Home తాజా వార్తలు మహిళల ప్రగతికి ప్రతిబంధకాలు

మహిళల ప్రగతికి ప్రతిబంధకాలు

kavitha
సరైన అవగాహన, కఠోర శ్రమతోనే సాధికారత సాధ్యం

లింగ వివక్షపై అవగాహనను పెంచుకోవాలి, పని ప్రదేశాల్లో వేధింపులను అంతం చేసేందుకు కృషి జరగాలి, పురుషులలోనూ చైతన్యం కలిగించాలి : కవిత

మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయమహిళ అన్నిరంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ ఇంకా పైపైకి ఎదగాలంటే కఠోర పరిశ్రమ అవసరమని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. మహిళ ఎదుగుదల అవకాశాలను అడ్డుకునేందుకు సమాజంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రధానంగా లింగవివక్ష దీనికో కారణమన్నా రు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ జా గృతి,యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ఇం డియా సంయుక్త ఆధ్వర్యంలో డెవెలపింగ్ ఉ మెన్ లీడర్ షిప్ ఎ రోడ్ మ్యాప్ టూ సక్సైస్ పై రెండురోజుల సదస్సు ప్రారంభం అయింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సరైన అవగాహనతోనే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని చెప్పారు.

లింగ వివక్షత, మహిళాసాధికారితపై పురుషులకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి లక్ష్యాల్లో 5వ అంశమైన లింగసమానత్వం అంశంపై విస్తృత చర్చలు జరపాలని చెప్పారు. అన్నిరంగాల్లో మహిళలు భాగస్వామ్యం వహించాలంటే లింగవివక్షతపై సమగ్రఅవగాహన అవసరమన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పనిప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే లింగవివక్షతను రూపుమాపేందుకు చర్చజరగాల్సిన అవశ్యకత ఉందన్నారు. మహిళలు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అభివృద్ధి సాధించిన మహిళలు అభివృద్ధి చెందుతున్నమహిళలకు చేయూతనివ్వాలని చెప్పారు. ప్రధానంగా మహిళాసాధికారితకు సమాజంలో ఉన్న అడ్డంకులు, లింగసమానత్వ అంశంపై సమగ్రంగా విశ్లేషించాలన్నారు.

స్వశక్తితో ఎదుగుతున్న మహిళలు

ప్రపంచవ్యాప్తంగా స్వశక్తితో మహిళలు ఎదుగుతున్నారని కవిత చెప్పారు. అయితే మరింత ఉన్నతిని సాధించేందుకు సరైన మార్గంలో అత్యుత్తమంగా అడుగులు వేయడానికి ఈసదస్సులో ఇచ్చే శిక్షణ ఎంతో ఉన్నతమైందని చెప్పారు. విభిన్న వేదికలపై మహిళా సాధికారిత గురించి ఎంతగానో మాట్లాడినప్పటికీ మనవంతుగా ఎంతో కొంత ప్రయత్నం చేసినప్పుడే ఫలితం కనిపిస్తోందన్నారు. ఔత్సాహకులు, ప్రతిభావంతులైన మహిళలను గుర్తించి వారితో పరిశ్రములు ఏర్పాటు చేయిస్తున్న గ్లోబల్ కాంపాక్ట్ నెట్ వర్క్ ఇండియా ప్రతినిధులను పార్లమెంట్ మాజీ సభ్యురాలు కవిత అభినందించారు. తమిళనాడు కోయంబత్తూర్‌లో చదువురాని ఒక ఔత్సాహిక మహిళ సొంతంగా పరిశ్రమపరిశ్రమ ఏర్పాటు చేసి 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు.

మహిళలకు విశ్రాంతి దొరకడం కష్టం

పట్టుదలతో ఏదోసాధించాలనే లక్షంతో ముందుకు దూసుకుపోతున్న మహిళలకు విశ్రాంతి తీసుకునే సమయంకూడా దొరకడం కష్టంగా ఉందన్నారు. తాను ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి ఇంటిపనులు చేసి, పిల్లలను స్కూల్‌కు పంపించేంతవరకు ఎంతో బిజీగా ఉంటానని ఆతర్వాత ఇతర పనులకు సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. సమయానికి ఎదురీదుతూ తనపిల్లలకోసం తగిన సమయం కేటాయిస్తున్నట్లు కవిత చెప్పారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మహిళలు సక్సెస్ అవడం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదన్నారు.

జీవితంలో విజయం సాధించేందుకు అన్ని అర్హతలు స్త్రీలకు ఉన్నాయన్నారు. ఇక లింగ వివక్షత,మహిళా సాధికారితపై పురుషులకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మహిళలు అభివృద్ధిలో మరింత దూసుకుపోతారన్నారు. మహిళలకు సరైన అవకాశాలు కల్పించడంపై వివిధ సంస్థలు,కంపెనీలు, రాజకీయ పార్టీలలో ఉన్న పరురుషులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినప్పుడే మహిళా సాధికారిత సంపూర్ణంగా సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు రానున్న కాలంలో మరికొంతమంది మహిళలకు చేయూతనివ్వాలని చెప్పారు. మహిళలలు తాము చేస్తున్న పనుల్లో ఉన్నతస్థానాలకు ఎదిగి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ కాంపాక్ట్ నెట్ వర్క్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమల్‌సింగ్ మాట్లాడుతూ మహిళసాధికారిత కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనేకరంగాల్లో విజంయం సాధించిన మహిళలతో సమావేశాలు ఏర్పాటుచేసి వారి అనుభవాలను ఇతర రంగాల్లోని మహిళలకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపి కవిత ఎంతో మంది మహిళలకు ఆదర్శమని అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసినందుకు, మహిళలకోసం చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ మాజీ ఎంపి కవితను యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆర్‌ఆర్ శర్మ, డాక్టర్ శంకర్ గోయంక, ఎంసి తమన్నా మరియు ఇతర ప్రతినిధులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వ,ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు, తెలంగాణ జాగృతి వివిధ జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

EX MP Kavitha Speech In Develop Women Leadership