Home తాజా వార్తలు మాజీ మంత్రి పి.రామస్వామి కన్నుమూత

మాజీ మంత్రి పి.రామస్వామి కన్నుమూత

Ex Minister P Ramaswamy died at Apollo hospital

 

1969 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర
ప్రత్యే రాష్ట్రంసిద్ధించేవరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ
సిఎం కెసిఆర్ సంతాపం

మనతెలంగాణ/గోషామహల్: అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పతంగి రామస్వామి(85) బుధవారం సాయంత్రం మృతిచెందారు. ఆయనకు భార్య సాధనాబాయి, కుమారుడు పి మాణిక్‌రావు, 5గురు కూతుళ్లు ఉన్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ రామస్వామి బుధవారం మృతిచెందారు. గోషామహల్ నియోజకవర్గానికి చెందిన రామస్వామి 1965లో స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్‌గా గెలిచారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

రాష్ట్రం వచ్చే వరకు తన గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేశాడు. గడ్డం పెంచడంతో స్థానికు ఆయన్ను ముద్దుగా గడ్డం రామస్వామి అని పిలిచేవారు. 1983లో మహరాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో 1985లో నాదెండ్ల భాస్కర్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ మినిస్టర్‌గా పనిచేశారు. 1999లో మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌పై బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను నాలుగు రోజులు క్రితం కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సిఎం కెసిఆర్ సంతాపం
మాజీ మంత్రి పి.రామసామి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పి.రామస్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా నిరాఢంబరమైన జీవితం గడిపిన రామస్వామి, నిజాయితీగా ప్రజలకు సేవలందించి మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరొందారని అన్నారు. రామస్వామి మరణం రాష్ట్రానికి తీరని లోటు లని పేర్కొన్నారు.

సంతాపం తెలిపిన మంత్రులు
మాజీ మంత్రి పి.రామస్వామి మృతి పట్ల ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. తొలి తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి సేవలందించిన ఆయన మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేశారని, రాష్ట్ర ఏర్పడేంత వరకు గడ్డం తీయనని 1969లో దీక్ష చేపట్టారని పేర్కొంటూ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. అలాగే మాజీ మంత్రి పి.రామస్వామి మృతి పట్ల మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

గవర్నర్ దత్తాత్రేయ సంతాపం
మాజీ మంత్రి పి.రామస్వామి గారి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు.రామస్వామి తనకు చదువుకునే రోజులనుండి పరిచయమని, తామిద్దరూ గౌలిగూడ ప్రాంతం ప్రాంత వాసులమని అన్నారు. కార్పోరేటర్ స్థాయి నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎంఎల్‌ఎగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. రామస్వామి నీతికి నిజాయితీకి మారుపేరని, రాజకీయ జీవితంలో మచ్చ లేని నాయకునిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.

Ex Minister P Ramaswamy died at Apollo hospital