Home ఎడిటోరియల్ వ్యవసాయానికి ఎప్పుడూ సమస్యలే

వ్యవసాయానికి ఎప్పుడూ సమస్యలే

Which Crop Cultivation Asked by Farmer in Telangana,

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతుల ఆందోళనను బిజెపి పాలిత రాష్ట్రాల సమస్య అనే రాజకీయ కోణం నుంచి చూసి బిజెపి వాదులు ఆందోళన చెందటం, ఆ పార్టీ వ్యతిరేకులు సంతోషించటం కన్పిస్తున్నది. ఈ ధోరణి రాజకీయంగా సరైనదో కాదో గాని, సమస్య స్వభావం రీత్యా మాత్రం పెద్ద పొరపాటవుతుంది. ఎందుకంటే, వ్యవసాయ సమస్యలు మన దేశంలో మౌలికమైనవి. శతాబ్దాలుగా ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం ఉండేవి. వాటిని పరిష్కరించటంలో స్వాతంత్య్రానంతరం కేంద్రంలోని అన్ని పార్టీల ప్రభు త్వాలు, అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీల పరిపాలనలు విఫలమయ్యాయి. రైతుల అసంతృప్తి లేని రాష్ట్రమంటూ గత 70సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో లేదు. ఈ రోజున కూడా పరిస్థితి అదే. అటువంటి స్థితిలో మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతుల ఆందోళనను అవి కేవలం బిజెపి రాష్ట్రాలు అనే పద్ధతిలో చూడటం సంకు చిత రాజకీయం అవుతుంది. ఇది పార్టీలకు అతీతంగా అంద రూ కలిసి ఆలోచించి అదుపు చేయవలసిన సమస్య.
జరుగుతున్న దానిపట్ల సంతోషించటం ఆ పార్టీ వ్యతిరేకులలో కనిపిస్తున్నదేగాని, అది రాజకీయంగా సరైనదోకాదో అన్న సందేహాన్ని పైన వ్యక్తపరచాము. ఆ సందేహం సరైనదే. ఎందుకంటే, అక్కడ సమస్య తలెత్తటం బిజెపిని ఇరుకున పెడుతుందని, అది తమకు లాభిస్తుందన్నది బిజెపి ప్రత్యర్థుల ఆశా భావం. మళ్లీ ఎన్నికలలో ఈ అంశం బిజెపికి ఎంత నష్టం చేసేదీ లేనిదీ ఇంత ముందుగా చెప్పటం సాధ్యం కాదు. గతంలో ఇంతకన్న తీవ్ర సమస్యలు తలెత్తినా అవి ఎన్నికల వేళకు పరిష్కారం కావటమో, రైతులు ఇతరత్రా సంతృప్తి చెందటమో, రైతులలో ఒక వర్గం ఆగ్రహించినా ఇతర వృత్తులవారు సంతోషంగానే ఉండి అదే పార్టీని తిరిగి గెలిపించటం జరిగిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అది బిజెపి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇదేమీ కాకుండా సదరు పార్టీ ఓడినా ఓడవచ్చుగాక. కాని అంతమాత్రాన తాము లాభ పడినట్లు ఎవరైనా సంతోషిస్తే అటువంటి హ్రస్వదృష్టికి మనం విచారించవలసి ఉంటుంది.
వ్యవసాయ సమస్యలు మౌలికమైనవని అనుకున్నా ము గనుక, ఒకవేళ అప్పటి అధికార పార్టీ ఓడి మరొకరు ఆ స్థానంలోకి వచ్చినంత మాత్రాన అవి సమసి పోయేవి కావు. సమస్య యధావిధిగా పెచ్చరిల్లుతూనే ఉంటుంది. కొత్త అధికార పార్టీని చుట్టుకుంటుంది. ఇది ఊహా గానం కాదని గత కాలపు పరిణామాలు తెలిసినవారికి చెప్పనక్కర లేదు. ఇందుకు కారణమేమిటి? ఒక్క మాట లో చెప్పాలంటే మన రాజకీయ పార్టీలలో ఏ ఒక్కటి కూడా వ్యవసాయరంగ సమస్యలను సమూలంగా పరిష్కరించగలది కాదు. పరిష్కరించటం సాధ్యమా కాదా అన్నది ఒక ప్రశ్న కాగా, అట్లా చేసే ఉద్దేశంవారికి అసలు ఉందా అనేది రెండవ ప్రశ్న.
