Home తాజా వార్తలు ‘ఎంజిఎం’ అభివృద్ధికి కృషి చేశా…

‘ఎంజిఎం’ అభివృద్ధికి కృషి చేశా…

Errabelli

 

డాక్టర్లు 20 శాతం నిధులిస్తే.. ప్రభుత్వం నుండి 80 శాతం నిధులు తెస్తా : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ : ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం ఆస్పత్రి అభివృద్ధికి తాను రాజకీయాల్లో చేరిన నాటి నుండి ఎంతో కృషి చేశానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీ వజ్రోత్సపు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు కెఎంసికి మంత్రి దయాకర్‌రావు ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ప్రిన్సిపాల్ సంధ్య అధ్యక్షతన జరుగగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎంజిఎం ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కళాశాలలోని వైద్యులకు పదిసంవత్సరాల అనుబంధం మాత్రమే ఉన్నదని, తనకు మాత్రం 45 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు.

ఈ కళాశాల అంటే తనకు ప్రాణమని తాను డాక్టర్‌ను కావాల్సిన వాడినని.. కాని రాజకీయ నాయకున్ని అయ్యాయని తెలిపారు. ఎంజిఎం ఆస్పత్రి ప్రస్తుతం ఈవిధంగా ఉందంటే అందుకు కారణం తానేనని, 1997 నుండి 2007 వరకు ఎంజిఎంకు ఎనలేని కృషి చేసి రూ.కోట్లాది నిధులను ఇప్పించానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో ఎంజిఎం ఆస్పత్రి అభివృద్ధి గురించి మాట్లాడుతూ దయాకర్‌రావు చొరవ వల్లనే ఎంజిఎం అభివృద్ధి జరుగుతుందని అనడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

పూర్వ డాక్టర్లు 20 శాతం నిధులు అందజేస్తే తాను ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద 80 శాతం నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. పూర్వ డాక్టర్లు ఎంజిఎం అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని నగరంలోని ఎంజిఎం ఆస్పత్రి కెఎంసి అభివృద్ధికి తాను ఎల్లప్పుడు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్య, ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు ఎంజిఎం ఆస్పత్రి వైద్యులు, పూర్వ వైద్యులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Errabelli said MGM Improved in my period