Home తాజా వార్తలు పట్టణ రూపురేఖలు మారుస్తా…

పట్టణ రూపురేఖలు మారుస్తా…

development of town of Thorrur

 

అభివృద్ధి పనుల కోసం రూ.30కోట్లు, తొర్రూరు పట్టణాభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

తొర్రూరు : తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తానని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం తొర్రూరు పురపాలక సంఘం కార్యాలయంలో రూ.20కోట్లతో ప్రత్యేక నిధులతో చేపట్టిన పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.20కోట్లు విడుదల చేశారని చెప్పారు.

పట్టణ సుందరీకరణతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని నిధులు తీసుకొస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికీ చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులన్నీ వారం రోజుల్లో ప్రారంభించాలన్నారు. తొర్రూరు చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా రూపుదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు.

పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండే విధంగా చెరువు అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. పనుల పురోగతిలో నిర్లక్షం వహించే అధికారులను సహించేది లేదని, నాణ్యతలో రాజీపడకుండా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ కర్నె సోమయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, డీఎస్పీ మదన్‌లాల్, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Errebelli’s review of development of town of Thorrur