Home ఆఫ్ బీట్ నవ్వుతూ బతకాలిరా..

నవ్వుతూ బతకాలిరా..

పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు, స్నేహితుల రోజులు ఉన్నట్లే జోక్స్‌కీ ఓ రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్ జోక్స్ డే. నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాల. ఒత్తిడిని తగ్గించే పరమౌషధం నవ్వు. ఆ నవ్వును తెప్పించేవే జోక్స్. జోక్ అంశానికి  పరిమితి అనేది ఉండదు. కొంతమంది కవులు దేన్నైనా జోక్‌గా మలుచుకుంటారు. ప్రతి వస్తువు మీద, మనుషి మీద, జంతువు మీద, ప్రొఫెషన్ మీద,… ఇలా ఏదీ జోక్‌కి అనర్హం కాదు. సినిమాలలో జోక్స్ అయితే ఇంకా పిల్లలు కంఠతా పట్టి సరదాగా చెబుతుంటారు. ఇప్పుడు టీవీల్లో కామెడీ షోలు కూడా పెరిగాయి. నవ్వుతెప్పించడంలో జోకుల  ప్రాముఖ్యతను గుర్తిస్తూ జూలై 1 న అంతర్జాతీయ జోక్ డే జరుపుకుంటున్నాం.

World-Laughter-Day

నిద్ర లేచిన దగ్గరినుంచి పడుకోబోయే వరకు రకరకాల ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉంటాం. కాసేపు సరదాగా ఎప్పుడు నవ్వుకున్నారు అంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. వాటికోసమే కామెడీ షోలు పెరిగాయా అనిపిస్తుంది. ఇదివరకు కామెడీ సినిమాల్లో వచ్చేవి. ఇప్పుడు టివిల్లో కామెడీ షోలు, స్కిట్‌లు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు నవ్వించడం కోసమే ప్రత్యేక ఛానల్స్ కూడా ఏర్పడడంతో వీక్షకులు హాస్యాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుస్తోంది. పాశ్చాత్య దేశాలలో అయితే ప్రతి వీకెండ్‌కి ఇలాంటి షోలు జరుగుతుంటాయి. స్టాండప్ కామెడీలని స్టేజీపైన నిలుచుని రకరకాలుగా  హాస్యాన్ని ప్రదర్శిస్తూ వీక్షకులను మెప్పించాలి.  ఇది కొంచెం కష్టమైన పనే అయినప్పటికీ ఇతర దేశాలలో ఎక్కువగా దీనినే ఇష్టపడేవారు. మన దేశంలో ఇంతకుముందు వీటిపైన తక్కువ ప్రోత్సాహం ఉండేది.  ఇప్పుడు బాగా పెరిగింది. మనదేశంలో ఇలాంటి షోలను మొదటగా ముంబయిలో నిర్వహించారు.

ఒకప్పుడు రేలంగి, జంధ్యాల, రమణారెడ్డి, రాజబాబు, అల్లురామలింగయ్య లాంటి సినీకళాకారుల సినిమా చూసినప్పుడు కడుపుబ్బ నవ్వుకోగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు వచ్చే కామెడీ వికృతంగా, ద్వందార్థాలతో ఉంటోంది.  ఒక జోకు విన్నా, చూసినా, చదివినా మనసులోంచి నవ్వురావాలి. మనసారా నవ్వుకోవాలి. కానీ ఇప్పుడు అలా జరగటం లేదు. కామెడీ కార్యక్రమాలు పెరిగినా కానీ హాస్యం తగ్గడం, ద్వంద్వార్థాలు పెరగడం, వినోదం తగ్గడం జరుగుతోంది. వైద్యశాలలో వైద్యులు లాఫింగ్ గ్యాస్ అనేది  ఉపయోగిస్తుంటారు. దీనిమూలంగా  నవ్వటానికే కాక  పేషంట్ కాన్షియస్‌గా ఉండటానికి ఉపయోగపడుతుంది.

Every Day Laughing in Life

లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ అని పిలుస్తారు. హ్యాపీనెస్ అనే దానికి కొలమానం కూడా ఉంది. ఈ కొలమానం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కరకంగా ఉంటుంది. ఏఏ దేశాల్లో ప్రజలు ఎంత సంతోషంగా ఉంటున్నారు అనేది ఐక్యరాజ్యసమతి ప్రకటించింది. మిగతా దేశాల కంటే నార్వే దేశ ప్రజలే ఎక్కువ ఆనందంగా ఉంటున్నారుట. ఆర్థికంగా బలంగా ఉన్నా సమస్యలు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండలేరు. ప్రభుత్వాలు, ప్రజలు అందరూ తమ పని తాము సక్రమంగా చేస్తే సంతోషంగా ఉండగలుగుతారని ఐరాస  సంతోష సూచీ తెలుపుతోంది. పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్,  నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే మనం వెనుకబడి ఉన్నాం. మనకంటే నేపాల్ పేద దేశం. కానీ అక్కడి ప్రజలు మనదేశ ప్రజలకంటే  సంతోషంగా ఉంటున్నారు. మనం కూడా ఈ విషయంలో అందరినీ దాటేద్దాం..