Home వరంగల్ ఊరు కోసం ఓటేద్దాం..

ఊరు కోసం ఓటేద్దాం..

 Everybody uses the right to vote in the Sarpanch election

మన తెలంగాణ/ ఎల్కతుర్తి : “రాము, సోము ఇద్దరు మిత్రులు. రాముది ఎల్కతుర్తి మండల కేంద్రం, సోముది హైదరాబాద్. కానీ ఎల్కతుర్తిలో ఉండే వాళ్ల అమ్మమ్మ ఇంటికి చిన్నప్పటి నుంచే వచ్చి చదువుకుంటున్నాడు. వీరిద్దరూ కలిసి ఎల్కతుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. తదనంతర చదువుల కోసం తలోదిక్కు వెళ్లారు. అయితే రాముకు చదువు అబ్బాక ఎల్కతుర్తిలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు. సోము మాత్రం పై చదువులు చదువుకుంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అలా వారి జీవితాలు గడిచి 25 ఏళ్లకు చేరాయి. ఇంతలో సోము తన అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో చూసేందుకు కుటుంబ సమేతంగా ఎల్కతుర్తికి వచ్చాడు. అంతే ఊరును చూసి ఆశ్చర్యపోయాడు. ఊరు తాను చిన్నతనంలో చదువుకున్న రోజుల్లో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఎంత మాత్రం మార్పు కనిపించలేదు.తన చిన్ననాటి స్నేహితుడు రామును కలుసుకున్న సోము అదేందిరా ఊరు అట్లనే ఉన్నది. ఏం మాత్రం మారలేదు. కొన్ని కొన్ని ఊళ్లు సూత్తాంటనే మారుతాన్నయి. ఈ ఊరెందుకురా ఇలానే ఉండిపోయింది అని అడిగాడు. దీంతో రాము సమాధానమిస్తూ.. మా ఊళ్లో లీడర్లు మాత్రమే బాగుపడుతరు. వాళ్లు సొంత అభివృద్ధి చూసుకుంటారు. అందుకే మా ఊరు గిట్ల పాడుబడ్డది. అని నిట్టూరుస్తూ చెప్పాడు. పైసలు తీసుకుని ఓటేస్తే గిట్లనే ఉంటదిరా.. ఓట్ల కోసం పైసలు, మందు ఎగజల్లుడుతోనే సంబురపడి ఓటేస్తే ఇగో గిలాంటి లీడర్లే వస్తారు. వాళ్ల బాగు వాళ్ళు చూసుకుని పోతారు. మనలో మార్పు రావాలె.. అది మన నుంచే మొదలు కావాలె.. అట్లాంటప్పుడే ఊళ్లు బాగుపడుతవి. ఊళ్లల్ల ఉండే జనం బాగుపడతారు.. అని చెప్పి ఇప్పటికైనా మారండి, మార్పు తీసుకురండి అని చెప్పి సోము వెళ్లిపోయిండు”..
ఈ కథంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. లీడర్లు బాగుంటే.. ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే.. జనం బాగుంటారు. జనం సహకరిస్తే.. గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒకదానికి ఒకటి అనుసంధానంగా ఉంటేనే ఆదర్శ గ్రామంగా ఎదుగుతుంది. ఇన్నిటికీ మూలం లీడర్. ఆ లీడరే అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడితే.. ఇంకేముంది నిధులన్నీ పక్కదారి పడుతాయి. అక్రమార్కులు రాజ్యమేలడంతో అభివృద్ధి పడకేస్తుంది. దీంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న నానుడి మళ్లీ ముందుకొస్తుంది.
ఊరు బాగు కోసం ఒటేద్దాం..
మరో నెల లేదా నెలా పదిహేను రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు రానున్నాయి.. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు కసరత్తులు పూర్తి చేస్తూ ఎన్నికల సూచనలు, ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతుండగా ఇంతకు ముందున్న రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు రానున్నాయో స్పీడుగా లెక్కలు కడుతున్నారు. గత నాలుగేళ్ల పాటు స్థబ్దుగా ఉన్న లీడర్లంతా అంతే స్పీడుగా చాపకింద నీరులా తమ ఉనికిని చాటుకోవడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో యువత ఊరు బాగు కోసం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికలు అనగానే ఎవడో గెలుస్తాడు. నా కెందుకు అనే ఆలోచన చేస్తుంటారు. కానీ ఆ గెలిచే నాయకుడు అదే గ్రామానికి ఐదేళ్ల పాటు మొదటి పౌరునిగా చెలామణి అవుతాడన్న విషయాన్ని యువత, జనం ఆలోచించడం లేదు. ఊరును బాగు చేసుకోవాలంటే సరైన లీడరు కావాలి. సరైన లీడరును ఎన్నుకోవాలంటే ఎన్నికల్లో పాల్గొనాలి. తానొక్కడిని ఓటు వేయకుంటే ఏమౌతుందిలే అనే నిర్లక్షపు స్వరాన్ని మదిలో నుంచి తొలగించాలి. ఓటు హక్కును నూటికి నూరు శాతం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఊరు బాగుకోసం బరిలో నిలవాలి. మన ఓటును సద్వినియోగం చేసుకోవాలి.
