Friday, March 29, 2024

కాన్పుకు వెళ్తే కాటికి పంపారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు మలక్‌పేట ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో దవాఖానా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింతలు చనిపోయారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్డండ మండలం చెదరుపల్లి గ్రామానికి చెందిన మహేష్ తన భార్య సిరివెన్నెల (23)తో కలిసి నగరంలో నివాసముంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. సిరివెన్నెలకు ఆపరేషన్ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అనంతరం అస్వస్థతకు గురికావడంతో వైద్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల మృతి చెందింది. దీంతో మలక్‌పేట ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్షంగానే చనిపోయిదంటూ ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆసుపత్రి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఆసుపత్రి బైఠాయించారు. మరోవైపు తిరుపతికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ జగదీష్ తన భార్య శివానిని ఈనెల 9వ తేదీన మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో ఆమె బాబుకు జన్మనిచ్చిన అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో మలక్‌పేట ఆసుపత్రి వైద్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని ప్రాణాలు కోల్పోయింది.

ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం లేదు : వైద్యాధికారి సునిత

మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో బాలింతల మృతిపై వైద్యుల నిర్లక్షం లేదని వైద్యాధికారి సునీత వెల్లడించారు. సిరివెన్నెలకు డెంగ్యూ ఫీవర్ లేదని, డెంగ్యూ ఉంటే తాము ప్రసవం చేయమని తెలిపారు. అన్ని పరీక్షలు చేశాకే కాన్పు చేస్తామని డెలివరీ తరువాత సిరివెన్నెలకు బిపి పెరిగిందని హార్ట్ ప్రాబ్లమ్ రావడంతో గుండె సంబంధిత వైద్యులను సంప్రదించాల్సిందిగా వైద్యులు సూచించడంతో వెంటనే గాంధీకి తరలించామన్నారు. గాంధీలో చికిత్స పొందుతూ సిరివెన్నెల మృతి చెందిందని, సంఘటనపై పూర్తి విచారణ చేపడుతామన్నారు. అదే విధంగా శివానికి హైపోథైరాయిడ్ సమస్య ఉందని, ఫిజిషియన్ సంప్రదిస్తే ఇది హైరిస్క్ కేసు చెప్పారన్నారు. నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో 11వ తేదీన కాన్పు చేశారని ఆమె తెలిపారు. మరుసటి రోజు అస్వస్థతకు గురై కళ్లు తిరగడం, కనిపించకపోవడం, చెమట పట్టడం లాంటి ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులకు చెప్పిందని అప్పుడు సివిల్ సర్జన్ అభిప్రాయం తీసుకుని వెంటనే గాంధీకి తీసుకెళ్లారని అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజూమున శివాని మృతి చెందినట్లు ఆమె తెలిపారు.

మలక్‌పేట ఏరియా ఆసుపత్రి ఘటనపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ 

రోగ్యశాఖ కమిషనర్ అజయ్‌కుమార్ నగరంలోని మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ వేశామని ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కమిటీ ఇచ్చే దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. వీరిద్దరికి సర్జరీ జరిగిన రోజే మరో పదకొండు సర్జరీలు కూడా జరిగాయి. మిగిలిన వారికి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాలేదన్నారు. కానీ వీరిద్దరికే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరికొన్ని జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. అదే విధంగా ఆర్డీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడమని, చనిపోయిన బాలింతల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. వెల్దండ గ్రామానికి చెందిన బాలింత దళిత కుటుంబ కావడంతో స్థానిక ఎమ్యెల్యేలతో మాట్లాడినట్లు వారికి మరిన్ని సదుపాయాలు కలిగించేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News