Home తాజా వార్తలు ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్

ముంపు ప్రాంతాలను పర్యటించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్

Errabelli and Satyavathi Rathod visited the flood affected areas

 

వరంగల్‌ : ఉమ్మడి వరంగల్ జిల్లాను కుదిపేసిన భారీ వర్షాల వల్ల నష్టం జరగకుండా ఉండేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతిరాథోడ్‌లు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని దీన్‌దయాల్‌నగర్, టివినగర్, నయీంనగర్, హంటర్‌రోడ్డు, వరంగల్ ప్రాంతాల్లోని ముంపు ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలను వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి రప్పించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుండి వరంగల్ రూరల్ జిల్లాలోని నల్లబెల్లి, నర్సంపేట, రంగాయచెరువు వాగు ఉధృతి, మాదన్నపేట చెరువులను పరిశీలించారు.

ఆయన వెంట ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎంఎల్‌ఎ నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులున్నారు. ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్ జిల్లా ముంపు ప్రాంతాలపై కలెక్టర్‌తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నేరుగా ములుగు జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం గోదావరి వరద ఉధృతిని పరిశీలించి ఐటిడిఎ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ములుగు అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, గోదావరి ఉధృతి ఎక్కువగా ఉన్నందున అధికారులు ఎక్కడికక్కడే అలర్ట్‌గా ఉండాలన్నారు. అవసరమైతే ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు కూడా రంగంలోకి దిగుతాయన్నారు.

వరంగల్‌కు దిగిన ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు..
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో భారీ వర్షాల వల్ల పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. ఆప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాల సేవలను వినియోగించాలని సూచించిన మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం వరంగల్ కలెక్టరేట్‌కు ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు చేరుకున్నాయి. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు కూడా నగరం మునిగిపోయింది. అప్పుడు కూడా ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలతోనే సేవలందించినందున మళ్లి వారినే ప్రభుత్వం రంగంలోకి దించింది.

సిఎం నల్లబెల్లి పర్యటనను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి తండ్రి రాజిరెడ్డి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు సిఎం కెసిఆర్ నేడు నల్లబెల్లికి రానున్నారు. భారీ వర్షాల కారణంగా సిఎం పర్యటనకు అనుకూలమైన వాతావరణం ఉందాలేదా అని పరిశీలించడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, ఎక్సైజ్‌శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మంథని జెడ్‌పి చైర్ పర్సన్ పుట్ట మధు నల్లబెల్లికి చేరుకున్నారు. పెద్ది ఇంటికి చేరుకొని రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా సిఎం పర్యటన సాధ్యాసాధ్యాలపై చర్చించారు. శుక్రవారం సాయంత్రం వరకు సిఎం పర్యటనపై ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదు.

Errabelli and Satyavathi Rathod visited the flood affected areas