లక్నో: భారత మాజీ క్రికెటర్, యుపి మంత్రి చేతన్ చౌహాన్ ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో మెదాంత ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జూలై 12న చౌహాన్ కు కరోనా సోకడంతో లక్నోని సంజయ్ గాంధీ పిజిఐ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో గురుగ్రామ్ లోని మెదాంత ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తున్న సమయంలో ఆయనకు కిడ్నీ, బిపి సమస్యలు తలెత్తాయి. అతడి శరీరంలోని చాలా అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చేతన్ చౌహాన్ భారత్ తరపున 40 టెస్టులు ఆడారు. భారత్ మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తో చాలా కాలం ఓపెనర్ గా బరిలో ఉన్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ లో ఆయన వివిధ పదవుల్లో పని చేశారు. చేతన్ చౌహాన్ కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.