Home తాజా వార్తలు ఉన్నది ఒక్కటే జిందగీ

ఉన్నది ఒక్కటే జిందగీ

 

ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు… అసలు వాళ్ళకు ఏం కావాలి? అని ప్రశ్నలు వేస్తే చాంతాడంత జాబితా రావచ్చు. కానీ ఆధునిక మహిళ సరైన వస్తువులు, సరైన యాటిట్యూడ్ అలవర్చుకొంటే జీవితం ఆమెకు సులువుగా, సక్సెస్ ఫుల్‌గా నడిచిపోతుంది ఇవన్నీ మీకు పనికి వస్తాయి. మీ ప్రయారిటీ లిస్ట్‌లో ఉంచుకోండి అని కొన్ని చక్కని సలహాలు ఇస్తున్నారు ఎక్స్‌పర్ట్. అవేంటో చూసేద్దాం…

నవ్వు మొహానికి వెలకట్టలేని ఆభరణం. చక్కగా నవ్వుతూ పలకరిస్తే ఎంతటి వాళ్లయినా స్నేహం చేస్తారు. కొన్ని ప్రొఫెషన్స్, కొన్నింటికే కాదు అన్ని ఉద్యోగాలకు నవ్వుమొహమే పెద్ద ప్లస్ పాయింట్. ఎంత నవ్వితే, ఎన్ని ఎక్కువసార్లు నవ్వితే అంత ఆనందంగా ఉన్నట్లు. పైగా హాయిగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాళ్లలో శారీరక, మానసిక ఆరోగ్యాలు బావుంటాయి. వజ్రాల నగల కంటే విలువైన ఆభరణం నవ్వే.

ఇది గొప్ప ఔషధం. శారీరక, మానసిక ఆరోగ్యాలని ఇచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచి, అనారోగ్యాలనింటినీ మటుమాయం చేస్తుందీ నవ్వు. చక్కని దరహాసంతో ఉంటే చాలు అన్ని మానవ సంబంధాలు బావుంటాయి.

సెన్సాఫ్ హ్యూమర్: ముఖ్యంగా ప్రతి సరదాను ఆహ్లాదంగా ఆస్వాదించ గలగాలి. ఎదుటివాళ్ళు ఏదైనా జోక్ చేసినా, చిన్న విమర్శ ఎదురైనా దాన్ని పాజిటివ్‌గా తీసుకోగలగాలి. చక్కగా నవ్వేసి వాతావరణాన్ని తేలిక చేయాలి ఇది ముఖ్యమైన లక్షణంగా చెపుతారు నిపుణులు.

మనల్ని మనం ప్రేమించుకోవాలి: మన ఎదురుగ్గా ఉన్న అద్దం అబద్ధం చెప్పదు. మనం ఎలా ఉంటామో మనకు తెలుసు. అయితే శారీరపు రంగు, కొలతలు ఇవేమీ మనల్ని నిర్ధారించేవి కావు. ఎవరి కోసమో, ఎవరి దగ్గరకో మన శరీర సౌందర్యాన్ని ప్రశంస కోసం పరిచి పెట్టనక్కర్లేదు. ప్రశంసలు అవసరం లేదు. వ్యాఖ్యానాలు పట్టించుకోనక్కర్లేదు. ఎవరి శరీరాన్ని వాళ్ళు ప్రేమించుకోవాలి. శరీరం మన సొంతం. బరువు తగ్గాలనుకొంటే తగ్గాలి. మన ఇష్టం కొద్దీ, మార్పులు కావాలంటే చేసుకోవాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలి అంతే. స్లిమ్‌గా ఉండటం కూడా మనకోసం, మన ఆరోగ్యం కోసం, మన సంతోషం కోసమే. ఎవరో ఏర్పాటు చేసిన సౌందర్యపు కొలతల్లో మనం ఇమిడిపోవలసిన అవసరం లేనేలేదు. మనం ఎలా ఉండదలిస్తే అలా ఉండిపోవాలి.

