Tuesday, April 23, 2024

స్వచ్ఛ సైనికుడు బుచ్చిరాం

- Advertisement -
- Advertisement -

Ex Sarpanch Engaged in village service

 

తొంభై ఏళ్లవయస్సులో గ్రామ సేవలో నిమగ్నం

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు సేవచేయాలనే తపన, సొంత గ్రామంపై మక్కువ ఉండాలే కానీ ప్రజాప్రతినిధులే కావల్సిన అవసరంలేదు. ఏడుపర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా గెలిచి గ్రామాన్ని ఎంతో అభివృద్ధివైపుకు తీసుకువెళ్లినా ఇంకా ఆయనలో గ్రామాభివృద్ధి చేయాలనే తపన తగ్గక స్వచ్ఛ సైనికుడిగా బుచ్చిరాం మారారు. తొంబై ఏళ్లవయస్సులో ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛను తీసుకుంటూ గ్రామసేవకే అంకితమయ్యాడు కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కమ్మర్‌గాం మాజీ సర్పంచ్ పోర్తేటిబుచ్చిరాం. అనేక పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేసినా సొంత ఆస్తులు కూడబెట్టలేదు. వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి వ్యవసాయం, వృద్ధాప్య పింఛన్‌తోనే జీవిస్తూ గ్రామసేవలో నిమగ్నమయ్యారు. అయితే 90 ఏళ్ల బుచ్చిరాం తమగ్రామాన్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని, ఊరు అద్దంలా మెరిసిపోవాలని ప్రతిరోజు గ్రామంలో స్వయంగా చెత్త ఎత్తుతూ, పిచ్చిమొక్కలు పీకుతూ, ఊడుస్తూ స్వచ్ఛభారత్ చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారు.

ఇక ఆయన వివరాల్లోకి వెళ్లితే 1975 నుంచి1980 వరకు, 1980 నుంచి 1985 వరకు, 1986 నుంచి 1990వరకు, ఆతర్వాత 1990 నుంచి 1996 వరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతర్వాత 2001 నుంచి 2006 వరకు, 2007 నుంచి 2011 వరకు ఆయన గ్రామ సర్వంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే వృద్ధాప్యం రావడంతో రాజకీయాలు తనకు పనికి రావని భావించి స్వచ్ఛందంగా పరిశుభ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఊరి జనం బాగుండాలన్న తపన, తాపత్రాయం మాత్రం ఆయనలో తగ్గలేదు. వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా స్వచ్ఛసైనికుడిగా మారి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. బుచ్చిరామ్‌కు వంశపారంపర్యంగా ఉన్న కొద్దిపాటి భూమి, రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న రూ.2వేల రూపాయల పింఛనే ఆయన జవితానికి ఆధారం అయినప్పటికీ సొంతఊరే చెరగని ఆస్తిగా భావిస్తూ స్వచ్ఛసైనికుడిగా పనిచేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News