Home ఎడిటోరియల్ రక్షణ ప్రై‘వేటు’ను అడ్డుకుందాం!

రక్షణ ప్రై‘వేటు’ను అడ్డుకుందాం!

Defence

ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ భారతదేశంలోని 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, 52 డి.ఆర్.డి.ఓ.ల్యాబ్స్, డి.జి.క్యూ.ఏ., డి.జి.ఎ.క్యూ.ఎ., యం.ఇ. ఎస్, ఇ.ఎం.ఇ.తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుకు సంబంధించిన 430 యూనియన్లకు నాయకత్వం వహి స్తూ రక్షణరంగంలో స్వయం సమృద్ధికి పాటుపడింది.
ఏ దేశానికైనా ఆ దేశ రక్షణ అతిముఖ్యమైన అంశం. అందుచేతనే ప్రపంచ దేశాలన్నీ వాటి స్వంత రక్షణ పాలసీ కలిగి ఉన్నవి. అత్యధిక మిలటరీ సామర్థ్యం కల్గిన ప్రపంచ దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉన్నది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దేశీయ పరిజ్ఞానంతో పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నట్లయితే దేశాన్ని సురక్షితంగా కాపాడుతాయి. రక్షణరంగంపై ఖర్చుపెట్టే దేశాలలో భారతదేశం ప్రపంచంలో 5వస్థానంలో ఉన్నది. 2015 సం॥లో భారతదేశ జిడిపిలో 2.4శాతం రక్షణ రంగంపై ఖర్చుచేసింది. ఈ రంగంలో ఉపయోగించే టెక్నాలజీ చాలా క్లిష్టమైనది. ఖర్చుతో కూడుకున్నది. బ్రిటీష్ వారు దేశంనుండి వెళ్లిపోయిన తర్వాత భారతదేశం స్వంతరక్షణ సామర్థ్యం గురించి యోచించింది. అందుకనుగుణంగా 1948లో మొదటి పారిశ్రామిక తీర్మానంలో రక్షణ రంగానికి సంబంధించిన అన్ని అంశాలు చేర్చడం జరిగింది. దీనిలో దేశ సార్వభౌమత్యం, స్వావలంబన ప్రధానమైంది. తర్వాత 1956లో భారతదేశంలోని కీలకరంగాలైన రక్షణ, రైల్వే, ట్రాన్సుపోర్టు, అటామిక్ ఎనర్జీ మొదలగు రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే అభివృద్ధి చేయాలని విధాన నిర్ణయం గైకొన్నారు.
రక్షణ ఉత్పత్తి, రిసర్ట్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు డి.ఆర్.డి.ఓ. ల్యాబరేటరీలు:
41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, 52 రక్షణరంగ పరిశోధన సంస్థలు (డిఆర్‌డిఓ), డాక్‌యార్డులు, మొదలగునవి నిర్మించబడ్డాయి. వీటిని విస్తరించి పటిష్టపరచవల్సిన కేంద్ర ప్రభుత్వం, వాటిని నిర్వీర్యం చేసే పనులను చేపట్టింది. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఈ చర్యలను బి.జె.పి. ప్రభుత్వం మరింత ఉధృతంగా అమలు జరుపుతున్నది. ఇందులో భాగంగానే రక్షణ రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉత్పత్తిచేసే 182 వస్తువులను బహిరంగ మార్కె ట్లో కొనుగోలు చేయాలని నిర్ణయించింది.20వేల కోట్ల రూపాయలు విలువైన యుద్దనౌకల నిర్మాణాలను రిలయన్స్ లేదా ఎల్ అండ్ టి సంస్థలకు అప్పగించాలని నిర్ణయించుకున్నది. వీటి టెండర్లలో హెచ్‌ఎస్‌ఎల్ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు ఏవీ పాల్గొన
కూడదని షరతుపెట్టింది. ఇప్పటికే 220 కంపెనీలకు లైసెన్సులు జారీ చేసింది. 35వేల కోట్ల రూపాయిలతో 12 యుద్ధనౌకలను (స్వీపర్లను) దక్షిణకొరియా నుండి కొనడానికి నిశ్చయించింది. లక్షా 40వేల కోట్ల విలువైన యుద్ధ విమనాలను అమెరికా లేదా యూరప్ దేశాల నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
లాభాల కోసం ఏ పనికైనా పెట్టుబడిదారులు తెగబడతారన్నది జగమెరిగిన సత్యం. వీరు తయారు చేసిన ఆయుధాలు లాభాల కోసం ఎవరికైనా అమ్ముకుంటారు. ఇప్పటికే ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో ఆయుధాలు చూస్తున్నాం. రేపు అమెరికాలోలాగ స్కూల్ పిల్లల సంచులలో పెన్‌లకు బదులు గన్‌లు చూడవల్సి వస్తుంది. పెట్టుబడిదారులకు లాభాలు రావాలంటే వారు తయారు చేసే ఆయుధాలు విరివిగా అమ్ముడు పోవాలి. దానికి యుద్ధాలు కావాలి. ఆ యుద్ధాలను అమెరికా ఏ రకంగా సృష్టించిందో ఆప్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా, సిరియా, ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలను చూస్తే అర్ధం అవుతుంది. మన ప్రక్కనున్న పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్మడంతో పాటు ఉగ్రవాద మూకలను ఏ విధంగా మనదేశం పైకి ఎగదోస్తుందో నిత్యం మనంచూస్తు న్నాం.
