర్శనలో తొమ్మిది మంది కళాకారులు ఉపయోగపడతారు. పూర్వం ప్రతి సంవత్సరం ప్రదర్శన నిమిత్తం గ్రామాల మీదికి పోవటానికి ముందు కళాకారులు మేళం తయారు చేసుకునేది. అంటే ప్రదర్శనకు కావాల్సిన కళాకారులను సమీకరించుకోవటాన్నే మేళం అంటారు. అదే రోజు పెటే పూజ కూడా చేసుకుని, కళాకారులకు సొంతంగా తబలా హార్మోనియం ఉంటే వారికి ప్రతిఫలంలో అదనంగా ఒక పాట ఇచ్చేటట్టు, అలాగే మేళంలోని గురువుకు అదనంగా ఒక పాట ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రదర్శనలో ఉపయోగించే తొమ్మిది మంది కళాకారుల్లో ఒకరు గురువుగా ఉండి ప్రదర్శనలో బృందం సభ్యులకు సూచనలిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా ప్రదర్శన నడిపిస్తాడు. ఇతనితో పాటు ముగ్గురు కళాకారులు బొమ్మలను ఆడించడానికి, మిగతా అయిదు గురిలో తబల, హార్మోనియం వాయించడానికి ఒక్కొక్కరు, వంత పాడుతూ తాళాలు వాయిస్తూ ఇద్దరు, ఒకరు సమయానికి బొమ్మలను అందించటానికి ఉపయోగపడతారు. కొన్ని సందర్భాల్లో వంత పాడటానికి స్త్రీలను కూడా ఉపయోగించుకుంటారు. వేషధారణలో కళాకారులు తలకు రుమాలు, నుదుట అడ్డబొట్టు, నడుముకు పేటి దీన్నే దట్టీకట్టిన వస్త్రం అంటారు. దీన్నీ నడుముకు బలం కోసం కట్టుకుంటారు. భుజంపై కండువా, మెడలో చంద్రహారం, చేతికి కడెం, కాలిబేరి, బోటు గడెం ధరించి ధోతి, అంగి ధరిస్తారు.

చెక్కబొమ్మలాట కళారూపం ఒక కులానికి, ఒక గ్రామానికి పరిమితం కాదు కాబట్టి కళాకారులు పూర్వం ప్రదర్శన నిమిత్తం ఎడ్ల బండ్ల మీద బొమ్మల పెట్టెలను, నిత్యావసర వస్తువులను వేసుకుని ఊరూరు తిరుగుతూ, ఊరిలోని పెద్దను గాని, కుల పెద్దలను గాని ప్రదర్శనకు ఒప్పించి ప్రదర్శించేవారు. కొన్ని గ్రామాల్లో అయితే చుట్టూ పరదాలు కట్టి పావలా నుండి అయిదు రూపాయల వరకు ప్రేక్షకుల దగ్గర టికెట్టు పెట్టి ఆడించినట్లు కళాకారులు చెప్తారు. ఒకవేళ కులాలు ఆడించినట్లయితే ఆ కులం వాడలోనే రంగస్థలాన్ని నిర్మించుకుంటు ఆడటం జరిగేది.

రంగస్థలం
కళాకారులు రంగస్థలాన్ని తూర్పు ముఖంగా ఉండేటట్టు నిర్మించుకుంటారు. వీరి భుజాల ఎత్తు వరకు తెల్లని గుడ్డను తెరగా కట్టి దాని పై భాగంలో అడ్డుకర్ర కడతారు. దీనినే చాందినీ కర్ర అంటారు. ఈ కర్రకు ఎనిమిది వరకు కంఠశిలలు కొట్టబడి ఉంటాయి. ఈ కంఠశిలలకే బొమ్మలను తగిలించి తెరముందు నిలుపుతారు. బొమ్మలను తెర ముందు ఆడించేటప్పుడు కళాకారులు కనిపించకుండా ఉండేందుకు సమాంతరంగా మరొక తెర అడ్డంగా కట్టుకుంటారు. అంతేకాకుండా అడ్డుకర్ర చుట్టూ తెర కట్టకుని కళాకారులు అందులోనే ఉండి ప్రదర్శిస్తారు. ఒకవేళ రాత్రివేళ ప్రదర్శిస్తే పూర్వమైతే ఆముదం దీపాలు, లేదా పెట్రో మాక్స్ లైట్స్ వెలుతురు తెరమీద పడేట్టు చేసుకునేది. ప్రస్తుతం కరెంటు బల్బులు బయటి నుండి తెర మీద కాంతి పడేటట్టు చేసుకుంటున్నారు. అయితే ఒకవేళ పగలు ప్రదర్శిస్తే బొమ్మలకు కట్టిన దారాలు కనిపించకుండా ఉండేందుకు చేపలు పట్టే వలను తెర మీద కడతారు.

