Home ఎడిటోరియల్ చైనాతో మరో పేచీ!

చైనాతో మరో పేచీ!

Evolution of Ladakh is now matter of concern

 

చైనాతో తాజాగా లడఖ్ తూర్పు ప్రాంతాన తలెత్తిన సరిహద్దు పేచీ చినికి చినికి గాలివానగా మారగల ప్రమాద సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నప్పటికీ సమీప గతంలోని అనుభవాలను బట్టి చూసినప్పుడు ఇది కూడా త్వరలో చల్లారిపోతుందనే ఆశ కలుగుతుంది. లడఖ్ సరిహద్దులోని గాల్వన్ లోయలో స్థానికుల సౌకర్యం కోసం మన సైన్యం వేస్తున్న రోడ్లను చైనా దళాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దళాల మధ్య బాహాబాహీ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇరువైపులా స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. దీనితో రెండు దేశాలు అక్కడ సైన్యాల మోహరింపును పెంచాయి. ఇదే సమయంలో సిక్కిం సరిహద్దుల్లో కూడా పేచీ వాతావరణం తలెత్తింది. లడఖ్ పరిణామమే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. 1962 నాటి సరిహద్దు యుద్ధం తర్వాత భారత, చైనాల మధ్య ఇంత వరకు మరో యుద్ధం సంభవించకపోడం రెండు దేశాల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలకు నిదర్శనమని గట్టిగా చెప్పుకోవచ్చు. కాని ఇటువంటి ఘర్షణ సందర్భాలు తలెత్తుతూ ఉండడం ఇరుగు పొరుగు అతి పెద్ద దేశాల మధ్య శాశ్వత శాంతి నెలకొనడంపై అనుమానాలను కలిగిస్తున్నది. గత ఏడేళ్లలో చైనాతో గల ఉత్తర సరిహద్దులలో చోటు చేసుకున్న నాలుగో వివాదం ఇది.

లడఖ్ ఉత్తర ప్రాంతంలోని దేప్ సంగ్ మైదానం వద్ద 2013లో ఒకసారి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తూర్పు లడఖ్‌లోని చుమార్ వద్ద 2014లో మరో పేచీ సంభవించింది. 2017లో భూటాన్ చైనా సరిహద్దులకు ఆనుకొని ఉన్న డోక్లాం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ మూడు సందర్భాల్లోనూ రెండు దేశాల అగ్ర నేతల మధ్య జరిగిన భేటీలు సరిహద్దుల్లో రగిలిన మంటలను ఆర్పడంలో ఉపయోగపడ్డాయి. డోక్లాంలో 73 రోజుల పాటు కొనసాగిన ప్రతిష్టంభనకు ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సాగిన సుహృద్భావ చర్చలే తెర దించాయి. వీరిద్దరూ 2018లో అక్కడి వూహాన్‌లోనూ గత ఏడాది మన చెన్నై నగరం వద్ద జరిపిన శిఖరాగ్ర చర్చలు ఎన్నో ఆశలు కల్పించాయి. రెండు దేశాల మధ్య శాశ్వతమైన శాంతియుత వాతావరణం స్ధిరపడగలదనే విశ్వాసాన్ని పాదుకొల్పాయి. ప్రస్తుత ఉద్రిక్తతలు వాటిని బూడిదలో పన్నీరుగా నిరూపిస్తున్నాయి. అప్పుడప్పుడు తలెత్తే విభేదాలు పెరిగి వివాదాలకు, ఘర్షణలకు దారి తీయకుండా చూసుకోవాలని మోడీ జీల మధ్య కుదిరిన అవగాహన ఆచరణకు నోచుకోలేదని స్పష్టపడుతున్నది.

రెండు దేశాల మధ్య స్పష్టమైన సాధికారికమైన సరిహద్దు లేకపోడం, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) విషయంలో అభిప్రాయ భేదాలు తొలగకపోడమే తరచూ ఉద్రిక్త ఘటనలకు దారి తీస్తున్నది. లడఖ్ ఉదంతం రగులుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సైనిక పెద్దలతో విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక చర్చలు జరిపారు. అలాగే చైనా కూడా తన చుట్టూ ప్రస్తుతం అలముకుంటున్న వాతావరణం నేపథ్యంలో యుద్ధానికి సన్నద్ధతను పెంచాలని తన సైన్యానికి సూచించింది. వాస్తవానికి కరోనా జన్మభూమి కావడం వల్ల చైనా అమెరికా నుంచి విమర్శలకు, ఒత్తిళ్లకు గురవుతున్నది. అమెరికా మనకు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూనే ఈ వివాదాన్ని తన ప్రయోజనాలకు వాడుకోజూస్తున్నట్టు స్పష్టపడుతున్నది. తనకు అవకాశమిస్తే మధ్యవర్తిత్వం నెరపుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన గమనించదగినది. గతంలో కశీర్ విషయంలో కూడా ఆయన తగుదునమ్మా అంటూ మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానని పదేపదే ప్రకటించి భంగపడ్డాడు. ఎంతో పరిణతి, అభివృద్ధి సాధించిన భారత, చైనాలు అటువంటి అవకాశం అమెరికాకు ఇవ్వబోవని విశ్వసించవచ్చు.

వాస్తవానికి రెండు దేశాలు కుదురుగా కూర్చొని సరిహద్దుల విషయంలో స్పష్టమైన అవగాహనకు, ఒప్పందానికి వస్తే ఇటువంటి అమిత్ర వాతావరణం తరచుగా తలెత్తడానికి ఆస్కారం లేకుండా పోతుంది. వాణిజ్యాది రంగాల్లో మరింత చేరువకావడానికి అవకాశాలు విశేషంగా పెరుగుతాయి. భారత చైనా సరిహద్దుల్లో దాదాపు 24 చోట్ల రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. అక్సాయ్ చిన్‌లో 38,000 చదరపు కిలోమీటర్లను చైనా దురాక్రమించుకొన్నదని ఇండియా భావిస్తున్నది. తూర్పు సెక్టార్‌లో భారత భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ వరకు గల 90 వేల చ.కి.మీ ప్రాంతం తనదేనని చైనా అంటున్నది. సామరస్యపూర్వకమైన వాతావరణంలో యథాతథ స్థితికి కొంచెం అటుఇటుగా శాశ్వత పరిష్కారాన్ని సాధించుకోడం అసాధ్యం కాదు. కాని చైనా ఇందుకు సహకరించడం లేదు. అదేమైనప్పటికీ ప్రస్తుత సరిహద్దు వివాదానికి శాంతియుతంగా తెరపడుతుందని ఆశించాలి. అదే సమయంలో భారత ప్రభుత్వం చైనా బెదిరింపు, బ్లాక్‌మెయిల్ వ్యూహానికి లొంగకుండా దృఢ చిత్తంతో వ్యవహరించాలి. చైనా దళాలు తిరిగి వాటి స్వస్థానానికి వెళ్లేలా చూడాలి. ఇందుకు అంతర్జాతీయ సమాజం మనకు పూర్తి సహకారాన్ని ఇస్తుందని ఆశించవచ్చు.