Home సినిమా ప్రేక్షకులు నవ్వుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు

ప్రేక్షకులు నవ్వుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు

వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్2’. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన సక్సెస్‌మీట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ.. “సినిమా హిట్, సూపర్‌హిట్ అనుకుంటే ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేసేశారు. సినిమా చూసి నవ్వుతున్న ప్రేక్షకుల కళ్లలో ఆనందం చూసినప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చేశాయి. గణేష్, ప్రేమించుకుందాం రా, బొబ్బిలిరాజా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి… ఇలా చాలా చిత్రాలు నాకు మంచి హిట్‌నిచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌లకు థాంక్స్. సినిమాలో వరుణ్ చాలా మంచి నటనను కనబరిచాడు”అని అన్నారు.

వరుణ్‌తేజ్ మాట్లాడుతూ “కామెడీ కోసం చిరంజీవి, వెంకటేష్ సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. చిరంజీవి సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయితే… వెంకటేష్‌తో ఈ సినిమాకు పనిచేసి ఇన్‌స్పైర్ అయ్యాను. కామెడీ సీన్స్‌లో వెంకటేష్‌తో నటించాలంటే భయంగా ఉండేది. ఎలా చేస్తానో అనుకునేవాడిని. కానీ ఆయన ఓ సోదరుడిలా నాకు సపోర్ట్ చేశారు. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే ‘ఎఫ్3’ చేయబోతున్నాను. ‘ఎఫ్2’నే ఇలా ఉంటే ‘ఎఫ్3’ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి”అని తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ “మా బ్యానర్‌లో ఇది 31వ సినిమా. ఇంత మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చేసిన అనిల్‌కు థాంక్స్. వెంకటేష్, వరుణ్ అద్భుతంగా చేశారు. సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో వెంకటేష్ 50 కోట్ల క్లబ్‌లో చేరారు. ‘ఫిదా’తో వరుణ్ 50 కోట్ల క్లబ్‌లో చేరారు. ఇప్పుడు ఇద్దరికీ కలిపి ఈ సినిమా 50 కోట్ల సినిమా అయ్యింది”అని పేర్కొన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ “కామెడీ చేయడంలో వెంకటేష్‌కు మనం చెప్పేదేముండదు. ఆయనకొక లైబ్రరీ. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. వెంకటేష్‌తో కలిసి వరుణ్‌తేజ్ కామెడీ బాగా చేశారు. ఇక నవ్వును మేం ఇచ్చినందుకు ప్రేక్షకులు నవ్వుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. నా జీవితంలో ఈ సంక్రాంతి నవ్వుల సంక్రాంతి”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెహరీన్, అనసూయ, ప్రగతి పాల్గొన్నారు.

F2 Movie Success meet