Saturday, April 20, 2024

తెలంగాణ‌లో ప‌క‌డ్బందీగా లాక్ డౌన్ నిర్వ‌హిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

Errabelli

ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500
పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశాం
స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం
కేంద్రమంత్రి నరేంద్రతోమర్‌తో మంత్రి ఎర్రబెల్లి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పకడ్భందీగా లాక్‌డౌన్ నిర్వహిస్తున్నామని, కరోనా వైరస్ నిర్మూలకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కేంద్రమంత్రి నరేంద్రతోమర్‌తో జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ ప్రసంగం తరువాత కేంద్రమంత్రి పలు రాష్ట్రాల మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి రాష్ట్రంలో తీసుకుంటున్న పలు చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. దేశంలో అందరికంటే ముందే కరోనావైరస్ నిర్మూలనకు రాష్ట్రం అప్రమత్తమయ్యిందని, సిఎం కెసిఆర్ మొట్టమొదటి సారిగా లాక్‌డౌన్‌ని ప్రయోగించారన్నారు.

ప్రస్తుతం దిగ్విజయంగా దీనిని కొనసాగిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ప్రతినెల ఒక్కోక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ. 1500 ఇస్తున్నామని తెలిపారు. 6 లక్షల మంది వలస కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నా మన్నారు. అదనంగా వలస కార్మికులు ఉండడానికి షెల్టర్లను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కరోనా కష్టకాలంలో పారిశుద్ధ కార్మికులకు రూ.5 వేల ప్రోత్సాహాకాన్ని అందచేశామన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశామని ఎర్రబెల్లి కేంద్రమంత్రితో పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 12,548 గ్రామాల్లో ఉపాధిహామి పనులు
ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ను వ్యవసాయంలో విలీనం చేయాలని సిఎం ప్రధాని మోదీకి లేఖ రాశారని, ఆ విధంగా చేస్తే రైతాంగానికి ఉపయోగపడే విధంగా వ్యవసాయ అనుబంధ పనులకు ఈజిఎస్‌ను వాడే వీలుంటుందని తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని, వీలైనంత త్వరగా ఆ నిర్ణయం తీసుకోవాలని ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్రంలోని 12,548 గ్రామాల్లో అంటే 98 శాతం గ్రామాల్లో ఉపాధిహామి పనులు కొనసాగుతున్నాయని 10 లక్షల మంది కూలీల ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ప్రతి గ్రామం నుంచి సగటున కనీసం 82 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

ప్రభుత్వమే రైతుల నుంచి మొత్తం పంటల కొనుగోలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వమే రైతుల నుంచి మొత్తం పంటలను కొనుగోలు చేస్తుందన్నారు. రూ.1800 కనీస మద్ధతు ధరతో 4 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం, మక్కలు కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రికి ఎర్రబెల్లి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రాదు, స్పెషల్ కమిషనర్ సైదులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కెసిఆర్ నేతృత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది
గ్రామీణ వ్యవస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించామని, దీనికి కారణం సిఎం కెసిఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ నేతృత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని మంత్రి పేర్కొన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్మాగాంధీ చెప్పినట్టుగా అదే దారిలో కెసిఆర్ పల్లెలలను అభివృద్ధి చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాయన్నారు. ప్రజాస్వామిక రాజ్యాంగంలోనూ మూడంచెల పద్ధతిలో గ్రామాలు ప్రాథమిక, మొదటి అంచెలో ఉన్నాయన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

బిజెపి నాయకులకు కెసిఆర్‌ను విమర్శించడమే పని
రైతాంగానికి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసినంత మేలు ఎవరూ చేయడం లేదని, బిజెపి నాయకులు ఈవిషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సూచించారు. బిజెపి నాయకులకు కెసిఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఒక వేళ కెసిఆర్ రైతులకు ఏమీ చేయలేదని మీరూ నిరూపించగలరా? అంటూ ఆయన బిజెపి నాయ కులకు సవాల్ విసిరారు. కరోనా కష్టకాలంలోనూ బిజెపి నాయకులు రాజకీయాలు చేస్తే ఎవరూ హర్షించరన్నారు. సాధ్యమైతే సహకరించండి, ప్రజల్ని ఆదుకోండి, సాధ్యం కాకపోతే కూర్చోండి అంటూ ఆయన చేతులెత్తి మొక్కారు. ఏదో విమర్శలు చేయాలి కదా అంటూ అనవసర విమర్శలు చేయవద్దని మంత్రి ఎర్రబెల్లి బిజెపి నాయకులకు హితవు పలికారు.

 

Errabelli video conference with Narendrathomar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News