ప్రలోభాలకు లొంగొద్దు
ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థిపై గెలుపొందాలనుకునే వారు అమూల్యమైన ఓటు హక్కును కలిగి ఉన్న వారిని అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తుండడం మనం చూస్తున్నాం. కేవలం డబ్బు, మద్యమే కాకుండా ఓటరుకు ఉన్న బలహీనతలను సొమ్ము చేసుకోవాలని తహతహలాడుతుంటారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే ప్రతీ ఒక్కరూ నిస్వార్థంగా తమ ఓటును వేయ్యాలి. ఊరి బాగు కోసం, ఊరి జనం మేలు కోసం తపనపడే నాయకున్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు మద్యం ఏరులై పారేలా చేస్తారు. మద్యం మత్తులో ముంచేస్తారు. అంతేగాకుండా డబ్బులు ఆశ చూపి తమ వైపు అకట్టుకునేలా చేస్తారు. ఇలాంటి ప్రలోభాలకు లొంగామో ఇక ఐదేళ్ల పాటు వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. ఇలా ప్రలోభాలకు గురి చేసి ఎన్నికైన నాయకులు వారు పెట్టిన సొమ్మును సంపాదించుకోవడానికి గ్రామ అభివృద్ధి కోసం వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న కొంత మంది సర్పంచులు తాము ఎన్నికల్లో గెలిచేందుకు పెట్టిన సొమ్మును ఇంకెప్పుడు వసూలు చేసుకుంటామని బాహాటంగానే చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నాయకున్నా మనం ఎన్నుకునేది అని ఆలోచించాలి. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది.
కులాన్ని చూసి ఓటె య్యొద్దు :
గ్రామాన్ని అభివృద్ధి చేయగలడా? లేదా? అని మాత్రమే ఆలోచించాలి తప్ప ఈ వ్యక్తి మా కులం వాడు. అతడు వేరే కులం వాడు అని తారతమ్యాలు చూపించి అసమర్ధుడైన వ్యక్తికి పట్టం పట్టవద్దు. కులాన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకునే వారిని అధమ స్థానంలో ఉంచాలి. అభివృద్ధికి కట్టుబడి ఉన్న వ్యక్తిని నాయకున్ని చేయాలి. చదువు ఉండి, ప్రజా సమస్యలపై అవగాహనతో పరిష్కారం చూపుతూ బలమైన గళం వినిపించే నాయకున్ని రాబోవు ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నుకోవాలి. అతడు ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తయినా కావచ్చు. ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ప్రతీ విషయానికి ఇతరులపై ఆధారపడుతూ పదవిని కొనసాగించే వ్యక్తికి, ప్రలోభాలకు గురి చేసే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో పక్కన పెట్టల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేద్దాం :
గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందుతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉండాలంటే సమర్థవంతమైన ప్రథమ పౌరుడు ఎంతైనా అవసరం. గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పార్టీలను, పాత నాయకులను పక్కన పెట్టాలి. అభివృద్ధి కోసం కట్టుబడి ఉండే యువతరం ఎన్నికల బరిలో నిలవాలి. ఒక్క రూపాయి పంచకుండా, ఒక్క రూపాయి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు యువత అండగా నిలవాలి. వారి ప్రచారంలో కీలక పాత్ర పోషించాలి. ప్రజలను చైతన్యవంతులను చేయాలి. గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలి. ఈ మార్పు మననుంచే ఎందుకు కాకూడదని ఆలోచించండి. ఈ సారి ఈ విధానాన్ని ఆచరణలో పెట్టండి. మార్పు తప్పకుం డా వస్తుంది.