జనగాం, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాలో విస్తృత పర్యటనలు చేసిన మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ : కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు ఏవిధంగా ఉన్నాయనే దానిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలను కొనసాగించారు. జనగాం జిల్లాలోని కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ ఉధృతంగా ఉన్న గ్రామాలు, రోగుల పరిస్థితులు వాటి నివారణ చర్యలు, చికిత్స విధానాలు, లాక్‌డౌన్‌పై వస్తున్న ఫలితాలపై మంత్రి అన్నిశాఖల అధికారులతో కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నారు.
సాధ్యమైనంత మేరకు వైరస్ నివారణకు కావాల్సిన చర్యలు తీసుకుంటూనే కోవిడ్ పాజిటివ్ కలిగిన రోగులకు ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అందుకు ఏస్థాయిలోనైనా ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కోవిడ్ నివారణ చికిత్సలు అధికంగా జరుగుతున్నందున ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై మరింత నమ్మకం కలిగించే విధంగా వైద్యసేవలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచించారు. వాటితో పాటు జిల్లాలో ఏడు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్ల కొరత లేదని సూచించారు. ఆస్పత్రుల్లో కావాల్సినన్ని ఆక్సిజన్, బెడ్స్ స్థాయిని ఇంకా పెంచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి మండలంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో కోవిడ్ నివారణకు సత్వర వైద్యం అందించేందుకు పారా మెడికల్ సిబ్బందిని మూడు నెలల ఉద్యోగ నియామక ఒప్పందంపై ఎక్కడికక్కడే తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అదేవిధంగా తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రంలో 31 పడకల విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడున్న వైద్య సౌకర్యాలను మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. దేవరుప్పుల పిహెచ్‌సిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులకు, అధికారులకు తగిన సూచనలు చేశారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం..
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నందున రైతులు అధైర్యపడకూడదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులకు భరోసా నిచ్చారు. ఇప్పటికే గ్రామాల్లో కొనుగోళ్లు దగ్గరపడుతున్నాయని, ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోతున్నందున ఆధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ధాన్యం కొనుగోళ్లపై దృష్టిని కేంద్రీకరించి సాధ్యమైనంత మేరకు కొనుగోళ్ల వేగాన్ని పెంచాలన్నారు. ఎక్కడా కూడా రైతుల నుండి ఫిర్యాదులు రాకూడదని సూచించారు. రైస్‌మిల్లర్లు రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.