Friday, March 29, 2024

వీడని ‘నవ’ మిస్టరీ

- Advertisement -
- Advertisement -

Extensive investigation into warangal deaths

 

పోలీసుల అదుపులో ఇద్దరు బీహారీలు
వివాహేతర సంబంధం కోణంలోనూ ఆరా
కీలకం కానున్న కాల్‌డేటా
వరంగల్ బావిలో శవాలై తేలిన 9 మంది ఉదంతం మూలాలపై విస్తృతంగా దర్యాప్తు

మన తెలంగాణ/వరంగల్ క్రైం/గీసుకొండ : గొర్రెకుంట శివారులోని పాడుబడ్డ బావిలో తొమ్మిది మంది శవాలై తేలిన ఘటన చిక్కుముడి వీడలేదు. మిస్టరీగా మారిన ఈ ఘటన నిగ్గు తేల్చేందుకు పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. అయితే వివాహేతర సంబంధమే ఈ ఘటనకు మూలకారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని ఓ గోదాంలో గన్నీ సంచుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మసూద్ అతని కుటుంబసభ్యులు, అతని కుమార్తెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఒకేసారి బావిలో శవాలై తేలడం మిస్టరీగా మారింది. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం చేయించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో పూర్తిస్థాయి వివరాలు తెలియరాకపోవడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఈ కేసులో ఇంటి యజమాని మసూద్ సూత్రధారి కావొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు యువకులను ప్రణాళిక ప్రకారం అంతమొందించిన మసూద్ కుటుంబసభ్యులతో సహా తానూ ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివాహేతర సంబంధమే కారణమా..?

మసూద్ కుమార్తె బుస్రా తన భర్తతో విడాకులు తీసుకొని మూడేళ్ల కొడుకుతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. అయితే కరీమాబాద్‌కు చెందిన ఓ యువకుడితో బుస్రా సన్నిహితంగా ఉండడంపై కుటుంబంలో పలుమార్లు గొడవలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. అక్కడే ఉంటున్న బీహారీ యువకులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. బుస్రా కరీమాబాద్‌కు చెందిన యువకునితో సన్నిహితంగా ఉండడంపై కుటుంబంలో కలహాల చిచ్చురేగి ఈ సామూహిక మారణకాండకు దారితీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్తె ప్రవర్తనతో పరువుపోతుందని భావించిన మసూద్ ఇంట్లో పార్టీ ఉందని బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాం, త్రిపురకు చెందిన షకీల్‌లను ఇంటికి పిలిపించి విష ఆహారం పెట్టి ఆ తరువాత అంతమొందించి మృతదేహాలను బావిలో పడవేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని అంతమొందించిన అనంతరం కుటుంబసభ్యులతో కలిసి మసూద్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని తెలుస్తుంది.

పోలీసుల అదుపులో ఇద్దరు బీహారీలు

కేసు విచారణలో పోలీసులు ముందడుగు వేశారు. బీహార్‌కు చెందిన సంజయ్, మోహన్ అనే ఇద్దరు యువకులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. మృతుడు మసూద్ చనిపోయే ముందు తన సెల్‌ఫోన్ నుంచి చివరగా బీహార్ యువకుల ఇద్దరికి ఫోన్ చేసినట్లు , అందుకే వారిరువురుతో ఏం మాట్లాడాడు.. అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు వారిని విచారిస్తున్నారు.

కీలకం కానున్న కాల్‌డేటా

పోలీసులు మృతుల సెల్‌ఫోన్‌లో నెంబర్లు సేకరించి వారి సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కాల్‌డేటా విశ్లేషణ కోసం ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మృతులు సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించడం వలన ఎవరి నుంచి ఎవరికి కాల్స్ వెళ్లాయి.. అనే విషయం తేలిన తరువాత ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. కేసు విచారణలో కాల్‌డేటా కీలకంగా మారనుంది. మృతుల్లో కొందరి సెల్‌ఫోన్ స్నిగ్నల్స్ వర్ధన్నపేట సమీపంలో చివరిసారిగా ట్రేసింగ్ అయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు జాగిలాలతో సెల్‌ఫోన్‌లు స్విచ్ఛాఫ్ అయిన ప్రాంతాన్ని గుర్తించి పోలీసు జాగిలాలతో అక్కడ విచారణ చేసి తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. శనివారం పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి సైతం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి, మామునూరు ఎసిపి శ్యాంసుందర్, గీసుకొండ సిఐ శివరామయ్యల ఆధ్వర్యంలో సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించారు.

పకడ్భందీగా దర్యాప్తు : హోం మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ ః వరంగల్ జిల్లా గొర్రెకుంట సంఘటనపై పకడ్భందీగా దర్యాప్తు జరపాలని వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్‌కు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ శనివారం నాడు ఆదేశాలిచ్చారు. వరంగల్ జిల్లా గొర్రెకుంట గ్రామ పరిధిలోని గోనె సంచుల గోదాం సమీపంలోని బావిలో గురువారం నాలుగు, శుక్రవారం నాడు ఐదు మృతదేహాలు బయట పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై హోంమంత్రి వరంగల్ కమిషనర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఒకేసారి తొమ్మిది మృతదేహాలు ఒక బావి నుంచి బయటపడటంతో ఈ సంఘటనపై అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని, అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చారు. మృతులు ఇతర రాష్ట్రాల వారు కావడంతో వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను పోస్టుమార్ట అనంతరం అప్పగించాలన్నారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మృతుల కుటింబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News