Home జిల్లాలు ఎవరికి వారు పంచుకున్నారు!

ఎవరికి వారు పంచుకున్నారు!

ఆదాయం పెంపుపట్టని పాలకవర్గం
కోట్ల రూపాయలు నష్టపోతున్న వైనం
ఉన్నతాధికారుల ఆరా?

sharedమిర్యాలగూడ అర్బన్ : కంచే చేను మేసిన చందంగా తయారైంది మిర్యాలగూడ మున్సిపల్ పాలకవర్గం అధికారుల తీరు. ఒకవైపు మున్సిపాల్టీలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో మున్సిపాలిటీ తయారుకాగా వచ్చే ఆదాయాన్ని పెంచుకుని మెరుగైన పాలన అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందిన కాడికి దండుకొని మున్సిపాలిటీని అప్పుల ఊబిలో కూరకపోయేలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీకి ఆస్తిపన్నుతో పాటు మంచినీటి సరఫరా పన్ను, నూతన భవనాల నిర్మాణం పన్ను, వినోదపుపన్ను రూపంలో ఆదాయం సమకూరుతుండగా మున్సిపాలిటీకి నిత్యం ఆదాయం సమకూర్చే ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయానికి ప్రధాన వనరుగా ఉంది. అలాంటి ప్రధాన వనరు అయిన ఆస్తుల అద్దె వ్యవహారం గత దశాబ్ద కాలం నుంచి న్యాయశాఖ చిక్కుముడిల పేరుతో తాత్సారం చేస్తుండటంతో మున్సిపాలిటీకి రావల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. అద్దెకుంటున్న వారు కోర్టు స్టే తెచ్చి కొనసాగిస్తుండగా స్టేను తొలగించి తిరిగి టెండర్లను పిలచి పెద్దమొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం ఉంటున్న అద్దెదార్లతో కుమ్మక్కై పాలకవర్గ సభ్యులు, అధికారులు లక్షల రూపాయలను దండుకున్నారు. దీంతో నెలకు రూ. 10 లక్షలకు పైగా ఆదాయం సమకూరే మున్సిపల్ కాంప్లెక్స్ వ్యవహారం రచ్చరచ్చ అయింది. 2001లో నిర్మించి అద్దెకిచ్చిన ఎన్‌టిఆర్ మున్సిపల్ కాంప్లెక్స్‌లో 90 దుకాణాలకు గానూ 88 అద్దెకు కొనసాగుతుండగా ఆధాయం మాత్రం 25 లక్షల రూపాయలు మాత్రమే ఏడాదికి సమకూరుతుంది. మిర్యాలగూడ పట్టణ నడిబొడ్డున ఉన్న ఎన్‌టిఆర్ మున్సిపల్‌కాంప్లెక్స్ ద్వారా ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను బట్టి రూ. కోటికి పైగా ఆధాయం సమకూరాల్సి ఉన్నప్పటికీ న్యాయ స్థానం చిక్కుముడి పూచి చూపి 80 లక్షలకు పైగా ఆధాయాన్ని పాలకవర్గ సభ్యులు, అధికారులు స్వాహా చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో తీర్మాణం చేసి వసూలుకు చర్యలు తీసుకునే సమయంలో ప్రస్తుతం ఎన్‌టిఆర్ మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉంటున్న అద్దెదార్లు యధాతద స్థితి కొనసాగేలా మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు, అధికారులకు లక్షల్లో ముడుపులను మట్టుజెప్పినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. తక్షణం పాత అద్దెదార్లను తొలగించి రీటెండర్ జారీ చేస్తే కోటిన్నర వరకు ఆధాయం సమకూరె అవకాశం ఉండగా లక్షల్లో చేతులు మారడంతో రీ టెండర్‌కు అవకాశం లేకుండా పాతవాటినే కొనసాగేలా అంతర్గత ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ఎన్‌టిఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ అద్దె విషయమై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తుంది. దృష్టి సారించిన అధికారులు సమగ్రవిచారణ జరిపి మున్సిపల్ కాంప్లెక్స్ అద్దె విషయమై విచారణ జరిపే పనిలో ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని మిర్యాలగూడ పట్టణ ప్రజలు కోరుతున్నారు.