ఈ రెండు ప్రశ్నలకు సంబంధించి కూడా మన పార్టీలు బోనెక్కవలసిందే. అటువంటి పరిష్కారం అసాధ్యమనే పరిస్థితి ఒక వాస్తవం కాగా, వారికి అసలు ఆ ఉద్దేశం లేదన్నది మరొక వాస్తవం. ఒక విధంగా ఇదే పరిస్థితి ప్రపంచంలోని వర్థమాన వ్యవ సాయిక సమాజా లన్నింటా కన్పిస్తుంది. అందువల్ల మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌లనుగాని, మరొక దానిని గాని ఈ దృష్టినుంచి చూడవలసి ఉంటుంది. ఇపుడు కొద్దిగా వివరాలు చెప్పుకుందాము.
ఆర్థిక వ్యవస్థలు పారిశ్రామిక-వ్యాపార రంగానికి అనుకూలంగా, వ్యవసాయానికి ప్రతికూలంగా ఉండటం సుస్థిర వ్యవసాయ సమాజాలు ఏర్పడి ఆ సంపదలనుంచి పారిశ్రామిక-వ్యాపార వర్గాలు పుట్టుక వచ్చినపుడే మొదలైంది. ఇది క్రీస్తుపూర్వపు ఆరంభ దశ కాగా అది మధ్యయుగం నాటికి మరింత పెరుగుతూ వచ్చింది. పారిశ్రామిక విప్లవ ప్రభావంతో ఆధునిక కాలంలో మహాతీవ్రమై ఇక తిరుగులేని మలుపు తీసు కుంది. దీనంతటికి ప్రాతిపదికగా ఆర్థిక సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఎపుడైనా సరే వ్యవసాయ రంగంలో మిగులు సంపదలు తక్కువగా ఉంటాయి.
పారిశ్రామిక-వ్యాపార రంగాలలో ఎక్కువ. వ్యవ సాయ ఉత్పత్తులు ఆహార వినియోగానికి మాత్రమే ఉపయోగపడేవి కాగా, పారిశ్రామిక ఉత్పత్తుల విని యోగ వైవిధ్యత అంతులేనిది. ప్రకృతి వనరుల విని యోగం వ్యవసాయం కన్నా పరిశ్రమలలో చాలా ఎక్కువ. రాజకీయ వర్గాలు, ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, సంపన్నులు, నగర ప్రజలు, వివిధ పరిపాలనలు, సాహిత్య కళా సంస్కృతులు మొదలైన ఛప్పన్నారు రంగాలకు ధనం కావాలి. ఆ ధనం లభించేది పారిశ్రామిక-వ్యాపార రంగాలతో పోల్చితే వ్యవసాయం లో చాలా స్వల్పం. కనుక తమకుగల ధన బలం వల్ల పారిశ్రామిక-వ్యాపార రంగాలు రాజకీయా లను, ప్రభుత్వాలను, ఇతర రంగాలను శాసించటం మొదటి నుంచి ఇప్పటి వరకూ ఉంది. అదే కారణంగా ప్రభుత్వాల విధానాలు, ఆచరణలు ఎల్లప్పుడూ వ్యవ సాయాన్ని పారిశ్రామిక-వ్యాపార రంగాలకు ఉపయోగ పరచే విధంగా ఉంటూ వస్తున్నాయి. అదే మనకు ఈ రోజున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కన్పిస్తున్నది.