వస్త్రధారణ: మనం ధరించే వస్త్రాలు మన లోపలి ఆలోచనలకు ప్రతిబింబంగా ఉండాలి. ఫ్యాషన్‌ని మెచ్చితే ఆధునికంగానే ఉండితీరచ్చు. సంప్రదాయ సిద్ధంగానే మనకు కంఫర్ట్‌గా ఉంటుందీ అనుకుంటే అలాగే ఉండాలి కూడా. ఈ విషయంలో ఎవరి సలహాలు సంప్రదింపులు వద్దు. మనం మనకి ఎంత అందంగా లేదా హుందాతనంతోనో, లేదా బావుంటేనే అలాంటి వస్త్రధారణతోనే హాయిగా ఉండచ్చు. ఎవరినో మెప్పించేందుకు మనం ఫలాన వస్త్రధారణలో ఉండాలి అనుకోవటం మనల్ని మనం పోగొట్టుకోవటమే.

సరిగ్గా నడవాలి: ఇది ప్రతీ ఆడపిల్లా గుర్తుంచుకొని అలవాటు చేసుకోవలసిన అంశం. నడక స్థిరంగా, తిన్నగా ఉండాలి. అలా నడవకపోతే వెన్నుకు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి. మనం స్టయిల్‌గా లేదా సున్నితంగా, లేదా అందంగా నడవొద్దు. ధైర్యంగా తలెత్తుకొని చక్కగా నడవాలి. నడక ఆత్మవిశ్వాసాన్ని చూపెడుతుంది. మనకి ఆత్మస్థైర్యం ఉండాలి. చక్కని పలువరుస లేదని నవ్వటం మానేయటం, పొట్టిగా ఉన్నామని అంతులేని ఎత్తు చెప్పులతో కష్టపడి నడవడం, ఎవరికో నచ్చేందుకు వస్త్రధారణలో మార్పులు చేసుకోవటం పరమ దండగ. ముందు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి.

స్వచ్ఛమైన స్నేహం: స్నేహం అనే రెండక్షరాల పదానికి గొప్ప మంత్రశక్తి ఉంటుంది. అది మనకు ఎంతో మంది స్నేహితులను సంపాదించి పెడుతుంది. జీవితంలో ఏకాంతం లేకుండా చేస్తుంది. మన చుట్టూ స్నేహ పరిమళాలు, మనుష్యులతో నిండిన ఉద్యానవనాలు ఉంటాయి. జీవితంలో నిండుగా ఉంటుంది. స్నేహాలు ఉంటేనే మద్దతు, తోడు, భరోసా ఉంటాయి. స్నేహంలో స్వచ్ఛత ఉన్నప్పుడే దగ్గరితనం ఉంటుంది. ఎవరికీ చెప్పుకోలేని విషాదాలు, ఫెయిల్యూర్‌తో ఆనందాలు, ఏదైనా ఒక్క స్నేహితులతోనే మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు. ప్రతి మహిళలకు తప్పనిసరిగా స్నేహితులు ఉండాలి.

కలలు కనాలి: కలాం చెప్పినట్లు చక్కని కలలు ప్రతి ఒక్కళ్ళు కనాలి. వాటిని సాకారం చేసుకొనే దిశగా కృషి చేయాలి. చక్కని కలలంటే అవి జీవితాన్ని వెలిగించే(విగా) కలలు, భవిష్యత్‌ను తీర్చిదిద్దుకొనే కలలు అవి అందరూ కనాలి. ఆ దిశగా ప్రయాణం పెట్టి కృషి చేసి సఫలం చేసుకుంటేనే జీవితం లభిస్తుంది.

చదువుకొనే వయసులో ఎంత చదవాలి, ఆ చదువుతో ఏం సాధించాలి, జీవితంలో ఎలా స్థిరపడాలి ఏం చేస్తే సుఖంగా ఉంటాం, పెళ్ళయితే ఆ పెళ్ళిని జీవితాంతపు స్నేహంగా ఎలా మలుచు కోవాలి ఇవన్నీ ప్రతి యువతి కనవలసిన కలలు. తప్పని సరిగా కలలు కనాలి. ఆ కలలు భవిష్యత్‌కి, సోపానాలు కావాలి.

