Friday, March 29, 2024

ఈఎస్ఐ స్కామ్ లో వెలుగులోకి కొత్త విషయాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇఎస్‌ఐ శ్కాంలో ఇడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుందా రెడ్డి వ్యాపారాలు చేసినట్లుగా ఇడి అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రమోద్‌రెడ్డి, వినయ్‌రెడ్డి పేర్ల మీద వ్యాపారాలు ముకుందరెడ్డి చేశారని, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మెడికల్ పరికరాలు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు దొరికే పరికరాలని కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధిక ధరలు రాబట్టడంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, ముకుంద రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి బాబులు కలిసి శ్కాంకు పాల్పడినట్లు ఇడి నిర్ధారించింది. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులను పెద్దమొత్తంలో మళ్లించడంతో పాటు పలు ఫార్మా కంపెనీల తోపాటుగా రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. దేవికారాణి ఏకంగాగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రలో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని, పిఎంజె జ్యూవెలరీలో పెద్ద మొత్తంలో ఆమె నగలు కొనుగోలు చేసినట్లు ఇడి గుర్తించింది. ఆస్తుల తోపాటు నగల కొనుగోలు మొత్తం కూడా హవాలా ద్వారా చెల్లింపు జరిగినట్లుగా గుర్తించారు. ఇదిలావుండగా ఇఎస్‌ఐ శ్కాం కేసులో కీలక నిందితుడు కంచర్ల హరబాబుకు చెందిన ఓమ్ని మెడిలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న నాగరాజు ఇఎస్‌ఐ శాఖ లెజెండ్ ఎంటర్ ప్రైజెస్ నుంచి ఇఎస్‌ఐకి ఆర్డర్లు, బిల్లులు పొందిన రికార్డులను ఇడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రికార్డుల ప్రకారం లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత కృపసాగర్‌రెడ్డి అయినప్పటికీ ఆ సంస్థలో నాగరాజు తాను ఉద్యోగిగా పేర్కొని ఆర్డర్లు, బిల్లులు వసూలు చేసినట్లు ఇడి విచారణలోనూ తేలింది. ఈక్రమంలో మెడికల్ కిట్లు, వస్తు సామాగ్రి 400 రెట్లు అధిక మొత్తాలు వెచ్చించి కొనుగోలులో చేయడంలో కంచర్ల శ్రీహరితోపాటు మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు కీలక పాత్రపోషించినట్లు ఎసిబి సమర్పించిన నివేదికపై ఇడి మరోసారి దర్యాప్తు చేపడుతోంది. ఓమ్ని, లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్ వస్తుసామాగ్రిని డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌కు సరఫరా చేసినవి, సరఫరా చేయని బిల్లుల మొత్తాలను వసూలు చేయడంలో నాగరాజు ఇఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, పద్మ అవినీతి అక్రమాలకు పూర్తిస్థాయిలో సహకరించిన వైనంపైనా ఇడి ఆరా తీస్తోంది.

ఈ నేపథ్యంలో ఇఎస్‌ఐ కొనుగోలు మందుల, మెడికల్ కిట్లకు సంబంధించి 2017, 2018 సంవత్సరంలో రూ.12,84,96,600 మొత్తాల బిల్లులలో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉందన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇఎస్‌ఐలో ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై వస్తుసామాగ్రి కొనుగోలు చేశారని, ప్రభుత్వ సొమ్మును ఉద్దేశ్య పూర్వకంగా దుర్వినియోగం చేసినట్లు ఇడి విచారణలో తేలింది. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్ నుంచి మెడికల్ కిట్లు, వస్తు సామాగ్రి 400 రెట్లు అధిక మొత్తాలు వెచ్చించి కొనుగోలు చేసిన రికార్డులతో పాటు హోమోక్యూలో తయారైన డబ్లూబిసి క్యువెట్స్, గ్లూకోజ్ క్యువెట్స్, గ్లూకోజ్ ప్రతి యూనిట్‌కు వరుసగా రూ.11,800, రూ.1950 చొప్పున పంపిణీదారులకు సరఫరా చేసిన రికార్డులను ఇడి అధికారులు తనికీ చేశారు. ఈక్రమంలో 2017,2018 కాలంలో 6291 యూనిట్ల డబ్లూబిసి క్యూవెట్స్ హోమోక్యూ సరఫరా చేసి రూ.11,07,21,600 మొత్తాలను అధికంగా వసూలు చేయడంపై విచారణ సాగిస్తున్నారు.అదేవిధంగా (2017,2018)లలో 4500 యూనిట్ల హోమోక్యూ గ్లూకోజ్ క్యూవెట్లను సరఫరా చేసి 1,77,75,000 అధిక మొత్తాలను వసూలు చేయడం, ఆ రెండు వస్తుసామాగ్రికి సంబంధించి 2017, 2018 సంవత్సరంలో రూ.12,84,96,600 మొత్తాల బిల్లులను చెల్లించిన బిల్లులపై ఇడి విచారణ సాగుతోంది.

కాగా నిందితులు ఇఎస్‌ఐలో ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై వస్తుసామాగ్రి కొనుగోలు చేశారని, ప్రభుత్వ సొమ్మును ఉద్దేశ్య పూర్వకంగా దుర్వినియోగం చేసినట్లు ఇడి విచారణలో తేలింది. ఇఎస్‌ఐలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను అక్రమాలకు ఉసిగొలపడం, అక్రమార్జనకు ప్రభావితం చేశాడన్న అరోపణలపై నిందితులపై సెక్షన్ 7,13 (1)(సి)(డి), 7(ఎ)(సి) అవినీతి నిరోధక చట్టం 1988 రెడ్‌విత్ 7(ఎ), 13(1)(ఎ) 12,13(2) (పిసి యాక్ట్ 2018) 420, 120.బి, 34 ఐపిసి కింద కేసులు నమోదు చేసిన విషయం విదితమే. కాగా ఇడి సైతం ఈ శ్కాంలోని నిందితులను విచారించేందుకు నోటీసులు ఇచ్చేందుకు సన్నద్దమౌతున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News