కళాకారులు ప్రదర్శనా ప్రారంభంలో గణపతి శ్లోకంతో ఆరంభించి తమ కళారూపానికి ప్రాణం పోసిన గట్ల మల్యాల మేళమిదని , అతని వృత్తాంతం అర్థమయ్యేలా వివరించి, మళ్లీ కథలోకి వెళ్లేముందు ప్రదర్శనిప్పిస్తున్న వ్యక్తుల్ని మరిచిపోకుండా పేరుపేరునా దీవెన పెట్టి వారి పట్ల వినమ్రతను ప్రదర్శిస్తారు. కథా సన్నివేశాన్నిబట్టి బొమ్మలను ఆడిస్తూ ప్రేక్షకులను రంజింపజేయడానికి తమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తారు కళాకారులు. అంతేగాక ప్రదర్శనలో ప్రేక్షకుల నిరాసక్తిని కనిపెట్టి చెక్కబొమ్మలాట కళారూపానికే మణిమకుటమైన గొల్లభామల కోలాటం మధ్యమధ్యలో ఆడిస్తారు. ఇది ప్రేక్షకులను అబ్బుపరచటమేగాక ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. పూర్వం ప్రేక్షకుల్లో ఉండే పోలీసు పటేలు, దొరలు, ఆ ఊరి పెద్ద మనుషుల పేరు అందరి పేర్లు పలుకుతూ గొల్ల భామలు కృష్ణునితో ఎడమ పక్కగా వాల్చి, కుడి పక్కగా వాల్చి, వెల్లకిలా , బోర్ల బొక్కన కోలాటం వేయించి ఆనందపరుస్తారు. అలాగే ప్రేక్షకుల అభిరుచిని బట్టి గొల్లమల్లకూ పాత్రను ప్రవేశపెట్టి హాస్యాన్ని పండిస్తూ కథను రక్తి కట్టిస్తారు.

కళాకారులు బొమ్మలతో ప్రదర్శించటమేగాక ఒకవేళ ప్రేక్షకులు నాటకాలు ఆడమంటే కీచకవధ, ద్రౌపదీ స్వయంవరం, సారంగధర, మైరావడా మొదలైన ఇరవై వరకు నాటకాలు ఆడతారు.

నేటి స్థితి
చెక్కబొమ్మలాట కళారూపం కళాకారులు తమకు సంక్రమించిన కళను తరతరాలుగా అనుసరిస్తూ నేటికీ మనుగడ సాగిస్తూ వస్తున్నారు. ఆనాటి నుండి నేటివరకు ‘మోతె’ వంశీయులే ఈ ప్రాచీన జానపద కళను, కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుతూ, తమ ఉనికిని తమ సాంస్కృతిక గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని తపన పడుతూ వస్తున్నారు.
ఒకనొక దశలో బూర్గుపేటకు చెందిన మోతె రామలింగం సంతతికి చెందిన రామస్వామి, యాదగిరి , నర్సింహ గారి చెక్కబొమ్మలు ‘అటుకు’ మీదికే పరిమితమయ్యాయి. అటువంటి దశలో తెలుగు విశ్వవిద్యాలయం వారి జానపద గిరిజన విజ్ఞానపీఠం, కళారూపాన్ని గుర్తించి ప్రాచుర్యాన్ని కల్పించింది.

ఆ తర్వాత తెలంగాణలోనే కూడా అతి ప్రాచీనమైన చెక్కబొమ్మలాట కళారూపం ఉందనే విషయం బహిర్గతమైంది. ప్రస్తుతం మోతె జగన్నాధం, మోతె రామచంద్రం, మోతె కొండయ్య అనే ముగ్గురు బృందాలు మాత్రమే కళారూపాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. అయితే ఒకప్పుడు గ్రామాల్లో ప్రదర్శనలకి వెళ్తే ఆదరణ ఉండేదని , కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కళాకారులు తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. అప్పుడప్పుడు ఆకాశవాణి, దూరదర్శన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రదర్శనలకి అవకాశం కల్పిస్తే వెళ్తున్నామని, లేకుంటే ఇతర వృత్తుల్లో బతకడానికి స్థిరపడాల్సిన పరిస్థితి ఉందని కళాకారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. తమ కళను, తమ సంస్కృతిని శాశ్వతంగా పరిరక్షించే ప్రయత్నం జరగాలని, ప్రభుత్వం అందుకు పూనుకోవాలని కళాకారులు కోరుకుంటున్నారు.

Epic legends in Indian culture are the path of devotion

Telagana Latest News