ప్రైవేటు కంపెనీలు అద్భుతంగా పనిచేస్తాయని ప్రభుత్వ నేతలు ఊదర గోడుతుంటారు. ఇదే నిజమైతే దేశవ్యాప్తంగా 5లక్షల పైబడిన భారత, ప్రైవేటు కంపెనీలు ఎందుకు మూతపడ్డాయో చెప్పాలి. విజయమాల్య వంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయలను ఎందుకు బ్యాంకులకు ఎగనామం పెట్టారో సమాధానం ఇవ్వాలి.
రాజకీయ నాయకులకు, పెద్దపెద్ద అధికారులకు ఆయుధ వ్యాపారులు భారీముడుపులు సమర్పించుకుంటారు. ఈ కమీషన్ల కోసమే ప్రైవేటు ఆయుధ పరిశ్రమలను పాలకవర్గాలు ప్రోత్సాహిస్తున్నాయి. భోపోర్సు తుపాకుల నుండి వెస్టా హెలికాప్టర్ల కొనుగోలు వరకు మనం చూశాము. చివరికి శవ
పేటికల కొనుగోలులోనూ గతంలో యన్‌డిఎ ప్రభుత్వ నేతలు కమీషన్లకు కక్కుర్తిపడి తమ దేశభక్తి ఎంతటిదో ప్రదర్శించుకున్నారు. రక్షణరంగం అనగానే రహస్యం అని ప్రభుత్వం చెప్తుంది. ఈ రహస్యం మాటున వేలకోట్ల ప్రజాధనానికి జవాబుదారీతనం లేకుం డా పోయింది.
ప్రభుత్వ ఆధీనంలోని ఇస్రో ఒకసారి 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోనికి పంపి ప్రపంచానికి మన సత్తా చాటింది. అటువంటి సత్తా మనదేశంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, డిఆర్‌డిఓలకి ఉన్నది. కావలసిందల్లా వాటికి తగిన నిధులులిచ్చి వాటి పరిశోధనలకు దోహదపడే దృఢసంకల్పం ప్రభుత్వానికి ఉండాలి. మన డాక్‌యార్డులు ఎక్కడో తయారై వచ్చిన యుద్ధనౌకలను ఎటువంటి శిక్షణ ఇవ్వకపోయినా రిపేర్లు చేసి తమ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాయి. మన రక్షణరంగంలో శాస్త్రవేత్తలు, మేధావులు, అధికారులకు, సుశిక్షితమైన కార్మిక వర్గానికి కొదువలేదు. వీరి నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మన రక్షణరంగాన్ని నిలబెట్టి దేశరక్షణను కంటికి రెప్పలాగ కాపాడుతారు.
“మేకిన్ ఇండియా” పేరుతో సర్వసంపదలను తనకు కావాల్సిన అదానీ, అంబానీ లాంటి బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నది బిజెపి ప్రభుత్వం. రక్షణ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులుగా దేశాభిమానులుగా ఈ రంగంలో జరుగుతున్న దుర్మార్గాన్ని అర్థంచేసుకున్న వారుగా ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 3 తారీఖు నుండి న్యూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము. ఇప్పటికి 27 రోజులు గడిచింది. దేశ నలుమూలాల నుండి రక్షణ శాఖలో పనిచేసే ఎఐడిఇఎఫ్ నాయకులు కార్యకర్తలు ప్రతిరోజు 100 నుండి 150 సంఖ్యలో పాల్గొంటున్నారు. బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీల జాతీయ నాయకులు ధర్నా శిబిరానికి వచ్చి వారి మద్దతు తెలుపుతూ ఈ పోరాటం ఒక్క రక్షణ శాఖలో పనిచేస్తున్న 4లక్షల ఉద్యోగుల సమస్య కాదు మొత్తం ఈ దేశానిది. 125 కోట్ల ప్రజల రక్షణసమస్య అని వివరిస్తున్నారు. ప్రభుత్వచర్యను నిరసిస్తున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో సిపిఐ, సిపియం, కాంగ్రెస్, ఇతర పార్టి ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించటం జరిగింది. ఈ నిరసన పోరాటం ఆగస్టు 14 తారీఖు వరకు కొనసాగుతుంది. ఢిల్లీ పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ అన్నిటిని అధిగమించి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆం.ప్ర. రక్షణ శాఖ ఉద్యోగులైన మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌లో డిఆర్‌డిఓ ల్యాబ్స్, విశాఖలోని నేవీ, ఎన్.ఎస్.టి.ఎల్ చెందినవారు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ రిలే నిరాహారదీక్షలు జరుగుతున్న సందర్భంగానే ఒకసారి రక్షణశాఖ మంత్రి, ఆ శాఖ సెక్రటరీలతో సమావేశం జరిగింది. అన్ని అంశాలు వివరించడం జరిగింది. అయినా ఎలాంటి ఖచ్చితమైన హామీ వారి నుండి రాలేదు. అందుచేత ఆగస్టు 14 తర్వాత ఎ.ఐ.డి.ఇ.ఎఫ్. వర్కింగ్ కమిటీ సమావేశమై నిరవధిక సమ్మెకు సన్నద్ధమవుతుంది.