నో చెప్పటం నేర్చుకోవాలి: ‘నో’ అన్న పదానికి ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. మనకిష్టంలేని ఏ పనికైనా నిబ్బరంగా ‘నో’అని చెప్పాలి. మొహమాటం, చెప్పలేను అన్న పదాలు వద్దు. ఒక మనిషి అనవసరమైన చనువు తీసుకొంటుంటే ముందే వద్దని చెప్పాలి. ప్రేమ చూపిస్తుంటే అది మన జీవితానికి సరిపడుతుందో లేదో మనసు చెప్పే మాట విని ఆ ప్రేమ ను యాక్సెప్ట్ చేయటమా లేదా ‘నో’ చెప్పటమా తేల్చుకోవాలి.

పరిచయస్తులు, స్నేహితులు, బంధువులు, చివరకు కన్న తల్లిదండ్రులకైనా మనకు నచ్చని విషయాల్లో ‘నో’ చెప్పటం తప్పేమీ కాదు. ఎవరో ఏదో అనుకొంటారని తల ఊపేయటం తప్పే. ఒకసారి ‘నో’ అని చెప్పాక, ఎవరూ ఏదీ చేయమని బలవంత పెట్టలేరు. ‘ఎస్’ చెప్పడానికి ఆత్మ విశ్వాసం కావాలి. ఈ రెండింటినీ సరిగ్గా వాడుకోగలగటం మన నేర్పు.

ముందుకు నడవాలి: జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా ముందుకే నడవాలి. నచ్చినవి, నచ్చనవి ఏం జరిగినా అడుగులు ముందుకు పడాలి ఆ బలం, మనోధైర్యం చాలా అవసరం. ఎలాంటి వైఫల్యాలలోనూ వెనక్కి తగ్గకూడదు. వాటిని అధిగమించి ముందుకు సాగే మనోధైర్యం ప్రతి మహిళకూ ఉండాలి. జీవితం ఎప్పుడూ ఎన్నో సవాళ్ళు మన ముందు ఉంచుతూ ఉంటుంది. ప్రతి విషయం దాటలేని సందిగ్ధంలో ముందుంచుతుంది. అప్పుడే ధైర్యంగా ఉండాలి. ఆ సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, విశ్లేషించుకొని సవరించుకొని ముందుకు ధైర్యంగా అడుగులు వేయాలి. భయం అన్నది మనకు ఎదురయ్యే ఒక బలహీనత. దాన్ని జయిస్తే అంతా ప్రశాంతతే. ఒక వైఫల్యం మనసుకి గాయం చేయగానే దాన్ని పక్కన పెట్టి ముందుకు సాగే సంయమనాన్ని అలవర్చుకోవాలి. ఒక నష్టం ఒక తలుపును మూసేస్తూ ఉంటే, ఇంకో కిటికీని వెంటనే తెరిచే చాకచక్యం మనకుండాలి.

అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా సరే ముందుకు సాగగలిగే మనోధైర్యం, ప్రతి మహిళకూ ఉండాలి. ఒక సంకల్ప బలం మనల్ని ఎప్పుడూ ఉన్నత శిఖరాలపైన ఉంచుతుంది. ఎప్పుడూ మనకే సొంతమైన చిరునవ్వు మనల్ని గుర్తు చేసే ఒక చక్కని పెర్‌ఫ్యూమ్. పరిమళంతో, ధైర్యంతో సహనంతో ఈ ప్రపంచాన్ని గెలిచి, నన్ను నేను నిలబెట్టుకోగలననే నమ్మకంతో, చుట్టూ పది మంది స్నేహితులతో, జీవితం పట్ల ఒక విజన్‌తో, సెన్సాఫ్ హ్యూమర్‌ని ఒక ఆభరణంగా మనసులో దాచుకొని, మనకు దొరికిన ఒక అద్భుతమైన జీవితాన్ని జీవితేచ్ఛతో జీవించాలి.

                                                                                                                              – సి. సుజాత
Experts gives tips for happy life to women