ఈ పరిస్థితిని మార్చటమంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ ను, దానిని నియంత్రించే ఆలోచనా సూత్రాలను, వేల ఏళ్లుగా గల స్థితిని తలకిందులు చేయబూనటమన్న మాట. ఈ పనికి ఎవరైనా పూనుకుంటే ఆ ప్రభుత్వం వెంటనే పతనమవుతుంది. వ్యవసాయానిది పై చేయి కాకపోయినా కనీసం దుర్భరం కాకుండా, సహేతుక మైన మేరకు లాభసాటి చేయవచ్చు కదా అనే ప్రశ్న ఉంది. నిజమే. కొన్ని దశలలో కొన్ని పార్టీల ప్రభుత్వా లు, ముఖ్యంగా రైతు పక్షపాతి అని తమకు తాము చెప్పుకున్నవి, అటువంటి ప్రయత్నాలు చేయగలమని చెప్పాయి. వ్యవసాయానికి పెట్టుబడులను, సబ్సిడీలను పెంచటం, మద్దతు ధరలు హెచ్చించటం, వ్యవసాయ వనరులపై సుంకాలు తగ్గించటం, యాంత్రీకరణకు సహకరించటం, ఇతర చర్యలు తీసుకోవటం వంటి పనులు వారు చేసారు కూడా. కాని ఎంత చిత్తశుద్ధితో చేసినా ఇవి పరిస్థితిని ఒక పరిమితిలో మెరుగుపరచాయి గాని, తలకిందులు చేయలేదు. కనీసం గణనీయంగానూ మార్చలేదు. తగినంత మార్పు అంటూ జరిగితే అది వాణిజ్య పంటలు, పెద్ద రైతుల విషయంలో కన్పించింది. అయితే ఆ సరికి వారు రైతు స్వభావాన్ని కోల్పోయి పెట్టుబడి దారీ రైతులుగా మారి సాధారణ రైతాంగానికి దూరమయారు. అంతేకాదు, తమ వ్యవసాయ లాభా లను స్వయంగా తాము, లేదా తమ సంతానం పరిశ్రమలు-వ్యాపారాల వైపు మళ్ళించటంతో వారు వ్యవసాయ దారులు కావటమన్నది నామకార్థపు విషయమైంది. సారాంశంలో వారు పారిశ్రామిక-వ్యాపార వర్గాలలో భాగమయారు. ఇది అంతిమ విశ్లేషణలో వ్యవసాయ రంగాన్ని, అశేషమైన రైతాం గాన్ని, రైతు కూలీలను, ఈ రంగంపై ఆధార పడిన గ్రామీణవృత్తుల వారిని ఎప్పటివలెనే సమస్యల సుడిగుండంలో మిగిల్చింది.
ఈ గ్రామీణ రంగాల వారికి ఓట్లు ఉండట మన్నది ఒక్కటే పాలకులను వారి పట్ల కొంత సానుభూతి నటించేట్లు చేస్తున్నది. అందుకు మన దగ్గరే ఇటీవలి కాలంలో కన్పించిన ఉదాహరణలు 2004 ఎన్నికలకు సరిగా ముందు అప్పటి టిడిపి ముఖ్యమంత్రి రైతులకు ప్రకటించిన ‘కోటివరాలు’, ఎన్నికలకు ముందు వెనుక లుగా అప్పటి కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డి తీసు కున్న చర్యలు. జాతీయ స్థాయి లోనూ ఆ పార్టీ బిజెపి నుంచి రైతులను తన వైపు ఆకర్షించేందుకు ఇదే తరహా హామీ లు ఇచ్చింది. అంతమాత్రాన మౌలిక పరిస్థితులను వారె వరూ మార్చరు కదా. కనుక ఆ తర్వాత ఎన్నేళ్లు గడిచినా వ్యసాయరంగం అదే హీనస్థితిలో కొనసాగుతూ వస్తు న్నది. రైతుల దీనావస్థలో మార్పు లేకుండా పోయింది. అందుకు భిన్నంగా ఇదే పన్నెండేళ్ల కాలంలో పారిశ్రామి క-వ్యాపార రంగాలవారు మరింత ధగధగలాడారు.
సమంజసం, న్యాయం కాకపోయినా, ఎంత చేదు గా తోచినా, ఒక నిజం ఏమంటే, రైతాంగం వీలై నంత సంఘటితమవుతూ, వీలైనంత వత్తిడులు చేస్తూ, ప్రభుత్వాల నుంచి వీలైనంత సాధించుకునేందుకు ప్రయత్నించటం మినహా మరొక మార్గం కన్పించటం లేదు. పారిశ్రామిక-వ్యాపార రంగాలతో వారికి సమాన స్థితి అనేది సాధ్యమయేది కాదు. ఇదొక విషాదకరమైన వాస్తవం.